‘సూపర్‌’ మ్యాచ్‌: గెలిపించినోడే హీరో

IND Vs NZ: Williamson 95 In Vain As India Win Super Over - Sakshi

హామిల్టన్‌: న్యూజిలాండ్‌ సూపర్‌ ఓవర్‌లో మ్యాచ్‌లను చేజార్చుకోవడం ఆ జట్టుకు గుండె ​కోతను మిగుల్చుతోంది.  ఇప్పటివరకూ న్యూజిలాండ్‌ ఏడుసార్లు సూపర్‌ ఓవర్‌ మ్యాచ్‌లు(టీ20లు, వన్డేలు కలిపి) ఆడగా అందులో ఆరుసార్లు ఆ జట్టును పరాజయమే వెక్కిరించింది. టీ20ల్లో ఐదుసార్లు, వన్డేల్లో ఒకసారి కివీస్‌ సూపర్‌ ఓవర్‌లో చతికిలబడింది. గతేడాది జరిగిన వన్డే వరల్డ్‌కప్‌ ఫైనల్లో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో సూపర్‌ ఓవర్‌కు దారి తీయగా, దాన్ని కూడా కివీస్‌ టై చేసుకుంది. దాంతో ఓవరాల్‌ బౌండరీల ఆధారంగా ఇంగ్లండ్‌ కప్‌ను ఎగరేసుకుపోగా,  న్యూజిలాండ్‌ మెగా కప్‌ను చేజార్చుకుంది. ఆ తర్వాత నవంబర్‌లో ఇంగ్లండ్‌తోనే జరిగిన టీ20 సిరీస్‌లో భాగంగా ఆఖరి టీ20 మ్యాచ్‌ కూడా కివీస్‌కు కలిసి రాలేదు.

ఆ ఐదు టీ20ల సిరీస్‌లో చివరి మ్యాచ్‌ సూపర్‌ ఓవర్‌కు వెళ్లగా అందులో ఇంగ్లండ్‌ స్పష్టమైన విజయాన్ని అందుకుంది. ఆపై మళ్లీ టీమిండియాతో టీ20 మ్యాచ్‌ ఆడిన సూపర్‌ ఓవర్‌ మ్యాచ్‌లో కివీస్‌ పరాజయం పాలైంది. ఈ మూడు సందర్భాల్లోనూ కివీస్‌ ఒక వరల్డ్‌కప్‌తో పాటు రెండు సిరీస్‌లను కోల్పోయింది. ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో కివీస్‌ గెలుచి ఉంటే సిరీస్‌ గెలిచేది. కానీ సూపర్‌ ఓవర్‌లో కివీస్‌ ఓడిపోడంతో సిరీస్‌ను 2-3 తేడాతో కోల్పోయింది. ఇప్పుడు టీమిండియాతో జరిగిన మూడో టీ20లో కివీస్‌ ఓటమి చెందడంతో మరో టీ20 సిరీస్‌ను ఇంకా రెండు మ్యాచ్‌లు ఉండగానే చేజార్చుకోవాల్సి వచ్చింది. మూడు నెలల క్రితం ఇంగ్లండ్‌తో ఆక్లాండ్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌ కివీస్‌కు షాకిస్తే, తాజాగా హామిల్టన్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌ న్యూజిలాండ్‌కు మరో గుండె కోతను మిగిల్చింది. (ఇక‍్కడ చదవండి: కివీస్‌ కష్టాలు తీరేలా లేవు!)

