టెస్టు క్రికెట్‌ చరిత్రలో ఇదే తొలిసారి..

India-Australia And Kiwis Combined To Script In Test cricket - Sakshi

కోల్‌కతా: టెస్టు క్రికెట్‌లో సరికొత్త రికార్డు నమోదైంది. ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టులో న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌ తేడాతో విజయం సాధించడంతో ఒక రికార్డు లిఖించబడింది. ఇందులో టీమిండియా, ఆస్ట్రేలియా జట్లు కూడా భాగమయ్యాయి. బంగ్లాదేశ్‌తో జరిగిన రెండు టెస్టులను టీమిండియా క్లీన్‌స్వీప్‌ చేయడంతో పాటు ఇన్నింగ్స్‌ విజయాలను నమోదు చేసింది. నవంబర్‌ 14వ తేదీన తొలి టెస్టు ఆరంభం కాగా 16 వతేదీన ముగిసింది. మూడో రోజే భారత్‌ ఇన్నింగ్స్‌ విజయాన్ని సాధించింది. ఇక రెండో టెస్టు నవంబర్‌ 22వ తేదీన ఆరంభం కాగా 24వ తేదీన ముగిసింది. ఇక పాక్‌పై ఇన్నింగ్స్‌ తేడాతో ఆసీస్‌ గెలిచిన మ్యాచ్‌ నవంబర్‌ 21 వ తేదీ నుంచి 23 వరకూ జరిగింది. మరొకవైపు ఇంగ్లండ్‌తో నవంబర్‌ 21వ తేదీ నుంచి 25వ తేదీ వరకూ మ్యాచ్‌ జరగ్గా అందులో న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌ విజయాన్నే నమోదు చేసింది.

ఇలా 10 రోజుల వ్యవధిలో నాలుగు ఇన్నింగ్స్‌ విజయాలు రావడంతో టెస్టు క్రికెట్‌లో నయా రికార్డు నమోదైంది. గతంలో ఇలా ఒకసారి నాలుగు ఇన్నింగ్స్‌ విజయాలు వచ్చిన సందర్భాల్లో ఉన్నప్పటికీ 10 రోజుల్లో నాలుగు ఇన్నింగ్స్‌ గెలుపులు రావడం ఇదే తొలిసారి. 2002లో 11 రోజుల వ్యవధిలో నాలుగు ఇన్నింగ్స్‌లో రాగా, అది తాజాగా బ్రేక్‌ అయ్యింది. దాదాపు 17 ఏళ్ల తర్వాత ఆ రికార్డును సవరించడంతో భారత్‌-ఆస్ట్రేలియా-న్యూజిలాండ్‌లు సంయుక్తంగా అరుదైన రికార్డును నమోదు చేసినట్లయ్యింది.

భారత జట్టు వరుసగా విజయాలు సాధిస్తూ దూసుకుపోతుంది.  కోహ్లి నేతృత్వంలోని టీమిండియా వరుసగా ఏడో టెస్టు విజయాన్ని నమోదు చేసింది. వెస్టిండీస్‌తో రెండు టెస్టుల సిరీస్‌తో పాటు దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు టెస్టుల సిరీస్‌ను కూడా వైట్‌వాష్‌ చేసింది. తాజాగా బంగ్లాదేశ్‌పై కూడా రెండు టెస్టుల సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసింది. అదే సమయంలో వరుసగా నాలుగు ఇన్నింగ్స్‌ విజయాలతో సరికొత్త రికార్డును కూడా టీమిండియా నెలకొల్పింది. మరొకవైపు 360 టెస్టు చాంపియన్‌షిప్‌ పాయింట్లతో తన అగ్రస్థానాన్ని మరింత పట్టిష్టం చేసుకుంది. 

ఇక ఇంగ్లండ్‌పై న్యూజిలాండ్‌ భారీ విజయం నమోదు చేసినా అది టెస్టు చాంపియన్‌షిప్‌ పరిధిలోకి రావడం లేదు. ఇందుకు కారణం.. ప్రపంచ టెస్ట్‌ చాంపి యన్‌షిప్‌(2019-21) నిబంధన ప్రకా రం ప్రతిజట్టూ ఆరు సిరీస్‌లు ఆడాలి.ఇందులో స్వదేశంలో మూడు విదేశంలో మూడు ఉంటాయి. అందువల్ల అన్ని సిరీస్‌ లను టెస్ట్‌ చాంపియన్‌షిప్‌లో చేర్చలేదు. వాటిలో ప్రస్తుత ఇంగ్లండ్‌-కివీస్‌ల మధ్య జరిగే రెండు టెస్టుల సిరీస్‌ ఒకటి. ఈ సిరీస్‌ను కూడా చేర్చితే.. ఇంగ్లండ్‌ బయట ఎక్కువ సిరీస్‌లు ఆడాల్సి వచ్చేది. అలా జరిగితే మొత్తం చాంపియన్‌ షిప్‌ షెడ్యూల్‌ కాస్త అయోమయంలో పడేది. దాంతోనే ఈ టెస్టు సిరీస్‌ను వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌లో చేర్చలేదు.పాకిస్తాన్‌-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న టెస్టు సిరీస్‌ వరల్డ్‌ చాంపియన్‌లో భాగంగానే ఉంది. పాకిస్తాన్‌పై విజయం తర్వాత ఆసీస్‌ 60 పాయింట్లను ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం ఆసీస్‌ 116 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. అటు తర్వాత స్థానంలో న్యూజిలాండ్‌ 60 పాయింట్లతో ఉంది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top