మీరు ఒంటరి వాళ్లు కాదు : గంగూలీ

Sourav Ganguly Extends Support To Ex Teammate Family Who Is In Hospital - Sakshi

అహ్మదాబాద్‌ : రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న టీమిండియా మాజీ క్రికెటర్‌ జాకోబ్‌ మార్టిన్‌(46) కుటుంబానికి భారత ఆటగాళ్లు అండగా నిలిచారు. కష్టకాలంలో మార్టిన్‌ కుటుంబాన్ని ఆదుకునేందుకు తమ వంతు సహాయం చేసేందుకు ముందుకు వచ్చారు. గతేడాది డిసెంబరు 28న జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మార్టిన్‌ ఊపిరితిత్తులు, లివర్‌ పూర్తిగా దెబ్బతిన్నాయి. ప్రస్తుతం అతడు వడోదరలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ క్రమంలో తమకు సహాయం చేయాల్సిందిగా మార్టిన్‌ భార్య భారత క్రికెట్‌ నియంత్రణ మండలి(బీసీసీఐ)కి లేఖ రాశారు. ఈ నేపథ్యంలో బీసీసీఐ 5 లక్షల రూపాయలు అందించగా.. బరోడా క్రికెట్‌ అసోసియేషన్‌ 3 లక్షల రూపాయల సాయం అందించింది.

కాగా మార్టిన్‌ పరిస్థితి గురించి తెలుసుకున్న టీమిండియా మాజీ సారథి సౌరవ్‌ గంగూలీ మాట్లాడుతూ.. ‘నేను, మార్టిన్‌ ఒకప్పుడు టీమ్‌మేట్స్‌. తను చాలా కామ్‌గా, రిజర్వ్‌డ్‌గా ఉండేవాడు. ప్రస్తుతం తన ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. అతడు తొందరగా కోలుకోవాలి. మీరు ఒంటరి వాళ్లు కారు. మేమంతా మీకు తోడున్నాం’ అంటూ మార్టిన్‌ కుటుంబ సభ్యులకు అండగా నిలిచారు. గంగూలీతో పాటుగా జహీర్‌ ఖాన్‌, ఇర్ఫాన్‌ పఠాన్‌, యూసఫ్‌ పఠాన్‌, టీమిండియా కోచ్‌ రవిశాస్త్రి కూడా మార్టిన్‌కు సహాయం చేసేందుకు ముందుకువచ్చారని బరోడా క్రికెట్‌ అసోసియేషన్‌ సెక్రటరీ సంజయ్‌ పటేల్‌ తెలిపారు. ఇక బరోడా క్రికెట్‌ జట్టు కెప్టెన్‌గా వ్యవహరించిన జాకోబ్‌ మార్టిన్‌ 1999లో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. మొత్తం పది వన్డేలు ఆడిన మార్టిన్‌ 158 పరుగులు చేశాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top