పంత్‌ విధ్వంసం.. ఢిల్లీ ఘన విజయం

IPL 2019 Delhi Capitals Beat Rajasthan Royals By 6 Wickets - Sakshi

అర్దసెంచరీతో రాణించిన ధావన్‌

రహానే సెంచరీ వృథా

ప్లేఆఫ్‌ ఆశలను సంక్షిష్టం చేసుకున్న రాజస్తాన్‌

జైపూర్‌: యువ సంచలన ఆటగాడు రిషభ్‌ పంత్‌ బెబ్బులిలా రెచ్చిపోయాడు. రాజస్తాన్‌ బౌలర్లను చీల్చి చెండడంతో భారీ స్కోర్‌ కూడా చిన్నదైపోయింది. దీంతో రాజస్తాన్‌ రాయల్స్‌ పై ఆరు వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌ ఘన విజయం సాధించింది. ఐపీఎల్‌లో భాగంగా స్థానిక సవాయ్‌మాన్‌ సింగ్‌ మైదానంలో జరిగిన మ్యాచ్‌లో పరుగులు వరద పారింది. మొదట రహానే(105 నాటౌట్‌; 63 బంతుల్లో 11ఫోర్లు, 3 సిక్సర్లు), స్మిత్‌ (50; 32 బంతుల్లో 8ఫోర్లు)లు చెలరేగి ఆడటంతో రాజస్తాన్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. అనంతరం 192 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ ఆడుతూపాడుతూ 19.2 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని పూర్తిచేసింది. 

ఛేదనలో ఢిల్లీకి ఘనమైన ఆరంభం లభించింది. ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ ఆరంభం నుంచే దూకుడుగా ఆడుతూ స్కోర్‌బోర్డు పరుగులు పెట్టించగా.. మరో ఓపెనర్‌ పృథ్వీ షా ఆచితూచి  ఆడాడు. ఈ తరుణంలోనే ధావన్‌ అర్దసెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే గోపాల్‌ బౌలింగ్‌లో ధావన్‌(54) స్టంపౌటయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన శ్రేయాస్‌ అయ్యర్‌(4) పూర్తిగా నిరాశపరిచాడు. దీంతో కష్టాల్లో పడిన ఢిల్లీని పృథ్వీ షాతో కలిసి పంత్‌ చక్కదిద్దాడు. ఆరంభం నుంచే తనదైన రీతిలో రెచ్చిపోయిన పంత్‌ ఎడాపెడా బౌండరీలు సాధించాడు. చివర్లో పృథ్వీ షా(42), రూథర్‌ఫర్డ్‌(11) వికెట్లు వెంటవెంటనే కోల్పోయినప్పటికీ.. పంత్‌(78 నాటౌట్‌; 36 బంతుల్లో 6ఫోర్లు, 4 సిక్సర్లు) చివరి వరకు ఉండి జట్టుకు విజయాన్నందించాడు. రాజస్తాన్‌ బౌలర్లలో గోపాల్‌ రెండు వికెట్లతో ఆకట్టుకోగా.. పరాగ్‌, కులకర్ణిలు తలో వికెట్‌ దక్కించుకున్నారు. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top