నేతల తలరాతలు మార్చే..! | BJP, Congress prepare for Delhi Assembly election | Sakshi
Sakshi News home page

నేతల తలరాతలు మార్చే..!

Nov 6 2014 10:49 PM | Updated on Mar 29 2019 9:24 PM

దేశరాజధాని ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న దృష్ట్యా వివిధ సామాజిక గ్రూపులు, పూర్వాంచలీయులు ప్రభావిత వర్గాలుగా ఎదిగిన తీరు ప్రస్తుతం ప్రధాన చర్శనీయాంశమైంది.

 సాక్షి, న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న దృష్ట్యా వివిధ సామాజిక గ్రూపులు, పూర్వాంచలీయులు ప్రభావిత వర్గాలుగా ఎదిగిన తీరు ప్రస్తుతం ప్రధాన చర్శనీయాంశమైంది. దేశానికి స్వాతంత్యం వచ్చిన తొలి దశబ్దాలలో ఢిల్లీలోరాజకీయం జాట్లు, యాదవులు, గుజ్జర్లు,  పంజాబీలు, వైశ్యుల శాసించే పరిస్థితి ఉండేది. రెండు దశాబ్దాలుగా ఢిల్లీలో రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. ఇప్పుడు పూర్వాంచలీయులు నగరంలో బలమైన రాజకీయశక్తిగా ఎదిగారు. రాజకీయాలను శాసించే స్థితికి చేరుకొన్నారు. వారిని నిర్లక్ష్యం చేయడానికి ఏ రాజకీయ పార్టీ సాహసించడం లేదు. అధికార పగ్గాలు దక్కాలంటే, అది పూర్వాంచలీయుల చేతిలోనే ఉన్నదని రాజకీయ పార్టీలు బలంగా విశ్వసిస్తున్నాయి. పొట్టచేతపట్టుకుని ఉపాధిని అన్వేషిస్తూ రాజధానికి వలస వచ్చిన బీహార్, ఉత్తరప్రదేశ్ వాసులంటే గతంలో చులకనభావన ఉండేది. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. గతంలో నోరుజారిన రాజకీయ నేతలు ఇప్పుడు వారి విషయంలో ఎలాంటి అనుచిత వ్యాఖ్యాలు చేయడం లేదు.
 
 మద్దతు కోసం అన్ని పార్టీల ఆరాటం
 ఇటీవల ఛత్ పూజ సందర్భంగా పూర్వాంచలీయుల మద్దతు సాధించడానికి రాజకీయ పార్టీలు పడిన పాట్లు నగరంలో వారికున్న బలాన్ని చెప్పకనే చెప్పాయి. ఛత్ పూజ కోసం ఘాట్లను  శుభ్రం చేయించడంలో కాంగ్రెస్, బీజేపీలు పోటీపడ్డాయి. ఛత్ పూజ  రోజును ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించడంలో ప్రముఖపాత్ర పోషించిన బీజేపీ వారి మెప్పు కూడా పొందిందనే చెప్పవచ్చు. రాజధానిలో నివసించే 70 -80 లక్షల పూర్వాంచల్ వాసుల మనోభావాలను కించపరచరాదని ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు అనడం వెనుక వారి మద్దతు సాధించాలనే తపన తేటతెల్లమవుతోంది. ఇలా అన్ని పార్టీలు ఆ వర్గాల ప్రజల మద్దతు సాధించేందుకు ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. కాగా, మహారాష్ట్ర, హర్యానాలో బీజేపీ విజయం వెనుక పూర్వాంచలీయుల మద్దతు ఉందన్న విషయం రాజధానిలో  బీజేపీని మరింత జాగ్రత్తగా మసులకునేలా చేసింది. ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు జరిగిన ఈ రెండు రాష్ట్రాల్లో  పూర్వాంచలీయులు బీజేపీకి మద్దతుగా నిలిచారు.
 
 పాతిక సీట్లలో బలమైన శక్తి..
 ఢిల్లీలో  కూడా  అధికారంలోకి రావాలంటే పూర్వాంచలీయుల మద్దతు ఎంతో అవసరం. నగరంలో 1,600  అనధికార కాలనీలు ఉన్నాయి. వీటిలో పూర్వాంచలీ ఓటర్ల సంఖ్య అత్యధికంగా ఉంది, ఢిల్లీలో పాతిక సీట్లలో వారు జయాపజయాలను నిర్దేశించే బలమైన శక్తిగా ఉన్నారు. ఒకప్పుడు పూర్వాంచలీయులు కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చేవారు. గత అసెంబ్లీ ఎన్నికలలో వారు ఆమ్ ఆద్మీపార్టీకి అండగా నిలిచారు. లోక్‌సభ ఎన్నికలలో మనోజ్ తివారీ విజయం పూర్వాంచలీ ఓటర్ల మద్దతు వల్లే సాధ్యం అయ్యింది. ఈ నేపథ్యంలో మూడు పార్టీలు  పూర్వాంచలీ ఓటర్లను మచ్చిక చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. ఈ సారి కూడా వారి మద్దతు కోసం కాంగ్రెస్, బీజేపీలు పోటీపడుతున్నాయి. మరి ఎవరికి మద్దతు ఇస్తారో తేలాల్సి ఉంది.
 
 

Advertisement
 
Advertisement
Advertisement