టి20ల్లో ‘విన్‌’డీసే 

west indies more than wins by india - Sakshi

టీమిండియాపై పైచేయి

8 మ్యాచ్‌ల్లో ఐదింటిలో గెలుపు 

2016 మార్చి 31: ముంబైలో టి 20 ప్రపంచ కప్‌ సెమీ ఫైనల్‌. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌... విరాట్‌ కోహ్లి (47 బంతుల్లో 89; 11 ఫోర్లు, 1 సిక్స్‌) దూకుడుతో 192 పరుగులు చేసింది. సొంతగడ్డ బలంతో గెలుపు మనదే అనుకున్నారంతా. గేల్, శామ్యూల్స్‌ వంటి హిట్టర్లు విఫలం కావడంతో ఆట అలాగే మొదలైంది కూడా. కానీ, జాన్సన్‌ చార్లెస్‌ (36 బంతుల్లో 52; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు), లెండిల్‌ సిమన్స్‌ 51 బంతుల్లో 82; 7 ఫోర్లు, 5 సిక్స్‌లు), రసెల్‌ (20 బంతుల్లో 43; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) ఇలా ఒకరి వెంట ఒకరు విరుచుకుపడి రెండు బంతులు ఉండగానే విజయాన్ని గుంజేసుకున్నారు.

2016 ఆగస్ట్‌ 27: ఫ్లోరిడాలో వెస్టిండీస్‌–భారత్‌ మధ్య రెండో టి20. మొదట బ్యాటింగ్‌ చేసిన విండీస్‌ జాన్సన్‌ చార్లెస్‌ (33 బంతుల్లో 79; 6 ఫోర్లు, 7 సిక్స్‌లు), ఎవిన్‌ లూయీస్‌ (49 బంతుల్లో 100; 5 ఫోర్లు, 9 సిక్స్‌లు) దుమ్ము రేపడంతో 245 పరుగుల భారీ స్కోరు చేసింది. ఛేదనలో కేఎల్‌ రాహుల్‌ (51 బంతుల్లో 110; 12 ఫోర్లు, 5 సిక్స్‌లు) చెలరేగడంతో టీమిండియా లక్ష్యం దిశగా దూసుకెళ్లింది. కానీ, చివరి ఓవర్లో బ్రేవో జిత్తులమారి బౌలింగ్‌తో విజయానికి ఒక్క పరుగు దూరంలో నిలిచిపోయింది.  

సాక్షి క్రీడా విభాగం:  ప్రపంచ చాంపియన్‌ వెస్టిండీస్‌ టి20ల్లో ఎంతటి మొండి జట్టో చెప్పేందుకు పై రెండు ఉదాహరణలు చాలు. ఈ పొట్టి ఫార్మాట్‌లో భారత్‌... ఆస్ట్రేలియా కొమ్ములు వంచింది. దక్షిణాఫ్రికాను మట్టికరిపించింది. పాకిస్తాన్‌కు దమ్ము చూపించింది. ఇంగ్లండ్‌కు ముచ్చెమటలు పట్టించింది. కానీ, విండీస్‌ను మాత్రం కనీసం వణికించలేకపోతోంది. కారణం... ఆ జట్టులోని భీకర హిట్టర్లైన బ్యాట్స్‌మెన్, మంత్రం వేసినట్లు కట్టిపడేసే బౌలర్లే. టెస్టులు, వన్డే ల్లో ప్రదర్శన ఎలా ఉన్నా... ప్రపంచవ్యాప్తంగా లీగ్‌ల లో ఆడుతుండటంతో కరీబియన్లు టి20ల్లో మేటిగా నిలుస్తున్నారు. దీంతో వారికి ఒత్తిడిని అధిగమించడంతో పాటు, వేదిక ఏదైనా, ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా ఎదురుదాడి చేసే స్థయిర్యం అలవడింది. 

ఎంతకూ మింగుడుపడదే! 
టీమిండియా ఇప్పటివరకు విండీస్‌పై 8 టి20లు ఆడితే రెండే నెగ్గగలిగింది. ఐదింటిలో ఓడిపోయింది. మరో మ్యాచ్‌ రద్దయింది. మేటి జట్లన్నింటిపై మెరుగైన రికార్డు ఉన్నా, కరీబియన్లు మాత్రం మనకు ఎంతకూ లొంగడం లేదు. గేల్‌ దుమారం అంతగా తాకకున్నా... ఎవిన్‌ లూయీస్, జాన్సన్‌ చార్లెస్, లెండిల్‌ సిమ్మన్స్‌ వంటి పెద్దగా పేరు లేని ఆటగాళ్లే భారత్‌ను బంతాట ఆడుకున్నారు. వీరితోపాటు బ్రేవో, స్యామీ, బ్రాత్‌వైట్, పొలార్డ్, రస్సెల్‌ వంటి ఆల్‌రౌండర్లతో ఆ జట్టు ఎంతకూ తెగని కథలా కనిపించేది. ఇందులో చాలామంది ప్రస్తుత జట్టులో లేకున్నా ఏ మాత్రం తక్కువ అంచనా వేయలేని పరిస్థితి. 

ఆదమరిస్తే అంతే! 
చివరి ఓవర్‌లో నాలుగు సిక్స్‌లు కొట్టి ఇంగ్లండ్‌ నుంచి టి20 ప్రపంచకప్‌ను అమాంతం లాగేసుకున్న కార్లోస్‌ బ్రాత్‌వైట్‌ ఇప్పుడు వెస్టిండీస్‌ టి20 జట్టు కెప్టెన్‌. ఐపీఎల్‌లో కోల్‌కతా తరఫున మెరుపులు మెరిపించిన  రసెల్, ముంబై ఇండియన్స్‌ను చాలా సార్లు గట్టెక్కించిన కీరన్‌ పొలార్డ్‌ ఈ సిరీస్‌కు అందుబాటులోకి వచ్చారు. వీరితో పాటు జట్టులో ఉన్న కారీ పియరీ, షెర్ఫేన్‌ రూథర్‌ఫర్డ్‌ అటు బ్యాట్‌తో, ఇటు బంతితో దెబ్బకొట్టే సత్తా ఉన్న ఆల్‌రౌండర్లే కావడం విశేషం. ఇక, యువ హెట్‌మైర్‌ దూకుడెంతో వన్డే సిరీస్‌లోనే తెలిసొచ్చింది. లూయిస్‌ స్థానంలో జట్టులోకి వచ్చిన నికొలస్‌ పూరన్‌ సైతం సత్తా ఉన్నవాడే. ఈ నేపథ్యంలో ఒక్క ఓవర్‌తో ఫలితం మారిపోయే టి20ల్లో భారత్‌ మరింత అప్రమత్తంగా ఉండాల్సిందే.  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top