కోహ్లినే ప్రత్యర్థిని ఎక్కువ ఆహ్వానించాడు!

Kohli Surpasses Azharuddin To Enforced Follow On Most Times - Sakshi

రాంచీ:  దక్షిణాఫ్రికా మూడు టెస్టుల సిరీస్‌లో ఇప్పటికే సిరీస్‌ను కైవసం చేసుకున్న టీమిండియా క్లీన్‌స్వీప్‌పై దృష్టి సారించింది. దక్షిణాఫ్రికాను మూడో టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో 162 పరుగులకే కుప్పకూల్చి ఫాలోఆన్‌కు ఆహ్వానించింది. దక్షిణాఫ్రికా ఫాలోఆన్‌ ఆడే క్రమంలో ఆరంభంలోనే రెండు వికెట్లను చేజార్చుకుంది. ఓపెనర్‌ డీకాక్‌(5)ను ఉమేశ్‌ యాదవ్‌ బౌల్డ్‌ చేస్తే, ఫస్ట్‌డౌన్‌లో దిగిన హమ్జా(0)ను షమీ బౌల్డ్‌ చేశాడు. దాంతో దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో 10 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

కాగా, దక్షిణాఫ్రికాను ఫాలోఆన్‌కు ఆహ్వానించిన క్రమంలో టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి మరో రికార్డును నమోదు చేశాడు. భారత కెప్టెన్ల పరంగా చూస్తే అత్యధికంగా ప్రత్యర్థి జట్లను ఎక్కువసార్లు ఫాలోఆన్‌కు ఆహ్వానించిన ఘనతను సొంతం చేసుకున్నాడు. దక్షిణాఫ్రికా రెండు, మూడో టెస్టుల్లో ఫాలోఆన్‌కు పిలవడంతో కోహ్లి ఆ మార్కును చేరాడు. కోహ్లి ఎనిమిదిసార్లు ప్రత్యర్థిని ఫాలోఆన్‌కు ఆహ్వానించగా, మాజీ కెప్టెన్‌ మహ్మద్‌ అజహరుద్దీన్‌ తన టెస్టు కెరీర్‌లో ఏడుసార్లు ప్రత్యర్థి జట్టును ఫాలోఆన్‌కు దిగాల్సిందిగా కోరాడు. ఇక ఈ జాబితాలో ఎంఎస్‌ ధోని(5), సౌరవ్‌ గంగూలీ(4) తర్వాత వరుస స్థానాల్లో ఉన్నారు.

ఇదిలా ఉంచితే, దక్షిణాఫ్రికాపై తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ అత్యధిక పరుగుల ఆధిక్యం సాధించిన జాబితాలో తాజా మ్యాచ్‌ రెండో స్థానంలో నిలిచింది. రాంచీలో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియాకు 335 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం దక్కింది. ఈ వరుసలో 2009-10 సీజన్‌లో దక్షిణాఫ్రికాతో కోల్‌కతాలో జరిగిన మ్యాచ్‌ టాప్‌లో నిలిచింది. ఆ మ్యాచ్‌లో భారత్‌కు 347 పరుగుల తొలి ఇన్నింగ్స్‌  ఆధిక్యం లభించగా, ఇప్పటి మ్యాచ్‌ రెండో స్థానాన్ని ఆక్రమించింది. ఇక ఇటీవల పుణేలో జరిగిన మ్యాచ్‌లో భారత్‌కు 326 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం దక్కిన సంగతి తెలిసిందే. ఇది మూడో స్థానంలో ఉంది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top