పాక్‌ రేసులోకొచ్చింది | World Cup 2019 Pakistan Beat New Zealand By 6 Wickets | Sakshi
Sakshi News home page

పాక్‌ రేసులోకొచ్చింది

Jun 27 2019 12:15 AM | Updated on Jun 27 2019 7:57 AM

World Cup 2019 Pakistan Beat New Zealand By 6 Wickets - Sakshi

బర్మింగ్‌హామ్‌: ప్రపంచకప్‌ రేసు రసవత్తరమవుతోంది. రోజు వ్యవధిలో ఇంగ్లండ్, న్యూజిలాండ్‌ ఓటమి పాలవడంతో మిగతా జట్లను సెమీస్‌ చాన్స్‌ ఊరిస్తోంది. ఇప్పుడు అలాంటి చాన్స్‌నే పాకిస్తాన్‌ కొట్టేసింది. బుధవారం జరిగిన పోరులో పాక్‌ 6 వికెట్ల తేడాతో జోరుమీదున్న కివీస్‌కు షాకిచ్చింది. ముందుగా న్యూజిలాండ్‌ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 237 పరుగులు చేసింది. నీషమ్‌ (112 బంతుల్లో 97 నాటౌట్‌; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) పోరాడగా... గ్రాండ్‌హోమ్‌ (71 బంతుల్లో 64; 6 ఫోర్లు, 1 సిక్స్‌) అండగా నిలిచాడు. పాక్‌ బౌలర్‌ షాహిన్‌ ఆఫ్రిది 3 వికెట్లు తీశాడు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన పాకిస్తాన్‌ 49.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 241 పరుగులు చేసి గెలిచింది. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ బాబర్‌ ఆజమ్‌ (127 బంతుల్లో 101 నాటౌట్‌; 11 ఫోర్లు) అజేయ శతకం సాధించగా, హారిస్‌ సొహైల్‌ (76 బంతుల్లో 68; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) అతనికి అండగా నిలిచాడు.  

కష్టాలతో మొదలైందిలా...
టాస్‌ నెగ్గిన న్యూజిలాండ్‌ బ్యాటింగ్‌ ఎంచుకుంది. కానీ ఈ నిర్ణయం తప్పని తెలిసేందుకు ఎంతోసేపు పట్టలేదు. పిచ్‌పై తేమ, ఔట్‌ ఫీల్డ్‌ మందకొడిగా ఉండటం పాక్‌కు కలిసొచ్చింది. ఇన్నింగ్స్‌ రెండో ఓవర్‌ వేసిన ఆమిర్‌ గప్టిల్‌ (5)ను బౌల్డ్‌ చేయగా... రెండు బౌండరీలతో ఊపుమీదున్న మున్రో (12)ను, రాస్‌ టేలర్‌ (3)ను షాహిన్‌ ఆఫ్రిది తన వరుస ఓవర్లలో పెవిలియన్‌ చేర్చాడు. అప్పటికీ జట్టు స్కోరు 38/3. కాసేపటికే లాథమ్‌ (1)ను కూడా షాహినే ఔట్‌ చేశాడు.  ఈ దశలో కెప్టెన్‌ విలియమ్సన్, నీషమ్‌ జోడీ నింపాదిగా ఆడింది. కానీ జట్టు కుదురుకుంటున్న దశలో విలియమ్సన్‌ (69 బంతుల్లో 41; 4 ఫోర్లు) ఔట్‌ కావడంతో వందలోపే కివీస్‌ సగం వికెట్లను చేజార్చుకుంది. అనంతరం నీషమ్, గ్రాండ్‌హోమ్‌ పట్టుదలతో ఆడారు. ఆరో వికెట్‌కు 132 పరుగులు జోడించాక గ్రాండ్‌హోమ్‌ రనౌటై వెనుదిరిగాడు. నీషమ్‌ సెంచరీకి చేరువగా వచ్చి 3 పరుగుల దూరంలో నిలిచాడు.  

బాబర్‌ అజేయంగా...
లక్ష్యం మోస్తరుగానే ఉండటంతో పాక్‌కు ఎక్కడా ఇబ్బందులు ఎదురవలేదు. మూడో ఓవర్లోనే ఫఖర్‌ జమాన్‌ (9) నిష్క్రమించినా... కాసేపటికి ఇమామ్‌ ఉల్‌ హక్‌ (19) ఔటయినా...  బాబర్‌ ఆజమ్, హఫీజ్‌ (50 బంతుల్లో 32; 5 ఫోర్లు) సమన్వయంతో ఆడటంతో పాక్‌ లక్ష్యానికి అవసరమైన ఒక్కో పరుగును జత చేసుకుంటూ వెళ్లింది. మరో వికెట్‌ పడకుండా 22.5 ఓవర్లలో పాకిస్తాన్‌ 100 పరుగులు చేసింది. ఈ జోడీ బలపడిన దశలో కెప్టెన్‌ విలియమ్సన్‌ బౌలింగ్‌కు దిగి హఫీజ్‌ వికెట్‌ను పడగొట్టాడు. 

