బీజేపీ గెలుపు గుర్రాల వేట

BJP MLA Candidate List Is Ready In Adilabad - Sakshi

సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ఎన్నికల్లో గెలుపు ముంగిట బోర్లా పడుతున్న భారతీయ జనతా పార్టీ(బీజేపీ) ఈసారి పక్కా వ్యూహంతో ఫలితాలు సాధించాలనే పట్టుదలతో ఉంది. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని పట్టణ ప్రాంతాల్లో పార్టీకి ఆదరణ ఉన్నా, దానిని ఎన్నికల వేళ అనుకూలంగా మలుచుకోవడంలో గత కొన్నేళ్లుగా పార్టీ వెనుకబడిపోయింది. ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీతో మిత్రపక్షంగా పోటీ చేసిన స్థానాల్లో కూడా జిల్లా నుంచి ఈ పార్టీ ఏనాడూ గెలుపు దరి చేరలేదు. గత 2014 ఎన్నికల్లో జిల్లాలోని నాలుగు స్థానాల నుంచి బీజేపీ పోటీ చేయగా, ముథోల్, ఆదిలాబాద్‌ నియోజకవర్గాల్లో 15వేల ఓట్లలోపు స్వల్ప తేడాతో ఓటమి పాలైంది.  దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో విజయమే లక్ష్యంగా ప్రధాని మోదీ, పార్టీ అధ్యక్షుడు అమిత్‌షా బీజేపీని ముందుకు నడిపిస్తున్న నేపథ్యంలో ఈసారి తెలంగాణపై ఆశలు పెరిగాయి.

బీజేపీ అధికారంలో ఉన్న మహారాష్ట్రకు ఆనుకొని ఉన్న ఆదిలాబాద్‌ ఉమ్మడి జిల్లాలో కూడా బీజేపీ నాయకత్వం ‘విన్నింగ్‌ ప్లాన్‌’ అమలు చేస్తుందన్న ధీమాతో ఆ పార్టీ నాయకులు ఉన్నారు. బీజేపీకి సహకరించే సంఘ్‌ పరివార్, భజరంగ్‌దళ్‌ వంటి సంస్థల కార్యకర్తలు బీజేపీతో సంబంధం లేకుండా ఇప్పటికే నియోజకవర్గాల వారీగా తమ యాక్షన్‌ ప్లాన్‌ అమలు చేస్తుండడం కలిసి వచ్చే అంశంగా భావిస్తున్నారు. అదే సమయంలో ఉమ్మడి జిల్లాలో ఇప్పుడు పార్టీకి బలమున్న స్థానాలతోపాటు మిగతా నియోజకవర్గాల్లో కూడా టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ అభ్యర్థులను తట్టుకునే ధీటైన అభ్యర్థుల కోసం వెతుకులాట ప్రారంభించింది. పార్టీ రాష్ట్ర కోర్‌ కమిటీతో ఉమ్మడి జిల్లా నాయకుల భేటీకి మరో వారం రోజులు గడువు ఉన్న నేపథ్యంలో బలహీన స్థానాల్లో బలమైన అభ్యర్థులను వెతికే పనిలో కూడా పడ్డట్టు తెలిసింది.

4న జిల్లా నేతలతో కోర్‌కమిటీ సమావేశం
బీజేపీ అభ్యర్థుల ఎంపిక, వడబోత కార్యక్రమానికి రాష్ట్ర పార్టీ అక్టోబర్‌ 3 నుంచి శ్రీకారం చుట్టింది. 6వ తేదీ వరకు జరిగే ఈ సమావేశాల్లో అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా అభ్యర్థుల పరిశీలన, తుది ఎంపిక ఉంటుంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌.రమణ, మాజీ ఫ్లోర్‌ లీడర్‌ జి.కిషన్‌రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ, జాతీయ నాయకుడు మురళీధర్‌రావు, సంఘటనా మంత్రి శ్రీనివాస్‌ తదితరులతో కూడిన కోర్‌ కమిటీ ఉమ్మడి జిల్లాల వారీగా సమావేశాలు నిర్వహించనుంది. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా సమావేశం 4వ తేదీన జరుగనుంది.

నియోజకవర్గాల వారీగా పోటీకి ఆసక్తి చూపుతున్న అభ్యర్థుల నుంచి గెలుపు గుర్రాల ఎంపిక అప్పుడే మొదలవనుంది. ఇందుకోసం జిల్లా నేతల వద్ద ఉన్న జాబితా, రాష్ట్ర పార్టీ వద్ద ఉన్న జాబితాను పరిశీలించి నిర్ణయం తీసుకుంటారు. బలమైన అభ్యర్థులు ఉన్న స్థానాల్లో వారినే ఎంపిక చేసి, మిగతా చోట్ల అవసరమైతే కొత్తవారిని తెరపైకి తెచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఒకరిద్దరు నాయకులు ఉమ్మడి జిల్లాలో బీజేపీలో చేరగా, టికెట్ల కోసం పార్టీలోకి వచ్చేందుకు పలు స్థానాల్లో కొత్త నాయకులు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. పార్టీ కోర్‌ కమిటీ నిర్ణయం మేరకే అభ్యర్థుల ఎంపిక ఉంటుందని సమాచారం. నియోజకవర్గాల వారీగా ఆశావహుల జాబితా నుంచి బలమైన పోటీదారుల పేర్లను ఎంపిక చేసి అక్టోబర్‌ 7న ఢిల్లీకి పంపే అవకాశం ఉందని హైదరాబాద్‌ పార్టీ వర్గాల ద్వారా తెలిసింది.

