అలా అయితే ప్రతీసారి సిక్స్‌ ఇచ్చేవాణ్ని: అక్తర్‌

One Six Can Make Billion Indians Happy Says Shoaib Akhtar - Sakshi

కరాచీ: దాదాపు 17 ఏళ్ల నాటి వన్డే వరల్డ్‌కప్‌ను పాకిస్తాన్‌ మాజీ పేసర్‌, రావల్పిండి ఎక్స్‌ప్రెస్‌గా పిలవబడే షోయబ్‌ అక్తర్‌ గుర్తు చేసుకున్నాడు. ఆనాడు భారత్‌తో జరిగిన మ్యాచ్‌ సందర్భంగా తన బౌలింగ్‌లో మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ కొట్టిన అప్పర్‌ కట్‌ సిక్స్‌ ఒక ఐకానిక్‌ సిక్స్‌ అని అక్తర్‌ అభివర్ణించాడు. సచిన్‌ అంతర్జాతీయ కెరీర్‌లో వచ్చిన మరో ఆణిముత్యం ఆ సిక్స్‌ అని కొనియాడాడు. సెంచూరియన్‌లో పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో సచిన్‌ 98 పరుగులు చేసి తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. చివరకు షోయబ్‌ అక్తర్‌ బౌలింగ్‌లోనే సచిన్‌ ఔటయ్యాడు. దీనిలో భాగంగా సచిన్‌ను తాను ఔట్‌ చేశానని అక్తర్‌ చెబుతూనే.. ఆనాడు మాస్టర్‌ కొట్టిన సిక్స్‌ను కూడా ప్రస్తావించాడు.  ఇక్కడ ఆ సిక్స్‌ యావత్‌ భారతావనిని సంతోషంలో ముంచెత్తి ఉంటుందన్నాడు. (నేనేమైనా పిచ్చోడిలా కనిపిస్తున్నానా..?)

కోట్లాది భారతీయలకు ఒక సిక్స్‌ సంతోషాన్నిస్తే.. తాను ప్రతీ రోజూ సచిన్‌కు సిక్స్‌ను సమర్పించుకునేవాడినని అక్తర్‌ అన్నాడు. ‘ క్రికెట్‌ ఆడుతున్నప్పట్నుంచి సచిన్‌ నాకు బాగా తెలుసు. నాతో చాలా సన్నిహితంగా ఉండేవాడు. అతనొక అరుదైన బ్యాట్స్‌మన్‌. అంతేకాకుండా సహచర క్రికెటర్ల పట్ల సచిన్‌ చాలా వినయపూర్వకంగా ఉండేవాడు. ప్రపంచ గర్వించదగ్గ క్రికెటర్‌. అలాంటి క్రికెటర్‌ను నేను 12-13 సార్లు ఔట్‌ చేసినందుకు చాలా గర్విస్తా’ అని అక్తర్‌ తెలిపాడు. పాకిస్తాన్‌ టెలివిజన్‌ హోస్ట్‌ జైనబ్‌ అబ్బాస్‌తో ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌లో అక్తర్‌ పలు విషయాల్ని వెల్లడించాడు. ‘ ఆనాటి వరల్డ్‌కప్‌లో సెంచూరియన్‌ మ్యాచ్‌లో నా బౌలింగ్‌లో సచిన్‌ అప్పర్‌ కట్‌ షాట్‌తో సిక్స్‌గా మలచాడు. (అనుష్క వదిన చెబితే వింటాడు)

అది భారతీయుల్ని కచ్చితంగా సంతోషంలో ముంచెత్తిన క్షణమది. ఇప్పటికీ ఆ సిక్స్‌ను ఎక్కువగా చూపెడుతూ ఉంటారు.  ఒక సిక్స్‌ బిలియన్‌కు పైగా ఉన్న భారతీయుల్ని ఆనందాన్ని తీసుకు వస్తుందనే విషయం తెలిస్తే వారితో మ్యాచ్‌లోప్రతీసారి నేను సిక్స్‌ను సమర్పించుకోవడానికి సిద్ధంగా ఉండేవాడిని’ అని అక్తర్‌ తెలిపాడు. పాకిస్తాన్‌తో జరిగిన ఆనాటి మ్యాచ్‌లో భారత్‌ 274 పరుగుల టార్గెట్‌ను ఛేదించి విజయం సాధించింది. భారత్‌ ఓపెనర్‌గా దిగిన సచిన్‌.. అక్తర్‌ వేసిన రెండో ఓవర్‌లోనే విరుచుకుపడ్డాడు. ఆ ఓవర్‌లో అక్తర్‌ వేసిన షార్ట్‌ పిచ్‌ వైడ్‌ బాల్‌ను థర్డ్‌ మ్యాన్‌ దిశగా ఒక అద్భుతమైన సిక్స్‌ను కొట్టిన సచిన్‌.. ఆ తర్వాత రెండు బంతుల్ని కూడా బౌండరీలుగా తరలించాడు. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top