ఈ సారి కూత ఆలస్యం...

Pro Kabaddi League: Starting date for season 6 officially announced - Sakshi

ఆసియా క్రీడలతో మారిన షెడ్యూల్‌

అక్టోబర్‌ 5 నుంచి ప్రొ కబడ్డీ లీగ్‌  

ముంబై: ఆరో సీజన్‌ కబడ్డీ కూత ఆలస్యంగా మొదలవనుంది. త్వరలో ఆసియా క్రీడలు జరగనున్న నేపథ్యంలో ప్రొ కబడ్డీ లీగ్‌ (పీకేఎల్‌) షెడ్యూల్‌ను వెనక్కి జరపాల్సి వచ్చింది. ఈ అక్టోబర్‌ 5 నుంచి మొదలయ్యే పీకేఎల్‌–6 వచ్చే జనవరి 5న జరిగే ఫైనల్‌తో ముగియనుంది. ఈ మేరకు షెడ్యూల్‌ను ఖరారు చేసినట్లు నిర్వాహక సంస్థ మషాల్‌ స్పోర్ట్స్‌ ఒక ప్రకటనలో తెలిపింది. గత ఫార్మాట్‌లాగే ఈసారీ 13 వారాల పాటు 138 మ్యాచ్‌ల్ని నిర్వహిస్తారు.

లీగ్‌ కమిషనర్‌ అనుపమ్‌ గోస్వామి మాట్లాడుతూ ‘సాధారణంగా పీకేఎల్‌ను జూలై–అక్టోబర్‌ నెలల్లో నిర్వహిస్తాం. అయితే ఆగస్టు–సెప్టెంబర్‌లో ఆసియా క్రీడలు ఉండటంతో స్వదేశీ, విదేశీ ఆటగాళ్లంతా పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో అక్టోబర్‌కు మార్చాం’ అని అన్నారు. గత సీజన్లలాగే  ఆరో సీజన్‌ కూడా ప్రేక్షకుల్ని అలరిస్తుందని, అద్భుతమైన కబడ్డీ అనుభవాన్ని ఇస్తుందని ఆయన చెప్పారు. మ్యాచ్‌లను ‘స్టార్‌ స్పోర్ట్స్‌’ నెట్‌వర్క్‌ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top