నాలుగు చోట్ల అభ్యర్థులు ఖరారే..  
2014 ఎన్నికల్లో టీడీపీతో పొత్తులో భాగంగా బీజేపీ ఐదు స్థానాల్లోనే పోటీ చేసింది. మంచిర్యాల, ఆదిలాబాద్, ముథోల్, చెన్నూరులలో పోటీ చేసిన బీజేపీ కేవలం ఆదిలాబాద్, ముథోల్‌లలోనే గట్టి పోటీ ఇచ్చి రెండో స్థానంలో నిలిచింది. మంచిర్యాల, చెన్నూరులలో మూడో స్థానానికి పరిమితమైంది. అప్పట్లో టీడీపీతో పొత్తు తమను దెబ్బతీసిందని భావిస్తున్న కమలనాథులు ఈసారి ఈ నాలుగు స్థానాలతోపాటు మిగతా ఆరింట కూడా పోటీ చేసే వ్యూహంతోనే ముందుకు పోతున్నారు. ఆదిలాబాద్‌ నుంచి పాయల్‌ శంకర్, ముథోల్‌ నుంచి డాక్టర్‌ రమాదేవి, మంచిర్యాల నుంచి ముల్కల్క మల్లారెడ్డి పోటీ చేయడం ఖాయమైనట్టే. ఈ నియోజకవర్గాల్లో వీరే బలమైన నాయకులు కాగా, వీరికి పోటీగా కూడా ఎవరూ లేకపోవడం గమనార్హం. అధికార పార్టీ టీఆర్‌ఎస్‌ నుంచి ఆసిఫాబాద్‌ జెడ్‌పీటీసీగా ఎన్నికై, రాష్ట్ర జెడ్‌పీటీసీల ఫోరం అధ్యక్షుడుగా వ్యవహరిస్తున్న కొయ్యల ఏమాజీ ఏడాదిన్నర క్రితం బీజేపీలో చేరారు.

బెల్లంపల్లి నుంచి పోటీ చేయడమే లక్ష్యంగా ఆయన క్షేత్రస్థాయిలో బలం పెంచుకున్నారు. బెల్లంపల్లిలో కాంగ్రెస్, మిత్రపక్షాలకు బలమైన అభ్యర్థి లేని పరిస్థితుల్లో తమకు కలిసి వస్తుందని ఆ పార్టీ భావిస్తోంది. ఈ నాలుగు సీట్లకు వేరే నాయకుల నుంచి పోటీ లేదు. కాగా గత ఎన్నికల్లో చెన్నూరు నుంచి రామ్‌వేణు పోటీ చేయగా, ఈసారి ఆయనకు అందుగుల శ్రీనివాస్‌ నుంచి పోటీ ఉంది. ఈసారి బీజేపీ మరిన్ని సీట్లపై ప్రత్యేక దృష్టి పెట్టింది. నిర్మల్‌ నియోజకవర్గంలో గత కొన్నేళ్లుగా మల్లికార్జున్‌రెడ్డి బీజేపీ కోసం పనిచేస్తుండగా, తాజాగా మాజీ డిప్యూటీ స్పీకర్‌ భీంరెడ్డి కూతురు స్వర్ణారెడ్డి రాజకీయాల్లోకి వస్తూ బీజేపీలో చేరారు. ఇక్కడున్న ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌కు బీజేపీ గట్టి పోటీ ఇస్తుందని భావిస్తున్నారు. ఆసిఫాబాద్‌లో ప్రస్తుత సిర్పూరు–టి జెడ్‌పీటీసీ రాంనాయక్‌ పోటీ చేయాలని పట్టుదలతో ఉన్నారు. ఇక్కడ మాజీ ఎమ్మెల్యే కోవ లక్ష్మి సోదరి మాజీ సర్పంచి మర్సుకోల సరస్వతి పార్టీలో చేరి సీటు తెచ్చుకుంటారనే ప్రచారం జరుగుతోంది. సిర్పూరు, బోథ్‌ , ఖానాపూర్‌ సీట్లలో పోటీకి పార్టీ నుంచి అభ్యర్థులుగా స్థానికులు ప్రచారంలో ఉన్నప్పటికీ, బలమైన అభ్యర్థుల కోసం ఇంకా వేచి చూస్తున్నట్లు సమాచారం.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top