కివీస్‌ కష్టాలు తీరేలా లేవు!

IND Vs NZ: New Zealand Injured Pace Trio Ruled Out Of India ODIs - Sakshi

హామిల్టన్‌: టీమిండియాతో జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్‌లో ఇంకా రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే సిరీస్‌ను కోల్పోయిన న్యూజిలాండ్‌ జట్టు కష్టాలు వన్డే సిరీస్‌లో కూడా తీరేలా కనబడటం లేదు. భారత్‌తో టీ20 సిరీస్‌ ఆరంభానికి ముందు ఆసీస్‌తో జరిగిన మూడు టెస్టుల సిరీస్‌లో వైట్‌వాష్‌ అయిన కివీస్‌.. ఇప్పుడు మరింత డీలా పడింది. బుధవారం భారత్‌తో జరిగిన మూడో టీ20లో మ్యాచ్‌ను టైగా ముగించి సూపర్‌ ఓవర్‌ వరకూ తీసుకొచ్చినా అందులో కివీస్‌కు అదృష్టం కలిసిరాలేదు. సూపర్‌ ఓవర్‌లో 18 పరుగుల టార్గెట్‌ను భారత్‌కు నిర్దేశించినా కివీస్‌ దాన్ని కాపాడుకోవడంలో విఫలమైంది. దాంతో టీ20 సిరీస్‌ను 3-0తేడాతో భారత్‌కు అప్పగించింది.  శుక్రవారం, ఆదివారం జరుగనున్న రెండు టీ20 మ్యాచ్‌ల్లో కనీసం గెలిచి పరువు నిలుపుకోవాలనే ప్రయత్నంలో ఉంది. మరొకవైపు భారత్‌ క్లీన్‌స్వీప్‌పై దృష్టిపెట్టింది. తొలిసారి న్యూజిలాండ్‌ గడ్డపై టీ20 సిరీస్‌ గెలిచిన టీమిండియా.. మిగిలిన రెండు టీ20ల్లో గెలవాలనే తలంపుతో ఉంది. (ఇక్కడ చదవండి: ఉత్కం‘టై’న మ్యాచ్‌కు సూపర్‌ ముగింపు)

ఇదిలా ఉంచితే,  టీ20 సిరీస్‌ తర్వాత జరుగనున్న మూడు వన్డేల సిరీస్‌కు సన్నద్ధం కావడంపై ఇప్పుడు కివీస్‌ తర్జన భర్జనలు పడుతోంది. ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌లో గాయపడిన న్యూజిలాండ్‌ పేస్‌ బౌలింగ్‌ త్రయం​ ట్రెంట్‌ బౌల్ట్‌,లూకీ ఫెర్గ్యూసన్‌, మ్యాట్‌ హెన్నీలు ఇంకా కోలుకోలేదు. దాంతో వచ్చే వారం టీమిండియాతో ఆరంభం కానున్న వన్డే సిరీస్‌కు వీరు దూరమయ్యారు. వన్డే సిరీస్‌ నాటికి ఈ ముగ్గురు పేసర్లు తేరుకుంటారని తొలుత భావించారు. కాగా, వారు ఇంకా గాయం నుంచి కోలుకోలేదని, దానికి మరింత సమయం పడుతుందని కివీస్‌ మేనేజ్‌మెంట్‌ స్పష్టం చేసింది. దాంతో న్యూజిలాండ్‌ జట్టులో కలవరం మొదలైంది. ఇప్పటికే టీ20 సిరీస్‌ను కోల్పోయిన కివీస్‌కు వన్డే సిరీస్‌లో కూడా కష్టాలు తీరేలా కనబడటం లేదు.  ప్రధాన ఆటగాళ్లు దూరం కావడంతో ఇది కివీస్‌కు పెద్ద ఎదురుదెబ్బగానే చెప్పొచ్చు. వీరి స్థానాల్లో కేల్‌ జెమీసన్‌, స్కాట్‌ కుగ్లీజిన్‌, హమిష్‌ బెన్నెట్‌లకు కివీస్‌ వన్డే జట్టులో చోటు కల్పించారు. ఇందులో జిమిసన్‌ తొలిసారి న్యూజిలాండ్‌ నుంచి పిలుపు అందుకోగా, కుగ్లీజిన్‌, బెన్నెట్‌లు 2017లో చివరిసారి వన్డే మ్యాచ్‌లు ఆడారు. 

న్యూజిలాండ్‌ వన్డే జట్టు ఇదే..
కేన్‌ విలియమ్సన్‌(కెప్టెన్‌), హమిష్‌ బెన్నెట్‌, టామ్‌ బ్లండెల్‌, గ్రాండ్‌హోమ్‌, మార్టిన్‌ గప్టిల్‌, జిమిసన్‌, కుగ్లీజిన్‌, టామ్‌ లాథమ్‌, జిమ్మీ నీషమ్‌, హెన్రీ నికోలస్‌, మిచెల్‌ సాంట్నార్‌, ఇష్‌ సోథీ, టిమ్‌ సౌతీ, రాస్‌ టేలర్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top