అలా క్రికెట్‌ ఆడటానికి ఎవరూ ఇష్టపడరు: గంగూలీ

Ganguly Wants At Least One Match In A Series To Be Pink Ball Test - Sakshi

న్యూఢిల్లీ: ఇటీవల బంగ్లాదేశ్‌తో కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్‌లో జరిగిన పింక్‌ బాల్‌ టెస్టు విజయవంతం కావడంతో సాధ్యమైనన్ని డే అండ్‌ నైట్‌ టెస్టులు నిర్వహించేందుకు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ మొగ్గుచూపుతున్నాడు. ఈ విషయాన్ని గంగూలీ గతంలోనే చెప్పినా, మరొకసారి పింక్‌ బాల్‌ మ్యాచ్‌ల నిర్వహణపై స్పష్టత ఇచ్చాడు. అసలు పింక్‌ బాల్‌ టెస్టులను ఆడించాలనే యోచనకు ఎక్కువ మంది ప్రేక్షకుల్ని స్టేడియాలకు తీసుకురావాలనే ఉద్దేశమే ప్రధాన కారణమన్నాడు. ఇక నుంచి విరాట్‌ కోహ్లి నేతృత్వంలోని భారత జట్టు ఆడే ప్రతీ టెస్టు సిరీస్‌లో ఒక పింక్‌ బాల్‌ మ్యాచ్‌ను ఉండేలా చూస్తామన్నాడు.

‘పింక్‌ బాల్‌ టెస్టు సక్సెస్‌ కావడం నిజంగా ఆహ్వానించదగ్గ పరిణామం. దీన్ని ముందుకు తీసుకెళ్లడమే నా తదుపరి లక్ష్యం. ప్రతీ టెస్టు మ్యాచ్‌ పింక్‌ బాల్‌ టెస్టు కావాలని నేను అనను. ఒక టెస్టు సిరీస్‌లో కనీసం ఒక మ్యాచ్‌ డే అండ్‌ నైట్‌ జరగాలి. నా యొక్క అనుభవాన్ని ఉపయోగించి మిగతా చోట్ల ఎలా పింక్‌ బాల్‌ నిర్వహించాలనే దాని కోసం యత్నిస్తా. టెస్టు మ్యాచ్‌కు ఐదు వేల మంది మాత్రమే వస్తే ఏ క్రికెటర్‌ మాత్రం ఆడటానికి ఇష్టపడతాడు. అలా ఆడాలంటే ఏ క్రికెటర్‌ ఇష్టంతో ఆడడు’ అని గంగూలీ పేర్కొన్నాడు. ఇక కోల్‌కతాలో మ్యాచ్‌ తర్వాత కోహ్లి పోస్ట్‌ మ్యాచ్‌ కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ.. పింక్‌ బాల్‌ టెస్టులు అనేవి రెగ్యులర్‌ షెడ్యూల్‌లో భాగంగా ఉండవన్నాడు. ఇవి అప్పడప్పుడు మాత్రమే ఉంటాయన్నాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top