నూర్‌ సుల్తాన్‌లో భారత్, పాక్‌ డేవిస్‌ కప్‌ పోరు

India And Pakistan Fight For Davis Cup - Sakshi

తటస్థ వేదికగా కజకిస్తాన్‌ రాజధానిని ఎంపిక చేసిన ఐటీఎఫ్‌

ఇస్లామాబాద్‌లోనే నిర్వహించాలని పాక్‌ చేసిన అప్పీల్‌ కొట్టివేత

ఈ నెల 29, 30 తేదీల్లో ఇండోర్‌ స్టేడియంలో మ్యాచ్‌లు

పాకిస్తాన్‌ టెన్నిస్‌ సమాఖ్య (పీటీఎఫ్‌)కు మరోసారి చుక్కెదురైంది. భద్రతాకారణాలరీత్యా భారత్, పాకిస్తాన్‌ డేవిస్‌ కప్‌ ఆసియా ఓసియానియా గ్రూప్‌–1 మ్యాచ్‌ను ఇస్లామాబాద్‌లో కాకుండా తటస్థ వేదికపైనే నిర్వహించాలని అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య (ఐటీఎఫ్‌) ఆదేశించింది. తటస్థ వేదికను సూచించాలని నవంబర్‌ 4న పీటీఎఫ్‌ను కోరింది. అయితే పీటీఎఫ్‌ తటస్థ వేదికను ఖరారు చేయకుండా... ఇస్లామాబాద్‌లోనే మ్యాచ్‌ నిర్వహించాలని ఐటీఎఫ్‌కు మరోసారి అప్పీల్‌ చేసుకుంది. కానీ పీటీఎఫ్‌ అప్పీల్‌ను ఐటీఎఫ్‌ కొట్టివేసింది. పాకిస్తాన్‌ సమాఖ్య వేదికను సూచించకపోవడంతో ఐటీఎఫ్‌ సొంత నిర్ణయం తీసుకుంది. భారత్, పాకిస్తాన్‌ మ్యాచ్‌కు వేదికగా కజకిస్తాన్‌ రాజధాని నూర్‌ సుల్తాన్‌ను ఐటీఎఫ్‌ ఎంపిక చేసింది.

న్యూఢిల్లీ: భారత్, పాకిస్తాన్‌ మధ్య డేవిస్‌ కప్‌ ఆసియా ఓసియానియా గ్రూప్‌–1 మ్యాచ్‌ వేదిక ఖరారైంది. కజకిస్తాన్‌ రాజధాని నూర్‌ సుల్తాన్‌లో ఈనెల 29, 30వ తేదీల్లో ఈ మ్యాచ్‌ జరుగుతుందని అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య (ఐటీఎఫ్‌) ప్రకటించింది. వాస్తవానికి ఈ మ్యాచ్‌ గత సెప్టెంబర్‌ 14, 15వ తేదీల్లో ఇస్లామాబాద్‌లో జరగాల్సింది. అయితే భద్రతా కారణాలరీత్యా పాకిస్తాన్‌లో ఈ మ్యాచ్‌ను నిర్వహించేందుకు అనుకూల పరిస్థితులు లేకపోవడంతో ఐటీఎఫ్‌ నవంబర్‌ 29, 30 తేదీలకు వాయిదా వేస్తున్నట్లు ఈనెల 4న ప్రకటించింది. పాకిస్తాన్‌ టెన్నిస్‌ సమాఖ్య (పీటీఎఫ్‌)ను తటస్థ వేదికను ఎంచుకోవాలని కూడా కోరింది. అయితే ఐటీఎఫ్‌ తమ నిర్ణయంపై పునరాలోచన చేయాలని, ఇస్లామాబాద్‌లోనే మ్యాచ్‌ను నిర్వహించాలని కోరుతూ పీటీఎఫ్‌ అప్పీల్‌ చేసింది. ఎలాంటి అభద్రతాభావం లేకుండా భారత యాత్రికులు పాకిస్తాన్‌కు వస్తున్నారని... భారత ఆటగాళ్లు పాక్‌లో ఆడేందుకు ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని పీటీఎఫ్‌ వాదించింది. ‘ఇస్లామాబాద్‌ నుంచి మ్యాచ్‌ను తటస్థ వేదికకు మార్చాలని ఐటీఎఫ్‌ తీసుకున్న నిర్ణయాన్ని పీటీఎఫ్‌ డేవిస్‌ కప్‌ కమిటీకి అప్పీల్‌ చేసింది. అయితే ఐటీఎఫ్‌ ఇండిపెండెంట్‌ ట్రిబ్యునల్‌ పీటీఎఫ్‌ అప్పీల్‌ను కొట్టి వేసింది. తటస్థ వేదికపైనే మ్యాచ్‌ నిర్వహించాలని నిర్ణయించింది’ అని ఐటీఎఫ్‌ తెలిపింది. ‘పీటీఎఫ్‌ తటస్థ వేదిక పేరును సూచించకపోవడంతో డేవిస్‌ కప్‌ నిబంధనల ప్రకారం ఐటీఎఫ్‌ ఆధ్వర్యంలో ఈ మ్యాచ్‌ను కజకిస్తాన్‌ రాజధాని నూర్‌ సుల్తాన్‌లోని జాతీయ టెన్నిస్‌ కేంద్రంలో నిర్వహించాలని డేవిస్‌ కప్‌ కమిటీ నిర్ణయం తీసుకుంది’ అని ఐటీఎఫ్‌ పేర్కొంది. ప్రస్తుతం కజకిస్తాన్‌లో అతి శీతల వాతావరణం ఉండటంతో మ్యాచ్‌ను బయట కాకుండా ఇండోర్‌ స్టేడియంలో నిర్వహిస్తారు.

రెండోసారి... 
భారత్, పాకిస్తాన్‌ జట్ల మధ్య డేవిస్‌ కప్‌ మ్యాచ్‌ తటస్థ వేదికపై జరగనుండటం ఇది రెండోసారి. 1973లోనూ భారత్, పాక్‌ డేవిస్‌ కప్‌ మ్యాచ్‌ను తటస్థ వేదిక మలేసియాలో నిర్వహించారు. ఓవరాల్‌గా ఈ రెండు జట్లు డేవిస్‌ కప్‌లో ఆరుసార్లు ముఖాముఖిగా తలపడ్డాయి. ఆరుసార్లూ భారతే గెలిచి అజేయంగా ఉంది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top