స్టెరిలైట్‌ ఫ్యాక్టరీపై సుప్రీం కీలక తీర్పు | Supreme Court Orders Sterlite Plant In Tamilnadu Remain Shut | Sakshi
Sakshi News home page

స్టెరిలైట్‌ ఫ్యాక్టరీపై సుప్రీం కీలక తీర్పు

Feb 18 2019 12:46 PM | Updated on Feb 18 2019 12:49 PM

Supreme Court Orders Sterlite Plant In Tamilnadu Remain Shut - Sakshi

న్యూఢిల్లీ: తమిళనాడులోని వివాదాస్పద తూత్తుకుడి స్టెరిలైట్ ఫ్యాక్టరీ పున​: ప్రారంభంపై సుప్రీం కోర్టు కీలక తీర్పును వెలువరించింది. ఆ ఫ్యాక్టరీని తిరిగి ప్రారంభించాలని నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ ఇచ్చిన ఆదేశాలను అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. తమిళనాడు ప్రభుత్వం ఆదేశాల ప్రకారం స్టెరిలైట్‌ ఫ్యాక్టరీ మూసివేత అలాగే కొనసాగుతుందని సోమవారం తీర్పు వెలువరించింది. స్టెరిలైట్‌ కర్మాగారాన్ని తిరిగి ప్రారంభించాలని నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ ఇచ్చిన తీర్పును అమలు పరిచేలా తమిళనాడు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని వేదాంత గ్రూపు సుప్రీం కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీం కోర్టు.. ఎన్జీటీకి ఈ కేసుపై విచారణ చేపట్టే అధికార పరిధి లేదని పేర్కొంది. అంతేకాకుండా తమిళనాడు ప్రభుత్వ ఆదేశాలపై మద్రాసు హైకోర్టును ఆశ్రయించాలని వేదాంత గ్రూపుకు సూచించింది.

‘స్టెరిలైట్‌’ రాగి ప్లాంట్‌ను శాశ్వతంగా మూసేయాలని ఆ రాష్ట్ర సీఎం పళనిస్వామి ఆదేశాలు జారీ చేయగా.. వేదాంత గ్రూప్‌ ఎన్జీటీలో పిటిషన్‌ దాఖలు చేసింది. ఆ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ఎన్జీటీ తమిళనాడు ప్రభుత్వ ఆదేశాలను తప్పుబట్టింది. మళ్లీ స్టెరిలైట్‌ కర్మాగారాన్ని తెరువాలంటూ గత డిసెంబర్‌ 15 ఆదేశాలు ఇచ్చింది. తీవ్ర కాలుష్యానికి కారణమవుతున్న ఈ కంపెనీని మూసివేయాలంటూ గతేడాది నిరసనకారులు పెద్ద ఎత్తున ఆందోళన చేయగా.. పోలీసులు కాల్పులు జరపడంతో 13 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement