కేన్‌ విలియమ్సన్‌ ఔట్‌

Injured SRH Captain Williamson to miss the clash Against RCB - Sakshi

హైదరాబాద్‌: సొంతగడ్డపై ప్రేక్షకుల మద్దతుతో మరో విజయాన్ని అందుకోవాలని సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌... ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి విజయాల బోణీ చేయాలని రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జట్లు మరో మ్యాచ్‌ కోసం సిద్ధమయ్యాయి. గెలుపే లక్ష్యంగా నేడు ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో ఈ రెండు జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఆర్సీబీ ఫీల్డింగ్‌ తీసుకుంది. టాస్‌ గెలిచిన ఆర్సీబీ కెప్టెన్‌ కోహ్లి ముందుగా సన్‌రైజర్స్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఈ మ్యాచ్‌కు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ రెగ్యులర్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ గాయం కారణంగా దూరమయ్యాడు. దాంతో భువనేశ్వర్‌ కుమార్‌ మరొకసారి కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు.

గత మ్యాచ్‌లో రాజస్తాన్‌పై భారీ లక్ష్యాన్ని అలవోకగా ఛేదించిన రైజర్స్‌ జట్టు ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతోంది. సొంతగడ్డపై ముంబై చేతిలో దెబ్బతిన్న బెంగళూరు ఈ మ్యాచ్‌తో గెలుపు బాట పట్టాలని భావిస్తోంది. కోహ్లి ఆడుతున్న మ్యాచ్‌ మాత్రమే కాకుండా ఆదివారం సెలవు రోజు కూడా కావడంతో ఈ మ్యాచ్‌పై అభిమానుల్లో అమితాసక్తి నెలకొంది.   

వార్నర్‌ గర్జన...

వరుసగా రెండు మ్యాచ్‌ల్లోనూ అర్ధసెంచరీలతో అదరగొట్టిన ఓపెనర్‌ వార్నర్‌ జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. బ్యాటింగ్‌కు కష్టంగా ఉన్న స్థితిలోనూ రాజస్తాన్‌ విధించిన 199 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో వార్నర్‌ పాత్రే కీలకం. నేటి మ్యాచ్‌లోనూ అతను చెలరేగితే సన్‌కు విజయం కష్టమేమీ కాదు. వార్నర్‌తో పాటు జానీ బెయిర్‌ స్టో, భారత ఆల్‌రౌండర్‌ విజయ్‌ శంకర్‌ అంచనాలకు తగినట్లు రాణిస్తున్నారు.మనీశ్‌ పాండే, యూసుఫ్‌ పఠాన్‌ ఇంకా బ్యాట్‌ ఝళిపించాల్సి ఉంది. రైజర్స్‌ స్పిన్‌ విభాగం బాధ్యతలు సమర్థంగా నిర్వర్తిస్తోన్న మిస్టరీ స్పిన్నర్‌ రషీద్‌ఖాన్‌... బ్యాటింగ్‌లోనూ రాణించాడు. మరో కీలక బౌలర్‌ భువనేశ్వర్‌ తన స్థాయిని అందుకోలేకపోతున్నాడు. ఎక్కువగా పరుగులు సమర్పిస్తూ తన లయను కోల్పోయాడు.

కోహ్లి, డివిలియర్స్‌పైనే భారం

అన్నీ ఉన్నా అదృష్టం కలిసి రాని జట్టేదైనా ఉంటే అది రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరే అని ప్రేక్షకుల అభిప్రాయం. ఈ సీజన్‌లో ఇంటా, బయటా ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ కోహ్లిసేన ఓటమి పాలైంది. మంచి బ్యాటింగ్‌ లైనప్‌ ఉన్నప్పటికీ తొలి మ్యాచ్‌లో 70 పరుగులకే ఆలౌటై సీజన్‌ను దారుణంగా ప్రారంభించింది. ముంబైతో గత మ్యాచ్‌లో గెలుపు మెట్టుపై బోల్తా పడింది. ఏబీ అద్భుత ప్రదర్శనతో మ్యాచ్‌ను చివరి వరకు లాక్కొచ్చినా... బెంగళూరుకు పరాజయం తప్పలేదు. కోహ్లి, డివిలియర్స్‌ మినహా మిగతా బ్యాట్స్‌మెన్‌ రాణించకపోవడం ఆ జట్టుకు చేటు చేస్తోంది. మిడిలార్డర్‌ బ్యాట్స్‌మెన్‌ వైఫల్యంతో జట్టుకు ఓటమి తప్పట్లేదు. ఈ నేపథ్యంలో నేడు విజయం సాధించాలంటే మిడిలార్డర్‌ కచ్చితంగా రాణించాల్సిందే.  

సన్‌రైజర్స్‌
భువనేశ్వర్‌ కుమార్‌(కెప్టెన్‌), డేవిడ్‌ వార్నర్‌, బెయిర్‌ స్టో, విజయ్‌ శంకర్‌, మనీష్‌ పాండే, యూసఫ్‌ పఠాన్‌, దీపక్‌ హుడా, రషీద్‌ ఖాన్‌, మహ్మద్‌ నబీ, సందీప్‌ శర్మ, సిద్దార్థ్‌ కౌల్‌

ఆర్సీబీ
విరాట్‌ కోహ్లి(కెప్టెన్‌), పార్థివ్‌ పటేల్‌, మొయిన్‌ అలీ, ఏబీ డివిలియర్స్‌, హెట్‌మెయిర్‌, గ్రాండ్‌హోమ్‌, శివం దూబే, చహల్‌, ఉమేశ్‌ యాదవ్‌, మహ్మద్‌ సిరాజ్‌, ప్రయాస్‌ బర్మన్‌

Liveblog - కేన్‌ విలియమ్సన్‌ ఔట్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top