ఆ మంత్రి భోజనం మహా ఖరీదు | The expenses incurred by the Belagavi assembly are Rs 7 crores | Sakshi
Sakshi News home page

ఆ మంత్రి భోజనం మహా ఖరీదు

Jun 14 2017 9:14 AM | Updated on Sep 5 2017 1:37 PM

ఆ మంత్రి భోజనం మహా ఖరీదు

ఆ మంత్రి భోజనం మహా ఖరీదు

ప్రజాప్రతినిధులు ప్రజల సమస్యల పై చట్టసభల్లో చర్చకు రాకపోయినా ప్రజా ధనాన్ని మాత్రం మంచినీళ్లలా ఖర్చుపెడుతున్నారు.

► 10 రోజులకు తిండి ఖర్చు రూ.4 లక్షలు
► బెళగావి అసెంబ్లీ సమావేశాల వ్యయం రూ.7కోట్లు


సాక్షి, బెంగళూరు: ప్రజాప్రతినిధులు ప్రజల సమస్యల పై చట్టసభల్లో చర్చకు రాకపోయినా ప్రజా ధనాన్ని మాత్రం మంచినీళ్లలా ఖర్చుపెడుతున్నారు. ఇందుకు గత ఏడాది బెళగావిలో జరిగిన శీతాకాల అసెంబ్లీ సమావేశాలే నిదర్శనం. 2016 నవంబర్‌ 21 నుంచి డిసెంబర్‌ 3 వరకూ పది రోజుల పాటు బెళగావిలో శాసనసభ సమావేశాలు జరిగాయి. ఈ పది రోజుల్లో చట్టసభల్లో వివిధ విషయాల పై చర్చ జరిగింది కేవలం 55 గంటలు మాత్రమే. అయితే అసెంబ్లీకి హాజరైన వారికి స్థానిక ఫైవ్‌స్టార్‌ హోటల్‌లో 53 గదులను బాడుగకు తీసుకున్నారు. ఇందుకు రూ.57,99,375లను చెల్లించారు. ఇక ప్రజాప్రతినిధుల తిండి ఖర్చులు చూస్తే ముక్కున వేలు వేసుకోవాల్సిందే.

ఈ విషయంలో న్యాయశాఖ మంత్రి టీ.బీ జయచంద్ర రూ.4,07,033లో మొదటి స్థానంలో ఉండగా బీజేపీ పక్ష నేత జగదీశ్‌ శెట్టర్‌ రూ.50లతో చివరి స్థానంలో ఉన్నారు. ఇక ఒక్క పూట ఖర్చు విషయం తీసుకుంటే కుమారస్వామి ఒక రోజు రాత్రి భోజనం కోసం రూ.3,352 ఖర్చు చూపించగా ఐవాన్‌ డిసౌజ రూ.3,105లను ఖర్చుచేశారు. మొత్తంగా గదుల అద్దె, ప్రజాప్రతినిధుల భోజనం వారి ప్రయాణం, భద్రత, ఇతరత్రా ఖర్చులన్నీ కలిపితే ఆ సమావేశాల వ్యయం రూ.7.20 కోట్లు. ఈ వివరాలన్నీ ఆర్టీఐ కార్యకర్త బీమప్పనవర్‌ సంధించిన ప్రశ్నకు సంబంధిత అధికారులు లిఖిత పూర్వకంగా ఇచ్చిన సమాధానం.

Advertisement
 
Advertisement
Advertisement