ఎన్‌ఆర్‌ఐ హత్యపై విభిన్న కథనాలు | Different articles on the murder of NRI | Sakshi
Sakshi News home page

ఎన్‌ఆర్‌ఐ హత్యపై విభిన్న కథనాలు

Sep 17 2013 11:04 PM | Updated on Aug 21 2018 5:44 PM

అన్మోల్ సర్నా (20) అనే ప్రవాస భారతీయ యువకుడి మృతి కేసు రోజురోజుకూ సంక్లిష్టంగా మారుతోంది. మూడు రోజుల కిందట తన స్నేహితుడి ఇంట్లోనే ఇతడు హత్యకు గురైనట్టు వార్తలు రావడం తెలిసిందే.

సాక్షి, న్యూఢిల్లీ:  అన్మోల్ సర్నా (20) అనే ప్రవాస భారతీయ యువకుడి మృతి కేసు రోజురోజుకూ సంక్లిష్టంగా మారుతోంది. మూడు రోజుల కిందట తన స్నేహితుడి ఇంట్లోనే ఇతడు హత్యకు గురైనట్టు వార్తలు రావడం తెలిసిందే. ఈ విషయంలో పోలీసుల వాదన మాత్రం మరోలా ఉంది. తీసుకున్న మాదకపదార్థాలు వికటించడంతో హింసాత్మకంగా ప్రవర్తించిన అన్మోల్‌ను సెక్యూరిటీ గార్డులు  కొట్టారని, అతడు కూడా తనకు తానే గాయపర్చుకున్నాడని దక్షిణఢిల్లీ డీసీపీ పి.కరుణాకరణ్ విలేకరుల సమావేశంలో ప్రకటించారు. స్నేహితులే కుట్ర చేసి అన్మోల్‌ను చంపారని, ఈ కేసును సీబీఐతో దర్యాప్తు జరిపించాలని మృతుడి తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. పోలీసులు హంతకులను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.  అన్మోల్ మిత్రులు ప్రణేల్ షా, శివాంక్ గంభీర్, రిథమ్ గిర్హోత్రా, మాధవ్ భండారీని మాదక పదార్థాలను సేవించినందుకు ఈ   ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. వీరంతా 20 ఏళ్ల వయసు వారే. సెక్యూరిటీ గార్డులు సురేందర్‌బాలీ, నరేశ్ మిశ్రాను హత్యారోపణలపై ఆరెస్టు చేశారు. అయితే శివాంక్ గంభీర్, మాధవ్ భండారీలకు స్థానిక కోర్టు ఈ నెల 19 వరకు పోలీసు కస్టడీకి అప్పగించింది. 
 
 విదేశాలకు వెళ్తున్న శివాంక్ గంభీర్‌కు వీడ్కోలుగా అన్మోల్, అతని మిత్రులు పార్టీ జరుపుకోవాలని 11వ తేదీన నిర్ణయించుకున్నారు. ఇందుకోసం నోయిడాకు చెందిన ఒక వ్యక్తి దగ్గరి నుంచి మాదకద్రవ్యాలు కొనుగోలు చేశారని కరుణాకరణ్ చెప్పారు. ఆయన కథనం ప్రకారం ఈ ఐదుగురు మిత్రులు సెప్టెంబర్ 13 రాత్రి తొమ్మిది గంటలకు కాల్కాజీలోని సౌత్‌పార్క్ అపార్ట్‌మెంట్స్‌లోని ప్రణేల్ నివాసంలో పార్టీ చేసుకున్నారు. బిల్డింగ్ టైపై మద్యం, మాదకద్రవ్యాలు సేవించారు. అవి వికటించడంతో అన్మోల్ హింసాత్మకంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. మిత్రులతో గొడవపడి సామాన్లన్నీ  విసిరివేశాడు. ఓ టీవీని కూడా విరగ్గొట్టాడు. ఇతని గొడవ భరించలేక ప్రణేల్ తండ్రి వీరిని ఇంటి నుంచి బయటకు పంపేశాడు. 
 
 ఆ తరువాత అన్మోల్ అపార్ట్‌మెంట్ కిందకు వచ్చి అరుస్తూ, పరుగెత్తుతూ విచిత్రంగా ప్రవర్తించడం ప్రారంభించాడు. అన్మోల్ గార్డులను చెంపదెబ్బ కొట్టడం, వాళ్లు తమదగ్గరున్న కర్రలతో అన్మోల్‌ను బాదడం అంతా సీసీటీవీ వీడియోల్లో రికార్డయింది. గార్డులు అన్మోల్ పిరుదులు, తలపై కొట్టినా, చంపాలన్న ఉద్దేశం వారికి లేదని కరుణాకరణ్ వివరణ ఇచ్చారు. ఆ తరువాత అన్మోల్ తలను గేటుకేసి గుద్దుకున్నాడని, చొక్కా లేకుండా రోడ్డుపై పరుగులు తీశాడని చెప్పారు. అన్మోల్ మిత్రులు ఈ విషయాన్ని అతని తల్లికి చెప్పడానికి కాల్ చేసినా ఆమె స్వీకరించలేదు.  తర్వాత ఆమె మళ్లీ వారికి ఫోన్ చేసినప్పుడు మిత్రులు భయంతో ఫోన్ ఎత్తలేదన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement