‘కంగారు’పడ్డా గెలిచారు | 'Kangaroo' complaints Won | Sakshi
Sakshi News home page

‘కంగారు’పడ్డా గెలిచారు

Mar 6 2014 12:57 AM | Updated on Sep 2 2017 4:23 AM

‘కంగారు’పడ్డా గెలిచారు

‘కంగారు’పడ్డా గెలిచారు

టెస్టుల్లో అత్యంత విజయవంతమైన కెప్టెన్ స్మిత్ కెరీర్ ఓటమితో ముగిసింది.

 కేప్‌టౌన్: టెస్టుల్లో అత్యంత విజయవంతమైన కెప్టెన్ స్మిత్ కెరీర్ ఓటమితో ముగిసింది. ఆస్ట్రేలియాతో నిర్ణాయక టెస్టులో దక్షిణాఫ్రికా 245 పరుగుల తేడాతో ఓడి మూడు టెస్టుల సిరీస్‌ను 1-2 తేడాతో కోల్పోయింది.

మూడో టెస్టును కనీసం డ్రా చేయడం ద్వారానైనా సిరీస్‌లో ఓడకుండా ఉండాలని, తమ కెప్టెన్‌కు ఘనమైన వీడ్కోలు ఇవ్వాలని భావించిన సఫారీ ఆటగాళ్లు రెండో ఇన్నింగ్స్‌లో శక్తివంచన లేకుండా పోరాడారు. కానీ చివరి రోజు హారిస్ (4/32) ధాటికి తలవంచి 265 పరుగులకు ఆలౌటయ్యారు.

 ‘డ్రా’ లక్ష్యంగా పోరాటం..: ఓవర్‌నైట్ స్కోరు 71/4తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన దక్షిణాఫ్రికా జట్టు ఆఖరి రోజు చివరి వరకూ పోరాడింది.  డివిలియర్స్ (228 బంతుల్లో 43), డుఫ్లెసిస్ (109 బంతుల్లో 47), డుమిని (99 బంతుల్లో 43), ఫిలాండర్ (105 బంతుల్లో 51 నాటౌట్), స్టెయిన్ (44 బంతుల్లో 1) ఇలా ప్రతి ఆటగాడూభారీగా బంతులు ఆడి ఆసీస్ బౌలర్ల సహనాన్ని పరీక్షించారు. టెయిలెండర్లు స్టెయిన్, ఫిలాండర్ కలిసి 15 ఓవర్లు ఆడటంతో  డ్రా కావడం ఖాయమనిపించింది. మరో ఐదు ఓవర్లలో మ్యాచ్ ముగుస్తుందనగా హారిస్... ఒకే ఓవర్లో స్టెయిన్, మోర్కెల్‌లను అవుట్ చేసి ఆసీస్‌కు సిరీస్ విజయాన్ని అందించాడు. వార్నర్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, సిరీస్ అవార్డులు లభించాయి.
 
 
 రెండో ర్యాంక్‌కు ఆసీస్


 ప్రపంచ నంబర్‌వన్ దక్షిణాఫ్రికాపై సిరీస్ గెలవడంతో ఐసీసీ ర్యాంకుల్లో ఆస్ట్రేలియా రెండో స్థానానికి చేరింది. దీంతో భారత్ మూడో ర్యాంక్‌కు పడిపోయింది. ఏప్రిల్ 1 కటాఫ్ తేదీ నాటికి ఇక టెస్టులు లేవు. కాబట్టి ఇవే ఈ ఏడాదికి తుది ర్యాంకులు. దక్షిణాఫ్రికాకు నంబర్‌వన్ గదతో పాటు రూ. 2 కోట్ల 85 లక్షలు నగదు బహుమతి లభిస్తుంది. ఆస్ట్రేలియాకు రూ. 2 కోట్ల 22 లక్షలు, భారత్‌కు రూ.1 కోటి 59 లక్షలు లభించనున్నాయి.
 

Advertisement
 
Advertisement
Advertisement