తుంగభద్ర జలాశయం ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద ఉధృతి భారీగా కొనసాగుతోంది. జలాశయం ఎగువ ప్రాంతాలైన శివమొగ్గ, ఆగుంబే, చిక్కమగళూరు.
హొస్పేట, న్యూస్‌లైన్ : తుంగభద్ర జలాశయం ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద ఉధృతి భారీగా కొనసాగుతోంది. జలాశయం ఎగువ ప్రాంతాలైన శివమొగ్గ, ఆగుంబే, చిక్కమగళూరు, శృంగేరి, తీర్థహళ్లి తదితర మలెనాడు ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు వరద పోటెత్తింది. దీంతో సోమవారం డ్యాంలోని మొత్తం 33 క్రష్ట్ గేట్లలో 25 క్రష్ట్ గేట్లను నాలుగు అడుగులు మేర, మిగత 8 క్రస్ట్ గేట్లను ఒక్క అడుగు మేర పైకి ఎత్తి దిగువకు 1,60,000 క్యూసెక్కుల వరద నీటిని విడుదల చేశారు. వరద ఉధృతి ఇంకా రెండు రోజులు కొనసాగవచ్చని, లోతట్టు ప్రాంత వాసులు అప్రమత్తంగా ఉండాలని మండలి అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ప్రస్తుతం డ్యాంలో నీటిమట్టం 1631.86 అడుగులు, కెపాసిటీ 96.491 టీఎంసీలు, ఇన్‌ఫ్లో 1,74,860 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 1,60,000 క్యూసెక్కులు ఉందని అధికారులు తెలిపారు.
తుంగభద్ర లోతట్టు ప్రాంతాలు జలమయం..: తుంగభద్ర ఉగ్రరూపం దాల్చడంతో లోతట్టు ప్రాంతమైన హంపిలోని పురంధరదాసు మండపంతోపాటు ఇతర అనేక స్మారకాలు పూర్తిగా నీట మునిగాయి. అదే విధంగా హంపిలో ఉన్న రామలక్ష్మణ ఆలయంలోకి వరద నీరు పోటెత్తింది. ఆలయం ముందున్న ధ్వజ స్థంభం సగానికి పైగా నీట మునిగింది. ఆలయం పక్కనున్న హోటళ్లోకి కూడా వరద నీరు భారీగా చేరింది. కాగా హంపికి వచ్చిన విదేశీ పర్యాటకులు తుంగభద్రమ్మ వరద ఉధృతిని వీక్షించి ఆనందిస్తున్నారు.