‘బావ’మరిదినే చంపేశాడు | a man killed his brotherinlaw in karimnagar district | Sakshi
Sakshi News home page

‘బావ’మరిదినే చంపేశాడు

Feb 3 2015 9:21 AM | Updated on Sep 2 2017 8:44 PM

ఇంటిదొంగను ఈశ్వరుడైనా పట్టలేడు అన్నచందంగా ఆస్తికోసం స్వయాన బావమరిదినే హతమార్చి.. అనక రైలు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు.

- ఆస్తి కోసమే హత్య    
- 15 రోజలకు వీడిన మిస్టరీ

 
జ్యోతినగర్: ఇంటిదొంగను ఈశ్వరుడైనా పట్టలేడు అన్నచందంగా ఆస్తికోసం స్వయాన బావమరిదినే హతమార్చి.. అనక రైలు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. చివరకు పోలీసులకు దొరికిపోయాడు. పదిహేను రోజుల క్రితం జరిగిన హత్య కేసును ఎన్టీపీసీ పోలీసులు చేధించి నిందితుడి అరెస్టు చూపించారు. ఆ వివరాలను ఎన్టీపీసీ పోలీస్‌స్టేషన్‌లో సోమవారం గోదావరిఖని డీఎస్పీ మల్లారెడ్డి, సీఐ నారాయణ విలేకరులకు వెల్లడించారు. రామగుండం మండలం లక్ష్మీపురానికి చెందిన మిట్టపల్లి రవీందర్‌రావు కూతురు శిరీష, కొడుకు చంద్రశేఖర్‌రావు సంతానం. శిరీషను సుల్తానాబాద్ మండలం కొదురుపాకకు చెందిన కోదాటి సంపత్‌రావుకిచ్చి వివాహం చేశారు. అయితే రవీందర్‌రావుకు గ్రామంలో 20 గుంటల విలువైన స్థలం ఉండడంతో దానిని ఎలాగైనా చేజిక్కుంచుకోవాలనుకున్నాడు సంపత్‌రావు. దీనికి చంద్రశేఖర్‌రావు అడ్డుగా ఉన్నాడని భావించి ఎలాగైనా హతమార్చాలని పథకం పన్నాడు.

కొద్దిరోజులుగా బావమరిదితో సన్నిహితంగా ఉంటున్నాడు. ఈ క్రమంలో జనవరి 16న ఎన్టీపీసీ ప్రాంతంలో విందు చేసుకుందామని బావమరిదిని పిలిపించుకున్నాడు. ఇద్దరు కలిసి మద్యం తాగారు. మద్యం మత్తులో ఉన్న చంద్రశేఖర్‌రావును మల్యాలపల్లి చెట్ల పొదలలోకి తీసుకెళ్లి కత్తితో గొంతుకోసి హతమార్చాడు. అదేనెల 17న రవీందర్‌రావు తన కుమారుడు కనిపించడం లేదని ఎన్టీపీసీ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో సంపత్‌రావు మూడు రోజుల అనంతరం చెట్ల పొదల్లో కుళ్లిపోయిన చంద్రశేఖర్ మృతదేహాన్ని రైలుపట్టాలపై పడేశాడు. అదేనెల 24న రైల్వేపోలీసులు గుర్తుతెలియని మృతదేహంగా గుర్తించి 25న లుక్‌అవుట్ నోటీస్ ద్వారా సమీప పోలీస్‌స్టేషన్లకు సమాచారం అందించారు. అప్పటికే చంద్రశేఖర్‌రావు మిస్సింగ్ కేసు ఎన్టీపీసీ పోలీస్‌స్టేషన్‌లో నమోదు కావడంతో వారు రవీందర్‌రావు కుటుంబ సభ్యులను పిలిపించి శవాన్ని చూపించారు. వారివెంట ఏమీ ఎరగనట్లు సంపత్‌రావు కూడా వెళ్లాడు. ఆనవాళ్లను చూసి చంద్రశేఖర్‌గా గుర్తించారు.

అయితే రైలు ఢీకొన్నట్లు ఆనవాళ్లు లేకపోవడంతో మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ రవీందర్‌రావు పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు విచారణ ప్రారంభించారు. చంద్రశేఖర్‌రావు సెల్‌ఫోన్‌కు వచ్చిన కాల్ లిస్టు ఆధారంగా సంపత్‌రావును అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఆస్తి కోసమే బావమరిదిని హత్య చేసినట్లు ఒప్పుకున్నాడని డీఎస్పీ వివరించారు. అతని నుంచి సెల్‌ఫోన్, బైక్ స్వాధీనం చేసుకున్నామని, ఈ కేసులో మరో ఇద్దరు అనుమానితులుగా గుర్తించామని, వారు పరారీలో ఉన్నారని వివరించారు. హత్యకేసును ఛేదించిన సీఐ నారాయణ, ఎస్సైలు సాగర్, లక్ష్మయ్య కానిస్టేబుళ్లు దుబాసి రమేష్, సుధాకర్, అశోక్, హోంగార్డు మీస శ్రీనివాస్‌ను డీఎస్పీ అభినందించారు.

Advertisement
 
Advertisement
Advertisement