బెంగాల్ విలవిల | Ranji Trophy: Samad Fallah rips apart Bengal as Maharashtra gain firm control | Sakshi
Sakshi News home page

బెంగాల్ విలవిల

Jan 19 2014 1:35 AM | Updated on Oct 8 2018 6:08 PM

బెంగాల్ విలవిల - Sakshi

బెంగాల్ విలవిల

బెంగాల్‌తో జరుగుతున్న రంజీ సెమీస్‌లో తొలి రోజే మహారాష్ట్ర జట్టు పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది.

ఇండోర్: బెంగాల్‌తో జరుగుతున్న రంజీ సెమీస్‌లో తొలి రోజే మహారాష్ట్ర జట్టు పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. ఎడమచేతి పేసర్ సమద్ ఫల్లా నిప్పులు చెరిగే బంతులతో రెచ్చిపోవడంతో బెంగాల్ జట్టు కోలుకోలేక పోయింది. దీంతో శనివారం తమ తొలి ఇన్నింగ్స్‌ను 41.4 ఓవర్లలో 114 పరుగులకు ముగించింది. ఫల్లా 58 పరుగులకు ఏడు వికెట్లు తీయడం విశేషం. ఓపెనర్ ఆరిందమ్ దాస్ (108 బంతుల్లో 37; 7 ఫోర్లు), వృద్ధిమాన్ సాహా (40 బంతుల్లో 29; 6 ఫోర్లు) టాప్ స్కోరర్లుగా నిలిచారు. మూడో ఓవర్ నుంచే ఫల్లా ప్రత్యర్థి బ్యాటింగ్ ఆర్డర్‌ను దెబ్బతీయడం ఆరంభించాడు. వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతూ వచ్చిన బెంగాల్ ఏ దశలోనూ పోరాడలేక పోయింది.
 
 13 పరుగుల వ్యవధిలో చివరి నాలుగు వికెట్లను కోల్పోయింది. ఏకంగా ఏడుగురు ఆటగాళ్లు రెండంకెల స్కోరు కూడా చేయలేక పోయారు. ఆ తర్వాత తమ తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన మహారాష్ట్ర ఆట ముగిసే సమయానికి 44 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది. తొలి వికెట్‌కు 78 పరుగుల శుభారంభం లభించినా స్వల్ప వ్యవధిలోనే వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ ఖురానా (53 బంతుల్లో 48; 10 ఫోర్లు), కేదార్ జాదవ్ (58 బంతుల్లో 40; 8 ఫోర్లు) ఆకట్టుకున్నారు. ప్రస్తుతం క్రీజులో అంకిత్ బానే (74 బంతుల్లో 37 బ్యాటింగ్; 7 ఫోర్లు), మోత్వాని (8 బ్యాటింగ్) ఉన్నారు. దిండా, శుక్లాలకు రెండేసి వికెట్లు దక్కాయి.
 
 పంజాబ్, కర్ణాటక మ్యాచ్‌కు వర్షం అడ్డంకి
 మొహాలీ: మరో సెమీస్‌లో తలపడుతున్న పంజాబ్, కర్ణాటక జట్ల తొలి రోజు ఆటకు వరుణుడు ఆటంకం కలిగించాడు. దీంతో ఒక్క బంతి కూడా ఆడేందుకు సాధ్యపడలేదు. ఉదయం నుంచి నిరంతరాయంగా కురిసిన వర్షంతో మైదానం చిత్తడిగా మారింది. ఓ దశలో వర్షం ఆగినా కూడా ఆటకు అనుకూలమైన పరిస్థితి లేకుండా పోయింది. కనీసం టాస్ కూడా వీలు పడలేదు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement