వారెవ్వా.. టీ20ల్లోనూ డబుల్‌ సెంచరీ!

Young Cricketer Smashes Double Century In T20 Cricket - Sakshi

దుబాయ్‌ : పరుగుల విధ్వంసానికే కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచే పొట్టి క్రికెట్‌లోనూ డబుల్‌ సెంచరీ నమోదైంది. దుబాయ్‌ వేదికగా క్లబ్‌ క్రికెట్‌ ఆధ్వర్యంలో జరిగిన అలియన్స్‌ టీ20 లీగ్‌లో ఈ అద్భుత రికార్డు ఆవిష్కృతమైంది. స్పోర్టింగ్‌ క్రికెట్‌ క్లబ్‌ తరపున బరిలోకి దిగిన 19 ఏళ్ల కేవీ హరికృష్ణ 78 బంతుల్లో 22 ఫోర్లు, 14 సిక్సర్లతో 208 పరుగులతో సరికొత్త రికార్డు సృష్టించాడు. యూఏఈ అండర్‌-19 ఆటగాడైన హరికృష్ణ 36 బౌండరీల(సిక్సర్లు)తోనే 172 పరుగులు సాధించడం విశేషం. హరికృష్ణ భారీ ఇన్నింగ్స్‌తో ఆ జట్టు.. మెకోస్‌ క్రికెట్‌ క్లబ్‌కు 251 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది. అయితే ఈ మ్యాచ్‌లో హరికృష్ణ జట్టు ఓడిపోవడం గమనార్హం. ప్రత్యర్థి ఆటగాళ్లు 17 ఓవర్లోనే ఆ భారీ లక్ష్యాన్ని ఛేదించడం కొసమెరుపు. జట్టు ఓడినా మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ మాత్రం హరికృష్ణనే వరించింది.

ఐపీఎల్‌ ఆడటమే నా లక్ష్యం
టీ20 చరిత్రలోనే డబుల్‌ సెంచరీ సాధించిన ఈ యువ ఆటగాడు తన లక్ష్యం మాత్రం ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌), ఇతర టీ20 లీగ్‌ల్లో ఆడటమేనని తెలిపాడు. మ్యాచ్‌ అనంతరం మాట్లాడుతూ.. భారీ షాట్లతో పరుగుల చేయడాన్ని తానెప్పుడు ఆస్వాదిస్తానని, గతంలో 36 బంతుల్లోనే సెంచరీ చేసిన అనుభవం ఉందని చెప్పుకొచ్చాడు. అఫ్గాన్‌ ప్రీమియర్‌ లీగ్‌ ఆడిన హరికృష్ణ, అక్కడ అంతర్జాతీయ క్రికెటర్ల శిక్షణతో రాటుదేలాడు. అలాగే భారత క్రికెటర్‌ వెంకటేశ్‌ ప్రసాద్‌ సూచనలు తీసుకున్నాడు. ఇక అంతర్జాతీయ టీ20ల్లోనూ ఇప్పటి వరకు డబుల్‌ సెంచరీ నమోదు కాలేదు. ఐపీఎల్‌-2013లో వెస్టిండీస్‌ విధ్వంసకర బ్యాట్స్‌మన్‌ క్రిస్‌గేల్‌ సాధించిన 175 (నాటౌట్‌) పరుగులే ఇప్పటి వరకు అత్యధిక వ్యక్తిగత స్కోర్ కావడం గమనార్హం.

చదవండి: టి20ల్లో ‘విన్‌’డీసే 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top