ఢిల్లీ విధానసభ ఎన్నికల్లో నాలుగోసారి కూడా కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయమని ఆపార్టీ ఉపాధ్యక్షుడు రాహూల్‌గాంధీ ధీమా వ్యక్తం చేశారు.
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ విధానసభ ఎన్నికల్లో నాలుగోసారి కూడా కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయమని ఆపార్టీ ఉపాధ్యక్షుడు రాహూల్‌గాంధీ ధీమా వ్యక్తం చేశారు. పదిహేనేళ్ల పాలనలో చేసిన అభివృద్ధి, అమలు చేసిన సంక్షేమ పథకాలే మరోమారు హస్తిన పీఠంపై హస్తం పార్టీ నిలుపుతాయన్నారు. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన మొదటి బహిరంగ సభలో తన ప్రసంగంతో పార్టీ శ్రేణులను ఉత్సాహపరిచే ప్రయత్నం చేశారు. మంగోల్‌పురిలోని రాంలీలా మైదాన్‌లో ఆదివారం నిర్వహించిన ర్యాలీలో ఢిల్లీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్‌తోపాటు రాహూల్ పాల్గొన్నారు. నరేంద్రమోడీ ప్రధాన ఆకర్షణగా బీజేపీ ఇటీవల నిర్వహించిన ర్యాలీకి ధీటుగా కాంగ్రెస్ నాయకులు ఏర్పాట్లు చేశారు. అనుకున్నట్టుగానే పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ శ్రేణులను మైదానానికి తరలించారు. దాదాపు 50వేల మంది సభకు హాజరయ్యారు. రాహూల్ ప్రసంగం ఆసాంతం పార్టీ గెలుస్తుందన్న ధీమాను కార్యకర్తలతో నింపడంతోపాటు షీలాదీక్షిత్ పనితీరుపై ప్రశంసలు కురిపిస్తూ సాగింది.
అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేస్తాం...
దేశ రాజధాని నగరం గత పదిహేనేళ్లలో ఎంతో అభివృద్ధి చెందిందని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. మరోమారు అవకాశం ఇస్తే ఢిల్లీని మరింత ముందుకు తీసుకెళతామన్నారు. విద్య, రవాణా, వైద్య, ఉపాధి అంశాల్లో కాంగ్రెస్ సర్కార్ ఎంతో అభివృద్ధి చేసిందని యూపీఏ ప్రభుత్వ విజయాలను ఏకరువుపెట్టారు. ఎన్డీఏ హయాంలో జరిగిన అభివృద్ధికి మూడింతలు ఎక్కువ చేశామన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవాలని మహిళలకు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు. పేదల ఆరోగ్యం పెద్ద సమస్య అని, పేదల కోసం ఎన్నో వినూత్న కార్యక్రమాలను యూపీఏ ప్రభుత్వం అమలు చేసిందన్నారు. ఢిల్లీకి వలసవచ్చే వారికి సైతం ఆశ్రయం కల్పించామన్నారు. 1,500 అనధికారిక కాలనీలను క్రమబద్ధీకరించిన ఘనత కాంగ్రెస్‌దేనని, పేదలకు ఏ సమస్య ఉన్నా పోరాడేందుకు కాంగ్రెస్‌పార్టీ ఎప్పుడూ ముందుంటుందన్నారు. పేదల ఆకలి తీర్చేందుకే ఆహారభద్రత బిల్లు తెచ్చామన్నారు.
షీలాదీక్షిత్‌పై ప్రశంసల జల్లు...
పదిహేనేళ్ల పాలనలో ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ ఢిల్లీ నగరాన్ని పూర్తిగా మార్చేశారంటూ రాహూల్ కితాబిచ్చారు. విద్య, ఉపాధి, ఆరోగ్యం, రవాణా ఇలా ప్రతి రంగంలోనూ ఢిల్లీని అభివ ృద్ధి చేశారంటూ ప్రశంసల జల్లు కురిపించారు. అభివ ృద్ధిని ప్రస్తావిస్తూ ఆయన ఢిల్లీ మెట్రోరైలును ఉదహరించారు. ‘షీలాజీ ఢిల్లీని ఎంతో మార్చారు. ఇందుకు నేను కొన్ని ఉదాహరణలు చెబుతాను. రవాణా అంశాన్ని తీసుకుంటే ఢిల్లీ మెట్రోరైలు. జకార్తా, ఇండోనేషియాలు మన మెట్రోను ఆదర్శంగా తీసుకుంటున్నాయ’న్నారు. ఢిల్లీ నగరంలో అభివృద్ధి జరిగిన విషయాన్ని ప్రతిపక్షాలు సైతం ఒప్పుకుంటున్నాయన్నారు. పదిహేనేళ్ల కాంగ్రెస్ పాలనలో అభివ ృద్ధి ఆగలేదని, కొనసాగుతూనే ఉందన్నారు. ఇదిలాఉండగా రాహూల్ సభకు సంబంధించి ఎలాంటి అవాంతరాలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ర్యాలీకి భారీ సంఖ్యలో జనం తరలిరావడంతో కొందరు స్టేడియం బయటే ఉండాల్సి వచ్చింది.
2