అలా పాక్‌ 110 పరుగుల వద్ద మూడో వికెట్‌ను కోల్పోగా సొహైల్‌... బాబర్‌కు జతయ్యాడు. సొహైల్‌ కూడా చక్కగా ఆడటంతో ఇన్నింగ్స్‌ సాఫీగా సాగిపోయింది. అతని అండతో బాబర్‌ 65 బంతుల్లో తన అర్ధసెంచరీ పూర్తిచేసుకున్నాడు. గతితప్పిన బంతిని బౌండరీ దాటిస్తూ సొహైల్‌ వేగం పెంచాడు. 36వ ఓవర్లో జట్టు స్కోరు 150కి చేరింది. హరిస్‌ 61 బంతుల్లో అర్ధసెంచరీ చేస్తే... బాబర్‌ 124 బంతుల్లో శతకం సాధించాడు. లక్ష్యానికి 2 పరుగుల దూరంలో సొహైల్‌ రనౌటవ్వగా మిగతా లాంఛనాన్ని సర్ఫరాజ్‌ (5 నాటౌట్‌) పూర్తి చేశాడు. పాక్‌ తమ చివరి రెండు మ్యాచ్‌ల్లో అఫ్గానిస్తాన్‌ (జూన్‌ 29న)తో, బంగ్లాదేశ్‌ (జూలై 5న)తో ఆడుతుంది.

స్కోరు వివరాలు
న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌: గప్టిల్‌ (బి) ఆమిర్‌ 5; మున్రో (సి) హారిస్‌ సొహైల్‌ (బి) షాహిన్‌ ఆఫ్రిది 12; విలియమ్సన్‌ (సి) సర్ఫరాజ్‌ (బి) షాదాబ్‌ ఖాన్‌ 41; టేలర్‌ (సి) సర్ఫరాజ్‌ (బి) షాహిన్‌ ఆఫ్రిది 3; లాథమ్‌ (సి) సర్ఫరాజ్‌ (బి) షాహిన్‌ ఆఫ్రిది 1; జిమ్మీ నీషమ్‌ (నాటౌట్‌) 97; కొలిన్‌ గ్రాండ్‌హోమ్‌ (రనౌట్‌) 64; సాన్‌ట్నర్‌ (నాటౌట్‌) 5; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (50 ఓవర్లలో 6 వికెట్లకు) 237.

వికెట్ల పతనం: 1–5, 2–24, 3–38, 4–46, 5–83, 6–215.  

బౌలింగ్‌: మొహమ్మద్‌ హఫీజ్‌ 7–0–22–0, మొహమ్మద్‌ ఆమిర్‌ 10–0–67–1, షాహిన్‌ ఆఫ్రిది 10–3–28–3, ఇమాద్‌ 3–0–17–0, షాదాబ్‌ 10–0–43–1, వహాబ్‌ రియాజ్‌ 10–0–55–0.  

పాకిస్తాన్‌ ఇన్నింగ్స్‌: ఇమాముల్‌ హక్‌ (సి) గప్టిల్‌ (బి) ఫెర్గూసన్‌ 19; ఫఖర్‌ (సి) గప్టిల్‌ (బి) బౌల్ట్‌ 9; బాబర్‌ ఆజమ్‌ (నాటౌట్‌) 101; హఫీజ్‌ (సి) ఫెర్గూసన్‌ (బి) విలియమ్సన్‌ 32; çహారిస్‌ సొహైల్‌ (రనౌట్‌) 68; సర్ఫరాజ్‌ (నాటౌట్‌) 5; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (49.1 ఓవర్లలో 4 వికెట్లకు) 241.

వికెట్ల పతనం: 1–19, 2–44, 3–110, 4–236.  

బౌలింగ్‌: బౌల్ట్‌ 10–0–48–1, హెన్రీ 7–0–25–0, ఫెర్గూసన్‌ 8.1–0–50–1, గ్రాండ్‌హోమ్‌ 2–0– 12–0, సాన్‌ట్నర్‌ 10–0–38–0, నీషమ్‌ 3–0– 20–0, విలియమ్సన్‌ 8–0–39–1, మున్రో 1–0–9–0.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement