ఇలాంటి ‘విశ్రాంతి’ కావాల్సిందే! 

Ravi Shastri Says Break Is Welcome Rest For Team India Players - Sakshi

చాలా మంది ఆటగాళ్లు అలసిపోయారు

జట్టుకు కోహ్లినే‘బాస్‌’

భారత క్రికెట్‌ జట్టు హెడ్‌ కోచ్‌ రవిశాస్త్రి మనోగతం  

ముంబై : కరోనా కారణంగా ప్రపంచ క్రీడారంగం మొత్తం స్తంభించిపోయింది. ఎక్కడా ఎలాంటి ఈవెంట్లు లేకపోవడంతో ఆటగాళ్లంతా ఇళ్లకే పరిమితమయ్యారు. భారత్‌లోనైతే లాక్‌డౌన్‌ కూడా అమల్లో ఉంది కాబట్టి మన క్రికెటర్లకు మరో ప్రత్యామ్నాయం కూడా లేదు. అయితే ఈ విరామం మన ఆటగాళ్ల మంచికేనని జట్టు హెడ్‌ కోచ్‌ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కారణం కరోనానే అయినా సరైన సమయంలో తమ జట్టుకు తగిన విశ్రాంతి లభించిందని అతను అన్నాడు. ‘ఈ విశ్రాంతి వల్ల ఇబ్బంది లేదని నా అభిప్రాయం. ఎందుకంటే న్యూజిలాండ్‌ పర్యటన చివరకు వచ్చేసరికి మన ఆటగాళ్లంతా శారీరకంగా, మానసికంగా కూడా బాగా అలసిపోయారు. వీటికి తోడు కొన్ని గాయాలు కూడా. కాబట్టి ఇది ఆటగాళ్లకు మేలు చేసేదే’ అని రవిశాస్త్రి వ్యాఖ్యానించాడు. (లాక్‌డౌన్‌: విరుష్కలు ఏం చేస్తున్నారో చూశారా?)

అయితే టీమిండియా సభ్యులు తాము పునరుత్తేజం పొందేందుకు ఈ సమయాన్ని వాడుకోవాలని సూచించాడు. ‘గత పది నెలల కాలంలో భారత జట్టు చాలా ఎక్కువ క్రికెట్‌ ఆడింది. నాతోపాటు మరికొందరు ఆటగాళ్లు ప్రపంచ కప్‌ కోసం మే 23న ఇంగ్లండ్‌ బయల్దేరాం. అప్పటి నుంచి చూస్తే కేవలం 10–11 రోజులు మాత్రమే ఇంట్లో ఉండగలిగాం. కొందరు క్రికెటర్లు మూడు ఫార్మాట్‌లలోనూ ఆడుతున్నారు. వారి పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చు. సుదీర్ఘ ప్రయాణాలు చేస్తూ టి20ల నుంచి టెస్టుల వరకు ఫార్మాట్‌లకు అనుగుణంగా తమను తాము మార్చుకోవడం అంత సులువు కాదు. కాబట్టి ఈ సమయంలో విరామం మంచిదే’ అని భారత కోచ్‌ విశ్లేషించారు.  

అప్పుడే సందేహించాం... 
దేశంలో లాక్‌డౌన్‌ లాంటిది జరగవచ్చని తాము కాస్త ముందుగానే అంచనాకు వచ్చామని, చివరకు అదే నిజమైందని శాస్త్రి చెప్పాడు. ‘దక్షిణాఫ్రికా వన్డే సిరీస్‌ సమయంలోనే రాబోయే ప్రమాదం గురించి మా మనసుల్లో శంక ఏర్పడింది. అప్పుడే కరోనా తీవ్రమవుతోంది. ఇక రెండో వన్డే రద్దు కాగానే పెద్ద నిర్ణయం తీసుకుంటారని అనుకున్నాం. నిజానికి న్యూజిలాండ్‌లో ఉన్నప్పుడే విమానాలు సింగపూర్‌ మీదుగా వెళుతున్నాయని తెలిసి పరిస్థితులు అదోలా అనిపించాయి. ఆ సమయంలో న్యూజిలాండ్‌లో రెండు కోవిడ్‌–19 కేసులు నమోదయ్యాయి. ఆలస్యం కాకుండా మేం సరైన సమయంలో భారత్‌లోకి అడుగుపెట్టగలిగాం. ఎందుకంటే మేం దిగిన రోజు నుంచే కరోనా గురించి ఎయిర్‌పోర్ట్‌లో స్క్రీనింగ్‌ పరీక్షలు మొదలయ్యాయి. ఇప్పుడు క్రికెటర్ల దృష్టిలో కూడా క్రికెట్‌ చివరి ప్రాధాన్యతాంశం మాత్రమే’ అని ఈ మాజీ ఆటగాడు తమ అనుభవాన్ని గుర్తు చేసుకున్నాడు.  

కెప్టెన్‌వే అన్ని నిర్ణయాలు... 
భారత జట్టును నడపడంలో కెప్టెన్‌గా విరాట్‌ కోహ్లికే సర్వాధికారాలు ఉన్నాయని... కోచింగ్‌ సిబ్బంది అతనికి సహాయకారిగా మాత్రమే ఉంటారని రవిశాస్త్రి స్పష్టం చేశాడు. మొదటి నుంచి కూడా క్రికెట్‌లో కెప్టెన్‌ మాట చెల్లాలనే విషయాన్ని తాను నమ్ముతానని కూడా అతను చెప్పాడు. ‘కెప్టెన్‌ మాత్రం జట్టుకు ‘బాస్‌’గా ఉంటాడు. ఇది నా గట్టి నమ్మకం. మైదానంలో ధైర్యంగా, సానుకూల ఆలోచనతో, దూకుడైన క్రికెట్‌ ఆడే విధంగా ఆటగాళ్లను బయటినుంచి సన్నద్ధం చేయడమే కోచింగ్‌ సిబ్బంది పని. నాయకుడు స్వయంగా ముందుండి జట్టును నడిపించాలి. అతని భారం కొంత తగ్గించేందుకు మేం ఉన్నాం కానీ బరిలోకి కెప్టెన్‌ సొంత నిర్ణయాలు తీసుకోవాలి. అతను అనుకున్నట్లుగా ఆటను నడిపించాలి’ అని శాస్త్రి వ్యాఖ్యానించాడు.

కోహ్లి తాను అద్భుతమైన ఫిట్‌నెస్‌తో జట్టుకు ఆదర్శంగా నిలిచాడని... ఈ క్రమంలో ఎంతో త్యాగం చేశాడని కూడా భారత కోచ్‌ అన్నాడు. ‘నేను ఈ ఆటను ఆడాలంటే, పటిష్టమైన ప్రత్యర్థులతో తలపడాలంటే ప్రపంచంలోనే అత్యంత ఫిట్‌ క్రికెటర్‌గా ఉండాలి. అందుకోసం దేనికైనా సిద్ధమని అతను నాతో ఒక రోజు చెప్పాడు. కేవలం ట్రైనింగ్‌ మాత్రమే కాదు. ఇందుకోసం కోహ్లి ఎన్నో త్యాగాలు చేశాడు. తన డైట్‌లో మార్పులు చేసుకున్నాడు. అతను ఒక ప్రమాణం నెలకొల్పడంతో అందరూ దానిని ఆచరించాల్సిన పరిస్థితి వచ్చింది’ అని రవిశాస్త్రి తన కెప్టెన్‌పై ప్రశంసలు కురిపించాడు.   

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top