‘పిచ్‌’ ఫిక్సింగ్‌ కలకలం...

India v/s Sri Lanka test match in July 2017 was fixed - Sakshi

గతేడాది భారత్, శ్రీలంక గాలే టెస్టు పిచ్‌ ఫిక్సింగ్‌ వీడియో వెలుగులోకి

ఐసీసీ విచారణ షురూ  

న్యూఢిల్లీ: మళ్లీ ఫిక్సింగ్‌ కలకలం రేగింది. ఇది స్పాట్‌ ఫిక్సింగో, మ్యాచ్‌ ఫిక్సింగో కాదు. పిచ్‌ ఫిక్సింగ్‌. పూర్తిగా బ్యాటింగ్‌కే అనుకూలంగా పిచ్‌ను రూపొందిస్తానని చెప్పిన శ్రీలంక చీఫ్‌ క్యురేటర్‌ బాగోతం స్టింగ్‌ ఆపరేషన్‌లో బయటపడింది. ఈ ఉదంతంలో ముంబైకి చెందిన దేశవాళీ మాజీ క్రికెటర్‌ రాబిన్‌ మోరిస్‌ ప్రమేయం ఉన్నట్లు తేలింది. ఈ స్టింగ్‌ ఆపరేషన్‌ ఇంటర్నెట్‌లో బహిర్గతం కావడంతో అంతర్జాతీయ క్రికెట్‌ మండలి దర్యాప్తు ప్రారంభించింది. అల్‌ జజీరా టెలివిజన్‌  ఈ ఆపరేషన్‌ ఆదివారం ప్రసారం చేయనుంది. గతేడాది శ్రీలంకలో భారత్‌ పర్యటన సందర్భంగా గాలే టెస్టులో పిచ్‌ ఫిక్సింగ్‌ జరిగిందని వీడియోలో వెల్లడైంది. జూలై 26 నుంచి 29 వరకు జరిగిన తొలి టెస్టులో భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 600 పరుగులు చేసింది. ధావన్‌ (190), పుజారా (153) సెంచరీలు బాదారు. 304 పరుగుల తేడాతో టీమిండియా గెలిచిన ఈ టెస్టులో సారథి విరాట్‌ కోహ్లి రెండో ఇన్నింగ్స్‌లో అజేయ శతకం చేశాడు. గాలే స్టేడియం క్యురేటర్, మేనేజర్‌ కూడా అయిన తరంగ ఇండిక పిచ్‌ను పూర్తిగా బౌలర్లకు లేదంటే బ్యాట్స్‌మెన్‌ అనుకూలంగా తయారు చేస్తానని స్టింగ్‌ ఆపరేషన్‌లో చెప్పారు.

ప్రత్యేకించి స్పిన్‌ లేదంటే పేస్‌ బౌలర్లకు అనుగుణంగా చేయాలన్నా చేస్తానని ఆయన చెప్పినట్లు వీడియోలో ఉంది. ఎలా చేస్తారని అడిగితే ‘గత ఏడాది భారత్‌ కోసం బ్యాటింగ్‌ పిచ్‌ను తయారు చేశాం. వికెట్‌ను పూర్తిగా రోలర్‌తో అణగదొక్కించి అదేపనిగా నీటిని చిలకరించాం. దీంతో  బౌలర్లకు కష్టమవుతుంది’ అని తరంగా చెప్పారు. 42 ఫస్ట్‌ క్లాస్‌ మ్యాచ్‌లాడిన రాబిన్‌ మోరిస్‌ మాట్లాడుతూ ‘ఆయన (తరంగ ఇండిక), మనం కలిసి పిచ్‌ను మార్చొచ్చు. ఎవరికి ఎలా కావాలంటే అలా తయారు చేయించవచ్చు. ఎందుకంటే గాలే స్టేడియానికి అసిస్టెంట్‌ మేనేజర్, చీఫ్‌ క్యురేటర్‌ ఆయనే!  ఈ నవంబర్‌లో లంకలో ఇంగ్లండ్‌ పర్యటన సందర్భంగా గాలే స్టేడియంలో పిచ్‌ ఫిక్స్‌ చేస్తాం’ అని స్టింగ్‌ ఆపరేషన్‌లో వెల్లడించినట్లు వీడియో ఫుటేజీలో ఉంది.  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top