గెలిపించినోడే హీరో..
బుధవారం టీమిండియాతో జరిగిన మూడో టీ20లో కివీస్‌ సునాయాసంగా గెలుస్తుందని అనుకున్నారంతా. ఆది నుంచి దూకుడుగా ఆడిన కివీస్‌ విజయం ఏకపక్షమే అనిపించింది. అయితే న్యూజిలాండ్‌ విజయానికి ఆఖరి ఓవర్‌లో 9 పరుగులు కావాల్సిన తరుణంలో టీమిండియా బౌలర్‌ షమీ బంతిని అందుకున్నాడు. ఆ సమయంలో కేన్‌ విలియమ్సన్‌, రాస్‌ టేలర్‌లు క్రీజ్‌లో ఉన్నారు. స్టైకింగ్‌ ఎండ్‌లో ఉన్న టేలర్‌ తొలి బంతికే సిక్స్‌ కొట్టడంతో మ్యాచ్‌పై దాదాపు ఆశలు వదిలేసుకుంది టీమిండియా. అయితే షమీ మాత్రం అంచనాలను తలకిందులు చేశాడు.  చివరి ఓవర్‌ రెండో బంతికి టేలర్‌ సింగిల్‌ మాత్రమే ఇచ్చిన షమీ..  మూడో బంతికి విలియమ్సన్‌ను ఔట్‌ చేశాడు. ఇక్కడ విలియమ్సన్‌ అనవసరమైన షాట్‌కు యత్నించి అత్యుత్సాహం ప్రదర్శించినట్లే కనబడింది.  షమీ వేసిన లెంగ్త్‌ బాల్‌ను వెంటాడి మరీ అప్పర్‌ కట్‌కు యత్నించాడు. అది కాస్తా కేఎల్‌ రాహుల్‌ చేతుల్లో పడటంతో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇక క్రీజ్‌లోకి వచ్చిన సీఫెర్ట్‌ నాల్గో బంతికి పరుగులు ఏమీ చేయకపోగా, ఐదో బంతికి బై రూపంలో సింగిల్‌ సాధించాడు. (ఇక్కడ చదవండి: ఉత్కం‘టై’న మ్యాచ్‌కు సూపర్‌ ముగింపు)

దాంతో కివీస్‌ స్కోరును సమం చేసింది. ఈ తరుణంలో స్టైకింగ్‌ ఎండ్‌లోకి వచ్చిన వెటరన్‌ ఆటగాడు రాస్‌ టేలర్‌ బౌల్డ్‌ అయ్యాడు. ఫలితంగా మ్యాచ్‌ టైగా ముగియడం, ఆపై సూపర్‌ ఓవర్‌ భారత్‌ గెలవడం జరిగిపోయాయి. ఇక భారత్‌ను సూపర్‌ ఓవర్‌ వరకూ తీసుకొచ్చిన షమీ హీరో అయితే, అప్పటివరకూ పోరాటం చేసిన విలియమ్సన్‌ మాత్రం జీరోనే అయ్యాడు. అసలు విలియమ్సన్‌ ఆ షాట్‌ ఆడకపోయి ఉంటే కివీస్‌ ఈజీగానే గెలిచేది. విలియమ్సన్‌ అత్యుత్సాహం ప్రదర్శించడంతోనే మ్యాచ్‌ కాస్తా చేజారిపోయింది. సిక్స్‌ కొట్టి మ్యాచ్‌ను గెలిపించడంతో పాటు సెంచరీ చేయాలనే ఉద్దేశంతోనే విలియమ్సన్‌ ఆడిన అప్పర్‌ కట్‌ షాట్‌ కివీస్‌ కొంప ముంచింది. ఎంతో పరిణితి ఉన్న  విలియమ్సన్‌ ఆఖరి నిమిషంలో అలా ఆడటం కివీస్‌ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎంతపని చేశావ్‌ కేన్‌ అంటూ తిట్టిపోస్తున్నారు. గెలిపించినోడే హీరో.. గెలిపించలేకపోతే జీరోనే కదా అని అనుకుంటున్నారు. ఈ మ్యాచ్‌లో విలియమ్సన్‌ 48 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్స్‌లతో 95 పరుగులు చేసినా అది వృథానే అయ్యింది.  మ్యాచ్‌ను టై వరకూ తీసుకురావడంలో షమీ సక్సెస్‌ అయితే, ఆ మ్యాచ్‌ను గెలిపించడంలో రోహిత్‌ శర్మ ముఖ్య పాత్ర పోషించాడు. సూపర్‌ ఓవర్‌లో చివరి రెండు బంతులకు 10 పరుగులు కావాల్సిన తరుణంలో రోహిత్‌ వరుసగా రెండు సిక్స్‌లు కొట్టి చిరస్మరణీయమైన విజయాన్ని అందించాడు.(ఇక్కడ చదవండి: భారత్‌ మాతా కీ జై: కివీస్‌ ఫ్యాన్‌)

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top