మంజ్రేకర్‌.. నీ సహచర వ్యాఖ్యాతను అవమానిస్తావా!

Ind vs Ban: Fans Ask Manjrekar To Apologise To Harsha Bhogle - Sakshi

కోల్‌కతా: ఇటీవల కాలంలో పదే పదే నెటిజన్ల కోపానికి గురౌవుతున్న కామెంటేటర్‌ సంజయ్‌ మంజ్రేకర్‌ మరోసారి దొరికిపోయాడు. టీమిండియా-బంగ్లాదేశ్‌ జట్ల మధ్య జరిగిన పింక్‌ బాల్‌ టెస్టుకు కామెంటేటర్‌గా వ్యవహరించిన మంజ్రేకర్‌.. సహచర వ్యాఖ్యాత హర్షా భోగ్లే చిన్నబుచ్చుకునేలా మాట్లాడాడు. పింక్‌ బాల్‌ టెస్టుకు సంబంధించి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయేమో అని ఇరు జట్ల ఆటగాళ్లను అడిగి తెలుసుకోవాలని భోగ్లే సూచించాడు. ప్రధానంగా బంతి ఎలా కనిపిస్తుంది అనే దానిపై క్రికెటర్లను అడిగితేనే కానీ తెలియదని భోగ్గే పేర్కొన్నాడు. దీనికి వెంటనే స్పందించిన మంజ్రేకర్‌.. ఈ విషయం నువ్వే అడగాలి. ఏమో ఏదో సాధారణ క్రికెట్‌ మాత్రమే ఆడం. మాకు అర్హత లేదు’ అని మాట్లాడాడు. ఇది నెటిజన్లకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది.

హర్షా భోగ్లే క్రికెట్‌ ఆడకుండానే ప్రముఖ వ్యాఖ్యాతగా ఎదిగిన విషయాన్ని మంజ్రేకర్‌ పరోక్షంగా ప్రస్తావిస్తూ అవమానించాడని సోషల్‌ మీడియాలో చర్చ సాగుతోంది. ఈ క్రమంలోనే మంజ్రేకర్‌ వ్యవహరించిన తీరును ఎండగడుతున్నారు. ‘ క్రికెట్‌లో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా మంజ్రేకర్‌ను అడగండి. ఫీల్డ్‌లో అంపైర్‌ ఔటిచ్చిన సందర్భంలో కూడా మంజ్రేకర్‌ని అడిగిన తర్వాతే ఇవ్వాలి’ అని ఒక నెటిజన్‌ విమర్శించగా, ‘ నువ్వు అసలు కామెంటరీ బాక్స్‌లో ఉండాలని ఏ భారత అభిమాని కోరుకోవడం లేదు’ అని మరొకరు మండిపడ్డారు.  ‘ క్రికెట్‌ చరిత్రలో అత్యంత చెత్త కామెంటేటర్‌ ఎవరైనా ఉన్నారంటే అది మంజ్రేకరే’ అని మరొక అభిమాని ఎద్దేవా చేశాడు. ‘ ఇరు జట్ల ఆటగాళ్లను పింక్‌ బాల్‌ ఎలా కనిపిస్తుందని అడిగితే బాగుంటుందని హర్హా భోగ్లే చెప్పిన దాంట్లో తప్పేముంది. అది ఒక మంచి వ్యాఖ్యానం.  కానీ భోగ్లేతో నువ్వు చాలా దారుణంగా ప్రవర్తించావు. నీకు నీ సహచర కామెంటేటర్‌తో ఎలా మాట్లాడాలో తెలీదు. అతని కనీసం ఒక మ్యాచ్‌ కూడా ఆడకపోయినా కామెంటేటర్‌గా సక్సెస్‌ అయ్యాడు’ అని మరొకరు పేర్కొన్నారు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top