మూడో టీ20లో పోరాడి ఓడిన భారత్..

New Zealand beats India, Won The Series - Sakshi

హామిల్టన్‌: న్యూజిలాండ్‌తో జరిగిన చివరి టీ20లో భారత్‌ పోరాడి ఓడింది. న్యూజిలాండ్‌ నిర్దేశించిన 213 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్‌ నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసి ఓటమి పాలైంది.  దాంతో న్యూజిలాండ్‌లో తొలిసారి టీ20 సిరీస్‌ సాధించాలనుకున్న భారత్‌ ఆశలు తీరలేదు. లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్‌ ఇన్నింగ్స్‌ను ధాటిగా ఆరంభించింది. శిఖర్‌ ధావన్‌(5) తొలి వికెట్‌గా పెవిలియన్‌ చేరినప్పటికీ,  విజయ్‌ శంకర్‌‌(43;28 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లు), రిషభ్‌ పంత్‌(28; 12 బంతుల్లో 1 ఫోర్‌, 3 సిక్సర్లు), హార్దిక్‌ పాండ్యా(21;11 బంతుల్లో 1 ఫోర్‌, 2 సిక్సర్లు)లు బ్యాట్‌ ఝుళిపించారు.

వారికి జతగా రోహిత్‌ శర్మ(38;32 బంతుల్లో 3 ఫోర్లు) ఫర్వాలేదనిపించడంతో భారత్‌ ధీటుగా బదులిచ్చింది.  భారత్‌ స్కోరు 141 పరుగుల వద్ద రోహిత్‌ శర్మ నాల్గో వికెట్‌గా ఔటైన కాసేపటికి హార్దిక్‌, ధోని(2)లు కూడా నిష్ర్రమించడంతో స్కోరులో వేగం తగ్గింది. చివర్లో దినేశ్‌ కార్తీక్‌(33 నాటౌట్‌; 16 బంతుల్లో 4 సిక్సర్లు), కృనాల్‌ పాండ్యా(26 నాటౌట్‌; 13 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగి ఆడినప్పటికీ భారత్‌ను విజయ తీరాలకు చేర్చలేకపోయారు. తద్వారా సిరీస్‌ను న్యూజిలాండ్‌ 2-1తో కైవసం చేసుకుంది.

అంతకుముందు  టాస్‌ గెలిచిన భారత్‌ తొలుత ఫీల్డింగ్‌ తీసుకోవడంతో బ్యాటింగ్‌ చేపట్టిన కివీస్‌కు శుభారంభం లభించింది. ఓపెనర్లు టీమ్‌ సీఫెర్ట్‌ (43;25 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లు) ధాటిగా ఆడి జట్టుకు మంచి ఆరంభాన్ని ఇచ్చాడు. అతనికి జతగా మరో ఓపెనర్‌ కొలిన్‌ మున్రో(72; 40 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లు) చెలరేగి ఆడాడు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 80 పరుగులు జత చేసిన తర్వాత సీఫెర్ట్‌ ఔటయ్యాడు.

ఆ తర్వాత మున్రో-విలియమ్సన్‌ల జోడి స్కోరు బోర్డును చక్కదిద్దింది. ఈ క్రమంలోనే ఇరువురు 55 పరుగులు జత చేసిన తర్వాత మున్రో రెండో వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు. ఆపై మరో 15 పరుగుల వ్యవధిలో విలియమ్సన్‌(27) కూడా ఔట్‌ కావడంతో కివీస్‌ 150 పరుగుల వద్ద మూడో వికెట్‌ను నష్టపోయింది.  ఇక గ్రాండ్‌హోమ్‌(30;16 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌), డార్లీ మిచెల్‌(19 నాటౌట్; 11 బంతుల్లో 3 ఫోర్లు‌), రాస్‌ టేలర్‌(14 నాటౌట్‌; 7 బంతుల్లో 1 ఫోర్‌, 1 సిక్స్‌) తమవంత బాధ్యతను సమర్ధవంతంగా నిర్వర్తించడంతో కివీస్‌ నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 212  పరుగులు చేసింది. భారత బౌలర్లలో కుల్దీప్‌ యాదవ్‌ రెండు వికెట్లు సాధించగా, భువనేశ్వర్‌ కుమార్‌, ఖలీల్‌ అహ్మద్‌లకు తలో వికెట్‌ లభించింది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top