మళ్లీ ‘బెయిల్స్‌’ గుబులు

DRS Overturn Disappoints Australians - Sakshi

బర్మింగ్‌హామ్‌:  ఇటీవల ముగిసిన వన్డే వరల్డ్‌కప్‌లో బంతులు వేగంగా తాకినా బెయిల్స్‌ పడకపోవటంవంటి ఘటనలు పలు సందర్భాల్లో చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. దాంతో బెయిల్స్‌ మార్చాలని పలు జట్లు కోరినా ఐసీసీ తిరస్కరించింది.ఐపీఎల్‌, ప్రపంచకప్‌ టోర్నీల్లో గంటకు 140 కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చె బంతులు తాకినా బెయిల్స్‌ కిందపడకపోవడం పలు అనుమానాలకు దారి తీసింది. ఇలా బెయిల్స్‌ కిందపడకపోవడంతో కీలక బ్యాట్స్‌మెన్‌ బతికిపోవడం మ్యాచ్‌ ఫలితంపై ప్రభావం చూపుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. తాజాగా ప్రతిష్టాత్మక యాషెస్‌ సిరీస్‌లో కూడా బెయిల్స్‌ గుబులు మొదలైంది.

 ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌ 21వ ఓవర్‌లో ప్యాటిన్సన్‌ వేసిన చివరి బంతి రూట్‌ బ్యాట్‌ పక్క నుంచి కీపర్‌ పెయిన్‌ గ్లోవ్స్‌లోకి వెళ్లింది. అయితే, శబ్దం రావడంతో ప్యాటిన్సన్‌ క్యాట్‌ బిహైండ్‌కోసం అప్పీల్‌ చేశాడు. బంతి బ్యాటు అంచును తాకిందని భావించిన అంపైర్‌ విల్సన్‌.. రూట్‌ అవుటైనట్టు వేలు పైకి లేపాడు. కానీ బంతి తన బ్యాట్‌ అంచును కూడా తాకకపోవడంతో రూట్‌.. సమీక్ష కోరాడు. బంతి బ్యాటును తాకలేదని స్నికోమీటర్‌ తేల్చింది. మరి ఆ శబ్దం ఎక్కడిదన్న అనుమానం మొదలైంది. గంటకు 86 మైళ్ల వేగంతో ప్యాటిన్సన్‌ విసిరిన బంతి బెయిల్స్‌ను తాకడంతో ఆ శబ్దం వచ్చిందని ఫుటేజ్‌లో తేలింది. అంతవేగంగా వచ్చి తాకడంతో వికెట్లు కూడా ఒకింత ఊగాయి. కానీ ఒక్క బెయిల్‌ కూడా కింద పడకపోవడంతో ఆసీస్‌ ఆటగాళ్లు కంగుతిన్నారు. అంపైర్‌ విల్సన్‌కు తమ నిరసన తెలిపారు. ప్యాటిన్సన్‌తోపాటు ఆసీస్‌ కెప్టెన్‌ పెయిన్‌..బెయిల్స్‌ను మార్చాలని అంపైర్‌ను కోరినా అతడు నిరాకరించాడు.  ఆ తర్వాత జో రూట్‌(57)హాఫ్‌ సెంచరీ సాధించాడు.  అయితే జిగురులా పాతుకుపోతున్న ఈ జింగ్‌ బెయిల్స్‌ను ఇప్పటికిప్పుడు మార్చడం కుదరదని ఐసీసీ దాటవేత ధోరణి ప్రదర్శిస్తోంది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top