రైళ్లలోనూ తనిఖీలు | Checks on trains | Sakshi
Sakshi News home page

రైళ్లలోనూ తనిఖీలు

Mar 22 2014 11:09 PM | Updated on Aug 14 2018 5:45 PM

ఎన్నికల్లో నగదు, తాయిలాల పంపిణీ అడ్డుకట్ట లక్ష్యంగా ఎన్నికల ప్రధాన అధికారి ప్రవీణ్‌కుమార్ ముందుకు సాగుతున్నారు.

నగదు రవాణాను అడ్డుకోవడానికి తనిఖీలు మరింత ముమ్మరం చేయాలని రాష్ట్ర ఎన్నికల యంత్రాంగం నిర్ణయించింది. అందులో భాగంగా రైళ్లు, రైల్వేస్టేషన్లలోనూ తనిఖీలకు ఆదేశించింది. ప్రతి ప్రయాణికుడి బ్యాగులు, సూట్ కేసులు తనిఖీలు చేయడానికి చర్యలు తీసుకుంటున్నారు. నామినేషన్లు సమర్పించేందుకు సిద్ధమవుతున్న అభ్యర్థులు ముందుగా ప్రత్యేక బ్యాంకు ఖాతాలు సిద్ధం చేసుకోవాలన్న ఆదేశాలు వెలువడ్డాయి. నామినేషన్ల పత్రంలో బ్యాంకు ఖాతాలు లేని పక్షంలో తిరస్కరణకు గురి కావడం తథ్యం.
 
 సాక్షి, చెన్నై: ఎన్నికల్లో నగదు, తాయిలాల పంపిణీ అడ్డుకట్ట లక్ష్యంగా ఎన్నికల ప్రధాన అధికారి ప్రవీణ్‌కుమార్ ముందుకు సాగుతున్నారు. ఓటర్లలో చైతన్యం తెచ్చే విధంగా ఓటుకు నోటు వద్దన్న నినాదంతో అవగాహనా కార్యక్రమాలు వేగవంతం చేసి ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తం గా వాహనాల తనిఖీలు ముమ్మరం చేశారు. బస్సులు, లారీలు, నాలుగు చక్రాలు, మూడు చక్రాలు, ద్విచక్ర వాహనాలు సైతం వదలి పెట్టకుండా తనిఖీలు చేస్తున్నారు.
 
 ఈ తనిఖీల్లో కోట్లాది రూపాయల నగదు, బంగారు ఆభరణాలు, పలు రకాల సామాగ్రి పట్టుబడుతూ వస్తోంది. రికార్డులు ఉన్న వాటిని పరిశీలనానంతరం సంబంధిత వ్యక్తులకు కొంత మేరకు అప్పగిస్తున్నారు. పోలీసులు తమ చేతి వాటాన్ని సైతం పలు చోట్ల ప్రదర్శిస్తున్నారు. అదే సమయంలో  ఎలాంటి రికార్డులు లేని సుమారు ఎనిమిది కోట్ల మేరకు నగదు, నగలు స్వాధీనం చేసుకున్నారు. తనిఖీలు ఉధృతం కావడంతో రాజకీయ పక్షాలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నాయి.
 
 రైళ్లలోనూ తనిఖీలు : రోడ్డు మార్గంలో తనిఖీలు ముమ్మరం కావడంతో రైలు మార్గాన్ని ఎంపిక చేసుకుని నగదు తరలిస్తున్నట్టుగా ఈసీకి సమాచారం అందింది. దీంతో ఇక రైళ్లలోనూ  తనిఖీలు చేపట్టేపనిలో ఉన్నారు. రైళ్లల్లో తనిఖీలు అన్నది అంత సులభం కాదు కాబట్టి, రైల్వు స్టేషన్లలో ప్రత్యేక బృందాల్ని రంగంలోకి దించి, అనుమానం వచ్చే వాళ్ల బ్యాగులు, సూట్ కేసులు తనిఖీలు చేసేందుకు ఈసీ చర్యలు చేపడుతోంది. ఎలాగూ రాష్ర్టంలోని అన్ని ప్రధాన రైల్వే స్టేషన్లలో మెటల్ డిటెక్టర్లు, తనిఖీలు జరుగుతున్న దృష్ట్యా, చిన్న చిన్న రైల్వే స్టేషన్ల మీద ప్రత్యేక దృష్టి పెట్టే పనిలో ఉన్నారు.
 
 ఆంక్షల కొరడా: నామినేషన్లకు సమయం ఆసన్నం అవుతుండడంతో అందుకు తగ్గ ఏర్పాట్లలో ఎన్నికల యంత్రాంగం నిమగ్నం అయింది. అభ్యర్థులకు ఆంక్షల కొరడాను శనివారం ప్రకటించింది. ఎన్నికల బరిలో నిలబడే ప్రతి అభ్యర్థి ప్రత్యేక బ్యాంకు ఖాతాను ఏర్పాటు చేసుకోవాల్సిందేనని స్పష్టం చేసింది. నామినేషన్ పత్రంలో బ్యాంకు ఖాతా నెంబర్‌ను తప్పని సరిగా పొందు పరచాల్సి ఉంటుందని సూచించారు. ఈ ఖాతా ద్వారానే నగదు బదలాయింపులు జరగాలని వివరించారు.
 
 బ్యాంక్ ఖాతాకు వ్యక్తిగత చిరునామా లేదా, పార్టీ  ఎన్నికల కార్యాలయాల చిరునామాలు అయినా సమర్పించ వచ్చని సూచించారు. అలాగే, నామినేషన్లు దాఖలు చేయడానికి వచ్చే సమయంలో హంగు ఆర్భాటాలు ఉండకూడదని హెచ్చరించారు. అభ్యర్థితో పాటుగా మరో నలుగురిని మాత్రమే నామినేషన్ దాఖలుకు అనుమతించడం జరుగుతుందన్నారు. ప్రధాన కూడళ్లలో ఓపెన్ టాప్ వాహనాల నుంచి ఎన్నికల ప్రచారాలు, బహిరంగ సభలకు అనుమతి తప్పనిసరి చేశారు.
 
 ముందస్తుగా అనుమతులు తీసుకోవాలని, ఎవరు ముందుగా దరఖాస్తు చేసుకుంటారో వారికి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని పేర్కొన్నారు. ముఖ్య నేతల పర్యటన వివరాలు ముందుగానే సమర్పించాలని సూచించారు. హెలికాప్టర్లను దించేందుకు ప్రైవేటు స్థలాల్లో హెలిప్యాడ్‌ల ఏర్పాటుకు, ప్రైవేట్ హెలి ప్యాడ్‌లను ఉపయోగించుకునే సమయంలో ముందుగా ఆయా జిల్లా కలెక్టర్ల నుంచి అనుమతి తీసుకోవాలని వివరించారు. హెలికాప్టర్లలో పయనించే ముఖ్య నేతల వివరాలను సమర్పించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement