రోహిత్‌–కోహ్లి జోడీని ఎలా విడగొట్టాలి?

How Can Break The Partnership Of Kohli And Rohit Says Aaron Finch - Sakshi

సలహా కోసం మ్యాచ్‌ అంపైర్‌ను ఆశ్రయించిన ఆసీస్‌ కెప్టెన్‌ ఫించ్‌

లండన్‌: భారత రన్‌ మెషీన్‌ విరాట్‌ కోహ్లి, హిట్‌ మ్యాన్‌ రోహిత్‌ శర్మ క్రీజులో కుదురుకుంటే ప్రత్యర్థి జట్టు బేలగా చూస్తుండిపోవాల్సిందే. ఇక ఈ ఇద్దరు జోడీగా చెలరేగితే ఆ విధ్వంసాన్ని ఎలా అడ్డుకోవాలో తెలీక ప్రత్యర్థి కెప్టెన్‌ తల పట్టుకోవాల్సిందే. సరిగ్గా ఇదే పరిస్థితిలో ఉన్న ఆస్ట్రేలియా సారథి ఆరోన్‌ ఫించ్‌... ఏం చేయాలో పాలుపోక మంచి సలహా కోసం చివరకు మ్యాచ్‌ అంపైర్‌ను ఆశ్రయించాడట. ఈ విషయాన్ని స్వయంగా ఆనాటి మ్యాచ్‌ అంపైర్‌ మైకేల్‌ గౌఫ్‌ తాజాగా వెల్లడించాడు.

ఈ ఘటన జనవరిలో భారత్‌–ఆసీస్‌ మధ్య బెంగళూరులో మూడో వన్డే సందర్భంగా జరిగిందని గౌఫ్‌ బుధవారం పేర్కొన్నాడు. ‘ఆ మ్యాచ్‌ నాకు బాగా గుర్తుంది. విరాట్‌–రోహిత్‌ జోడీ భారీ భాగస్వామ్యం దిశగా దూసుకెళ్తోంది. అప్పుడు స్క్వేర్‌ లెగ్‌ దగ్గర నా పక్కనే ఉన్న ఫించ్‌ నా దగ్గరికి వచ్చి ‘ఈ ఇద్దరు గొప్ప క్రికెటర్ల ఆట నమ్మశక్యంగా లేదు. వీరికి ఎలా బౌలింగ్‌ చేయాలి’ అని అడిగాడు. దానికి సమాధానంగా ‘నా పని నాకుంది. నీ పని నువ్వు చూస్కో’ అని చెప్పినట్లు’ గౌఫ్‌ పేర్కొన్నాడు. ఆ మ్యాచ్‌లో రెండో వికెట్‌కు విరాట్‌ (89), రోహిత్‌ (119) జోడీ నెలకొల్పిన 137 పరుగుల భాగస్వామ్యంతో భారత్‌ 286 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి 7 వికెట్లతో గెలుపొందింది. దీంతో 2–1తో సిరీస్‌ భారత్‌ వశమైంది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top