నా పేరు నమ్రత.. పరేడ్‌ గ్రౌండ్స్‌ వద్ద కలుద్దామా! | Telegram Message Incident In Hyderbaad | Sakshi
Sakshi News home page

నా పేరు నమ్రత.. పరేడ్‌ గ్రౌండ్స్‌ వద్ద కలుద్దామా!

Sep 16 2026 8:12 AM | Updated on Sep 16 2026 8:12 AM

Telegram Message Incident In Hyderbaad

హైదరాబాద్‌: ‘నా పేరు నమ్రత.. పరేడ్‌ గ్రౌండ్స్‌ వద్ద కలుద్దామా!‘ అంటూ టెలిగ్రామ్‌లో వచ్చిన ఒక మేసేజ్‌ ఓ యువకుడిని మోసపోయేలా చేసింది. అమ్మాయి పేరిట నకిలీ గుర్తింపుతో వల పన్ని, కలవడానికి పిలిపించి డబ్బు డిమాండ్‌ చేసిన ఈ ఉదంతం బేగంపేట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన మేరకు.. యూసుఫ్‌గూడ ఎల్‌ఎన్‌నగర్‌లో నివసించే శనిగరపు అన్వేష్‌ (24)కు వారం క్రితం ‘సయిద్‌ రఫత్‌’ అనే టెలిగ్రామ్‌ ఐడీ నుంచి ఓ మెసేజ్‌ వచ్చింది.

అన్వేష్‌ దానికి బదులివ్వడంతో ఇద్దరి మధ్య చాటింగ్‌ కొనసాగింది. ఈ క్రమంలో అవతలి వ్యక్తి తన అసలు పేరును దాచిపెట్టి, తనను తాను ‘నమ్రత’గా పరిచయం చేసుకున్నాడు. అంతటితో ఆగకుండా వ్యక్తిగతంగా నేరుగా కలవాలని అన్వేషిను కోరాడు. దీంతో ఆమె మాటలను నమ్మిన అన్వేషి.. ఈ నెల 13న మధ్యాహ్నం  స్నేహితుడు కొండ్ర ధర్మసేనతో కలిసి పరేడ్‌గ్రౌండ్స్‌ సమీపంలోని మెట్రో పిల్లర్‌ నంబర్‌ 1230 వద్దకు చేరుకున్నాడు. 

అక్కడ వారు వేచి చూస్తుండగా.. అన్వేష్‌ ఎవరు అని కొందరు ప్రశ్నించారు. తానేనని చెప్పగానే టెలిగ్రామ్‌ చాటింగ్‌ ప్రస్తావన తెచ్చారు. అయితే అప్పుడు అసలు విషయం బయటపడింది. తనతో చాటింగ్‌ చేసింది ‘నమ్రత’ కాదని, ఎవరో కేటుగాళ్లు నకిలీ గుర్తింపుతో కావాలనే తనను ఈ వలలోకి లాగినట్లు అన్వేష్‌ ఆలస్యంగా గ్రహించాడు. అంతలోనే అక్కడకు నలుగురు వ్యక్తులు వచ్చి అన్వేషిను బెదిరిస్తూ డబ్బులు డిమాండ్‌ చేశారు.  షాక్‌కు గురైన అన్వేష్‌ భయంతో తప్పించుకున్నాడు.  

అన్వేష్‌ స్నేహితుడు ధర్మసేన వారి మోసాన్ని  ప్రశ్నించాడు. దీంతో ముగ్గురు వ్యక్తులు ధర్మసేనను గట్టిగా పట్టుకోగా, మరో దుండగుడు తన వద్ద ఉన్న కత్తితో అతడిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచి పరారయ్యారు.  బేగంపేట పోలీసులు  ఘటనా స్థలానికి చేరుకుని ధర్మసేనను వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. బాధితుడు అన్వేష్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని, ఆ నకిలీ టెలిగ్రామ్‌ ఐడీ మూలాల ఆధారంగా పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement