‘సిద్ధు’ వ్యూహం

‘సిద్ధు’ వ్యూహం - Sakshi


మల్లికార్జున ఖర్గేతో రహస్య భేటీ

పార్టీలోని అసమ్మతిని చల్లార్చే దిశగా    ప్రయత్నాలు

వినిపించని ‘దళిత సీఎం’ వాదన


 

బెంగళూరు: గత కొంతకాలంగా రాష్ట్ర కాంగ్రెస్ నేతల నుంచి వినిపిస్తున్న ‘దళిత సీఎం’ డిమాండ్‌తో పాటు ప్రతిపక్షాల నుంచి ఎదురవుతున్న అర్కావతి డీ-నోటిఫికేషన్ విమర్శలతో సీఎం సిద్ధరామయ్య ఇబ్బందుల్లో పడ్డారు. ఈ క్రమంలో తన పదవిని నిలుపుకునేందుకు సిద్ధరామయ్య ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఇటీవల లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష నేత మల్లికార్జున ఖర్గేను రహస్యంగా కలిసినట్లు సమాచారం. ఉప ముఖ్యమంత్రి స్థానాన్ని ఎలాగైనా సరే సంపాదించాలని లేదంటే ముఖ్యమంత్రి సిద్ధరామయ్యనే ఆ పదవి నుంచి దించాలని గత కొంతకాలంగా కేపీసీసీ అధ్యక్షుడు పరమేశ్వర్ ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. ఇదే క్రమంలో కేపీసీసీ అధ్యక్షుడు పరమేశ్వర్ నూతన సంవత్సర వేడుకల రోజున  మాజీ ముఖ్యమంత్రి ఎస్.ఎం.కృష్ణతో పాటు లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష నేత మల్లికార్జున ఖర్గేని కలిశారు. ఆ వెంటనే రాష్ట్రంలో ‘దళిత ముఖ్యమంత్రి’ పై చర్చకూడా ప్రారంభమైంది. ఇక ఇదే సందర్భంలో స్పీకర్ కాగోడు తిమ్మప్ప ప్రభుత్వంపై బహిరంగంగానే విమర్శలు చేయడం ప్రారంభించారు. మంత్రుల పనితీరు సరిగా లేదని, ప్రభుత్వ పథకాలు నిజమైన లబ్దిదారులకు చేరువ కావడం లేదని కాగోడు తిమ్మప్ప బహిరంగ విమర్శలు చేయడం విదితమే.ఈ పరిణామాలతో తన పదవికి ముప్పు వాటిల్లుతుందని భావించిన ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన పదవిని ఎలాగైనా సరే నిలుపుకునే ప్రయత్నాల్లో పడిపోయారు. అందులో భాగంగానే ఇటీవల మల్లికార్జున ఖర్గేతో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రహస్యంగా సమావేశమైనట్లు సమాచారం. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిర పరిచే ఎలాంటి కార్యక్రమాలకు తాను మద్దతివ్వబోనని మల్లికార్జున ఖర్గే పేర్కొన్నట్లు సమాచారం. ఇక ఇదే సందర్భంలో ప్రభుత్వానికి సంబంధించి స్పీకర్ కాగోడు తిమ్మప్ప అందజేసే సలహాలు సైతం తీసుకోవాలని మల్లికార్జున ఖర్గే సిద్ధరామయ్యకు సూచించడంతో స్పీకర్‌తో సైతం సిద్ధరామయ్య మాట్లాడారని తెలుస్తోంది.కొద్ది రోజులుగా వినిపించని ‘దళిత సీఎం’....ఇక ఈ రహస్య భేటీ అనంతరమే మల్లికార్జున ఖర్గే ‘ప్రస్తుతం రాష్ట్రంలో ముఖ్యమంత్రి పదవి ఖాళీగా లేదు’ అన్న వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. దళిత సీఎంపై ఎవరూ మాట్లాడకుండా మల్లికార్జున ఖర్గే నాయకులను సైతం ఆదేశించారని తెలుస్తోంది. అందువల్లే గత కొద్ది రోజులుగా ‘దళిత సీఎం’ అంశం వినిపించడం లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాగా ఇప్పుడిక ఉప ముఖ్యమంత్రి కావాలన్న తన ఆశలకు మళ్లీ బ్రేక్ పడటంతో కేపీసీసీ అధ్యక్షుడు పరమేశ్వర్ తిరిగి లాబీయింగ్‌ని ప్రారంభించారని తెలుస్తోంది. మంత్రివర్గ విస్తరణ సమయంలో తప్పని సరిగా తనకు ఉప ముఖ్యమంత్రి పదవిని కేటాయించేలా కాంగ్రెస్ హైకమాండ్ వద్ద పరమేశ్వర్ పావులు కదుపుతున్నారని పార్టీ వర్గాల సమాచారం.

 

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top