
రాయుడు 22 నాటౌట్ రోహిత్‌కు అండగా నిలవడంతో భారత్ 42.1 ఓవర్లలోనే..
గువాహటి : వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో భారత్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి 140 (107 బంతుల్లో 21 ఫోర్లు, 2 సిక్స్‌లు), రోహిత్ శర్మ (152 నాటౌట్: 117 బంతులు 15 ఫోర్లు, 8 సిక్స్‌లు) కదం తొక్కడంతో కొండంత లక్ష్యాన్ని భారత్ సునాయసంగా ఛేదించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ హెట్‌మెయిర్ (106: 74బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స్‌లు), కీరన్ పావెల్ (51), హోప్ (32), హోల్డర్ (38)లు రాణించడంతో 323 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.
ఈ భారీ లక్ష్యం కోసం బరిలోకి దిగిన భారత్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ శిఖర్ ధావన్(4) రెండో ఓవర్‌లోనే పెవిలియన్ చేరాడు. అనంతరం రోహిత్ శర్మకు జత కలిసిన కోహ్లి వచ్చీ రావడంతోనే బ్యాట్‌కు పనిచెప్పాడు. ఒకవైపు రోహిత్ శర్మ కుదురుగా బ్యాటింగ్ చేస్తే, కోహ్లి మాత్రం బౌండరీల మోత మోగించాడు. దీంతో భారత్ 10 ఓవర్లలోనే 71 పరుగులు చేసింది. అనంతరం తనదైన శైలిలో మెరుపులు మెరిపించిన కోహ్లి తొలుత శతకం సాధించగా.. అనంతరం రోహిత్ శర్మ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
ఈ ఇద్దరు కలిసి నాలుగుసార్లు సెంచరీలు నమోదు చేయడం గమనార్హం. తద్వారా భారత్ తరపున గంగూలీ, టెండూల్కర్‌ల పేరిట ఉన్న ఈ రికార్డును సమం చేశారు. ఈ క్రమంలో కోహ్లి(140)ని బిషూ బౌలింగ్‌లో స్టంపౌట్ కావడంతో రెండో వికెట్‌కు నమోదైన 246 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. అనంతరం క్రీజులోకి వచ్చిన అంబటి రాయుడు 22 నాటౌట్ రోహిత్‌కు అండగా నిలవడంతో భారత్ 42.1 ఓవర్లలోనే విజయాన్నందుకుంది. విండీస్ బౌలింగ్ బిషూ, థోమస్‌లు తలో వికెట్ లభించింది.