అసంతృప్తి.. | Wrath of seniors | Sakshi
Sakshi News home page

అసంతృప్తి..

Mar 15 2016 2:00 AM | Updated on Mar 18 2019 9:02 PM

అసంతృప్తి.. - Sakshi

అసంతృప్తి..

ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను ఆ పదవి నుంచి తప్పించే దిశగా కాంగ్రెస్ పార్టీలోని కొందరు సీనియర్ నేతలు పావులు

సిద్దు ఒంటెత్తు పోకడలపై సీనియర్ల ఆగ్రహం
ఆయనను పదవి నుంచి తప్పించే  దిశగా నేతల యత్నాలు !
వ్యూహానికి పదును పెడుతున్న   కాంగ్రెస్ సీనియర్లు
ఐదు రాష్ట్రాల ఎన్నికల అనంతరం హైకమాండ్‌కు ఫిర్యాదు చేసే అవకాశం

 
బెంగళూరు: ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను ఆ పదవి నుంచి తప్పించే దిశగా కాంగ్రెస్ పార్టీలోని కొందరు సీనియర్ నేతలు పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. త్వరలో ఐదు రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల అనంతరం సిద్ధరామయ్యను పదవి నుంచి తప్పించేందుకు ఇప్పటికే వీరు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారని సమాచారం. అయితే ఐదు రాష్ట్రాల్లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ ఎన్నికల అనంతరం హైకమాండ్‌ను కలిసి సిద్ధరామయ్యపై తమ ఫిర్యాదుల చిట్టాను అందజేయనున్నారని ఆ పార్టీ వర్గాలే చెబుతున్నాయి. కాంగ్రెస్ పార్టీలో వలసదారుడైన సీఎం సిద్ధరామయ్యపై మూలతహా కాంగ్రెస్‌కు చెందిన సీనియర్ నేతలు చాలా అసంతృప్తిగా ఉన్నారు. అంతేకాదు తమ అసంతృప్తిని వీరు చాలా సందర్భాల్లో బహిరంగంగానే వెల్లడించారు కూడా. మూలతహా కాంగ్రెస్ నాయకులైన ఎస్.ఎం.కృష్ణ, జాఫర్ షరీఫ్, ఎం.వి.రాజశేఖరన్, బి.కె.హరిప్రసాద్‌తో పాటు మరికొందరు నేతలు సిద్ధరామయ్య పాలనపై తమ అసంతృప్తిని బహిరంగంగానే వెల్లడిస్తూ వస్తున్నారు. పాలనా విషయాలకు సంబంధించిన అంశాల్లోనే కాకుండా ఎన్నికల సమయంలో టికెట్‌ల కేటాయింపులో కూడా సీఎం సిద్ధరామయ్య తమ అభిప్రాయాలకు ఏమాత్రం ప్రాధాన్యం ఇవ్వడం లేదని వీరంతా హైకమాండ్‌కు ఎప్పటికప్పుడు ఫిర్యాదు చేస్తూనే వస్తున్నారు.

అందువల్లే  బీదర్, హెబ్బాళ, దేవదుర్గ నియోజక వర్గాలకు జరిగిన ఉప ఎన్నికల్లోనే కాకుండా జిల్లా తాలూకా పంచాయతీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి పరాభవం జరిగిందనేది వారి వాదన ఈ పరిణామాలన్నింటిని కాంగ్రెస్ హైకమాండ్ సైతం నిశితంగా గమనిస్తూ వస్తోంది. అయితే ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లో అనుసరించాల్సిన ఎన్నికల వ్యూహంపై చర్చలు జరపడంలో హైకమాండ్ తలమునకలై ఉంది. ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న నేపథ్యంలో తన దృష్టిని పూర్తిగా ఈ ఐదు రాష్ట్రాలపై కేంద్రీకరించింది కాంగ్రెస్ హైకమాండ్. ఈ నేపథ్యంలో సిద్ధరామయ్యను పదవి నుంచి తప్పించడంపై కాంగ్రెస్ పార్టీ కర్ణాటక శాఖ నేతల నుంచి వస్తున్న డిమాండ్‌లను కొద్దికాలం పాటు పక్కకు పెట్టినట్లు తెలుస్తోంది.

 ఇదే విషయాన్ని కాంగ్రెస్ సీనియర్ నేతలకు సైతం హైకమాండ్ వివరించినట్లు సమాచారం. దీంతో ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిసే వరకు సీఎం సిద్దరామయ్య కుర్చీకి ఎలాంటి ముప్పు ఉండబోదని పార్టీ వర్గాలే చెబుతున్నాయి. ఇక సిద్ధరామయ్య సైతం ఈనెల 18న ప్రవేశ పెట్టనున్న బడ్జెట్ రూపకల్పనలో పూర్తిగా నిమగ్నమయ్యారు. ఈనెల ఆఖరు వరకు బడ్జెట్ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ప్రతిపక్షాలను దీటుగా ఎదుర్కోవడంపై సీఎం సిద్ధరామయ్య వ్యూహ రచన చేస్తున్నారు.  
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement