ఆల్‌రౌండ్ నైపుణ్యంతో ఆకట్టుకున్న శ్రీలంక... పాకిస్థాన్‌తో జరిగిన రెండో టెస్టులో 9 వికెట్ల తేడాతో నెగ్గింది.
దుబాయ్: ఆల్‌రౌండ్ నైపుణ్యంతో ఆకట్టుకున్న శ్రీలంక... పాకిస్థాన్‌తో జరిగిన రెండో టెస్టులో 9 వికెట్ల తేడాతో నెగ్గింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. మిస్బా సేన నిర్దేశించిన 137 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన లంక ఆదివారం ఐదో రోజు రెండో ఇన్నింగ్స్‌లో 46.2 ఓవర్లలో వికెట్ నష్టానికి 137 పరుగులు చేసి నెగ్గింది. వికెట్లపరంగా పాక్‌పై లంకు ఇదే పెద్ద విజయం.
కరుణరత్నే (125 బంతుల్లో 62 నాటౌట్; 8 ఫోర్లు), కౌశల్ సిల్వా (134 బంతుల్లో 58; 5 ఫోర్లు) అర్ధసెంచరీలతో ఆకట్టుకున్నారు. సంగక్కర (9 నాటౌట్) మిగతా పనిని పూర్తి చేశాడు. అంతకుముందు 330/7 ఓవర్‌నైట్ స్కోరుతో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన పాక్ 137.3 ఓవర్లలో 359 పరుగులకు ఆలౌటైంది. జయవర్ధనేకు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఇరుజట్ల మధ్య మూడో టెస్టు షార్జాలో గురువారం నుంచి జరుగుతుంది.