అందుకే మంజ్రేకర్‌పై వేటు పడిందా?

Sanjay Manjrekar Axed From BCCI Commentary Panel Includes IPL 2020 - Sakshi

ఢిల్లీ : భారత మాజీ క్రికెటర్‌, ప్రఖ్యాత కామెంటేటర్‌ సంజయ్‌ మంజ్రేకర్‌ బీసీసీఐ కామెంటరీ ప్యానెల్‌ నుంచి తప్పుకున్నట్లు వార్తలు వచ్చాయి. కాగా అతను ఒక్క బీసీసీఐ ప్యానెల్‌ నుంచే గాక ఐపీఎల్‌ 2020 కామెంటరీ ప్యానెల్‌ నుంచి కూడా వైదొలగినట్లు తెలుస్తుంది. ఈ విషయంపై ఇంకా బీసీసీఐ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కాగా మంజ్రేకర్‌ కొన్ని సంవత్సరాల నుంచి టీమిండియా స్వదేశంలో ఆడుతున్న మ్యాచ్‌లకు కామెంటరీ అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో గురువారం ధర్మశాలలో జరిగిన దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో మంజ్రేకర్‌ కామెంటరీ ప్యానెల్‌కు రాలేదని తెలిసింది. కాగా సునీల్‌ గవాస్కర్‌, లక్ష్మణ్‌ శివరామకృష్ణన్‌, మురళి కార్తిక్‌లు మాత్రమే కామెంటరీ ప్యానెల్‌లో పాల్గొన్నారని ఒక పత్రిక తన కథనంలో ప్రచురించింది. కాగా వర్షం కారణంగా టాస్‌ కూడా పడకుండా మ్యాచ్‌ రద్దయిన సంగతి తెలిసిందే.అయితే మంజ్రేకర్‌ కామెంటరీ చేయకపోవడం పట్ల సరైన కారణం తెలియరాలేదు. (మంజ్రేకర్‌ను టీజ్‌ చేసిన జడేజా)

కాగా గతేడాది జరిగిన వరల్డ్‌కప్‌ సందర్భంగా టీమిండియా ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజాపై మంజ్రేకర్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ' రవీంద్ర జడేజా లాంటి బీట్స్‌ అండ్‌ పీసెస్‌ ఆటగాళ్లకు తాను ఫ్యాన్‌ కాదని, జడేజా టెస్టు క్రికెటర్‌ మాత్రమేనని, పరిమిత ఓవర్ల క్రికెట్‌కు అతడు అన్‌ఫిట్‌ అంటూ' అంటూ పేర్కొన్నాడు. దీనిపై అప్పట్లో పెద్ద దుమారమే రేగింది. దీనికి జడేజా కూడా ధీటుగానే బదులిచ్చాడు. ఆ తర్వాత సహచర కామెంటేటర్‌ హర్షా భోగ్లేపై కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఆ తర్వాత మంజ్రేకర్‌ క్షమాపణలు చెప్పాడు. అయితే తాజాగా మంజ్రేకర్‌ బీసీసీఐ కామెంటేటరీ ప్యానెల్‌ నుంచి తప్పుకోవడం వెనుక అతని పనితీరు నచ్చకనే బీసీసీఐ తీసేసిందా అనేది తెలియదు. కాగా ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ వేగంగా విస్తరిస్తుండడంతో భారత్‌లో జరగాల్సిన ఐపీఎల్‌ 13వ సీజన్‌ను ఏప్రిల్‌ 15కు వాయిదా వేసిన సంగతి తెలిసిందే.

(మంజ్రేకర్‌.. నీ సహచర వ్యాఖ్యాతను అవమానిస్తావా!)

(వాయిదా వేసి మంచిపని చేసింది : గవాస్కర్‌)

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top