
న్యూఢిల్లీ: భారత క్రికెట్‌లో ఎంఎస్ ధోని స్థానం ప్రత్యేకం. టీమిండియాకు రెండు ప్రపంచకప్‌లు అందించిన ఘనత ధోని సొంతం. దాంతో పాటు భారత తరపున అత్యంత సక్సెస్ ఫుల్ కెప్టెన్లలో ధోని ముందు వరుసలో ఉన్నాడు. ఇవన్నీ ఒకటైతే, సహచర క్రికెటర్లకు గౌరవం ఇవ్వడంలో ధోని ఎంతో హుందాగా వ్యవహరిస్తాడని అంటున్నాడు మాజీ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్.
‘నేను ధోని నాయకత్వంలో ఆడాను. యువ ఆటగాళ్లను ధోని ఆదరించే విధానం చాలా బాగుంటుంది. ఎవరైనా సరే ధోనీ వద్దకు ఎప్పుడైనా వెళ్లి చాలా ఫ్రీగా మాట్లాడొచ్చు. మొదటిసారి జట్టులోకి వచ్చిన ఆటగాళ్లైనా ధోనితో ఎటువంటి భయం లేకుండా మాట్లాడొచ్చు. మనం అతనికి ఎంత గౌరవం ఇస్తామో.. అతడు కూడా అంతే గౌరవం మనకిస్తాడు. మనతో మాట్లాడేందుకు చొరవ చూపుతాడు. అంతేకాదు మనతో మనస్ఫూర్తిగా మాట్లాడతాడు. ఎందుకంటే మనం అప్పుడే కొత్తగా జట్టులోకి వచ్చి ఉంటాం కాబట్టి. దీన్ని పట్టించుకోనవసరం లేదు. ధోని కోపంగా ఎప్పుడూ ఉండడు. అందుకే ధోని గొప్ప సారథి అయ్యాడు’ అని ఇర్ఫాన్ కొనియాడాడు.