అంతా కల్తీ

Adulterated Food in Hyderabad Food Inspector Shortage - Sakshi

నగరంలో ఆహారం కల్తీ  ఏడాదిలో 3వేల కేసులు  

సిబ్బంది కొరతతో తనిఖీలు అంతంతే..

సాక్షి, సిటీబ్యూరో: మీరు రోడ్డు వెంట వెళ్తుంటే పానీపూరీ.. కబాబ్‌.. బిర్యానీ.. పాయా ఇలా విభిన్న వంటకాలు నోరూరిస్తున్నాయా? కానీ వాటిని అపరిశుభ్ర వాతావరణంలో తయారు చేస్తే.. జిహ్వాచాపల్యం తీరడం మాటేమో గానీ.. వాంతులు, విరేచనాలతో మంచం పట్టడం ఖాయం. గ్రేటర్‌లో ఇప్పడు వైరల్‌ ఫీవర్లు విజృంభిస్తున్న నేపథ్యంలో కల్తీ ఆహారం కేసులు నగరవాసులను కలవరపెడుతున్నాయి. ఆహార కల్తీ నిరోధక చట్టాన్ని అమలు చేసేందుకు జీహెచ్‌ఎంసీలో సరిపడా ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్లు అందుబాటులో లేకపోవడంతో పరిస్థితి రోజురోజుకూ విషమిస్తోంది. గ్రేటర్‌ పరిధిలో ఏడాదిలో సుమారు 3వేల ఆహార కల్తీ కేసులు నమోదైనట్లు అధికారులు పేర్కొంటున్నారు. మరో 978 మందికి నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. 23 మందిపై క్రిమినల్‌ కేసులున్నట్లు తెలిపారు.  

 

 జరిమానా అరకొరే...  
ఆహార కల్తీ నిరోధక చట్టం కింద వివిధ రకాల ఉల్లంఘనలకు పాల్పడితే ప్రస్తుతం రూ.500 నుంచి రూ.3,000  వరకు మాత్రమే జరిమానాలు విధిస్తుండడంతో ఉల్లంఘనులు వెరవడం లేదు. అపరిశుభ్ర పరిసరాల్లో వండిన వంటకాలనే వినియోగదారులకు వడ్డిస్తున్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఫుడ్‌ఇన్‌స్పెక్టర్ల తనిఖీల్లో అక్రమాలు బయటపడితే తక్కువ మొత్తంలో జరిమానాలను చెల్లించి చేతులు దులుపుకుంటుండడం గమనార్హం. ఇక జీహెచ్‌ఎంసీ పరిధిలో ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్లు కేవలం 11 మంది మాత్రమే ఉన్నారు. సిబ్బంది కొరతతో నగరవ్యాప్తంగా తనిఖీలు చేయడం వీలుకావడం లేదు. వీరి సంఖ్యను 50కి పెంచాల్సి ఉంది.  

మొబైల్‌ ల్యాబ్స్‌ ఎక్కడ?  
ఆహార కల్తీని నిరోధించేందుకు మొబైల్‌ టెస్టింగ్‌ ల్యాబ్స్‌ ఏర్పాటు చేస్తామన్న బల్దియా అధికారులు... ఒక వాహనాన్ని ప్రవేశపెట్టినప్పటికీ అది అలంకారప్రాయంగానే మారింది. ఇవి కనీసం 50 వరకు అవసరమవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. వీటిలోనూ 54 రకాల ఆహార కల్తీ పరీక్షలు నిర్వహించేలా వసతులు ఉండాలని స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం నాచారంలోని ఫుడ్‌సేఫ్టీ ల్యాబ్‌లో ఫుడ్‌ఇన్‌స్పెక్టర్లు తీసుకున్న ఆహార నమూనాలను తనిఖీ చేస్తున్నారు. అయితే ఈ ప్రక్రియ ఆలస్యమవుతుండడంతో అక్రమార్కులు సులభంగా తప్పించుకుంటున్నారు.   
 
ఇక భారీ జరిమానాలు  
ఆహార కల్తీని నిరోధించేందుకు భారీ జరిమానాలు విధించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. కేబినెట్‌ ఆమోదంతో ఈ చట్టాన్ని త్వరలో అమల్లోకి తీసుకురావాలని యోచిస్తున్నట్లు సమాచారం. నూతన చట్టంలో ఆహార కల్తీకి పాల్పడే వారిపై జరిమానాలు... ప్రసుతం ఉన్న దానికి పది రెట్లు ఉంటాయని తెలిసింది. తద్వారా అక్రమార్కులు దారికొస్తారని అధికారులు పేర్కొంటున్నారు. అవసరమైతే క్రిమినల్‌ కేసులు నమోదు చేసేందుకు అవకాశం కల్పించాలని నిర్ణయించినట్లు తెలిసింది.  

కల్తీ ఆహారంతో రోగాలు   
కల్తీ ఆహారంతో వాంతులు, విరేచనాలు, డయేరియా, జీర్ణకోశ వ్యాధులు, టైఫాయిడ్, హెపటైటిస్, కామెర్లు తదితర వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉంది. అపరిశుభ్ర వాతావరణంలో తయారు చేసిన ఆహార పదార్థాలను తినకపోవడమే మంచిది. రుచి కోసం శుచి లేని ఆహారం తీసుకొని ఇబ్బందులకు గురికావొద్దు. ప్రస్తుతం వైరల్‌ ఫీవర్స్‌ పంజా విసురుతున్న నేపథ్యంలో సదా అప్రమత్తంగా ఉండాలి.
– డాక్టర్‌ బీరప్ప,గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, నిమ్స్‌  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top