దక్షిణాఫ్రికా అతి పెద్ద పరాజయం | Sakshi
Sakshi News home page

దక్షిణాఫ్రికా అతి పెద్ద పరాజయం

Published Sat, Feb 22 2020 10:54 AM

Australia Thrash South Africa By 107 Runs - Sakshi

జోహనెస్‌బర్గ్‌: ఇటీవల ఇంగ్లండ్‌తో స్వదేశంలో జరిగిన టెస్టు, టీ20ల సిరీస్‌లను కోల్పోయిన దక్షిణాఫ్రికా.. ఆసీస్‌తో ఆరంభమైన ద్వైపాక్షిక సిరీస్‌లో సైతం అదే ప్రదర్శన పునరావృతం చేస్తోంది. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా ఇక్కడ జరిగిన తొలి టీ20లో దక్షిణాఫ్రికా 107 పరుగులతో ఓటమి పాలైంది. తద్వారా తమ టీ20 చరిత్రలో అతిపెద్ద పరాజయాన్ని(పరుగుల పరంగా) చవిచూసింది.  ఆసీస్‌ నిర్దేశించిన 197 పరుగుల లక్ష్య ఛేదనలో దక్షిణాఫ్రికా 14.3 ఓవర్లలో 89 పరుగులకే చాపచుట్టేసింది. ఇటీవల అన్ని ఫార్మాట్ల కెప్టెన్సీకి గుడ్‌ బై చెప్పిన డుప్లెసిస్‌(24)దే అత్యధిక స్కోరు కావడం గమనార్హం. ఆపై రబడా(22) ఫర్వాలేదనిపించగా, మిగతా వారంతా విఫలమయ్యారు. దక్షిణాఫ్రికా కెప్టెన్‌ డీకాక్‌(2), వాన్‌ డెర్‌ డస్సెన్‌(6), స్మట్స్‌(7), డేవిడ్‌ మిల్లర్‌(2)లు తీవ్రంగా నిరాశపరచడంతో దక్షిణాఫ్రికాకు భారీ ఓటమి తప్పలేదు. గతంలో పాకిస్తాన్‌, ఆసీస్‌లపై 95 పరుగుల తేడాతో ఓటమి చవిచూసినన సఫారీలు.. ఇప్పుడు అంతకంటే దారుణమైన పరాజయాన్ని ఎదుర్కొన్నారు. మరొకవైపు దక్షిణాఫ్రికాకు టీ20ల్లో ఇది మూడో అత్యల్ప స్కోరుగా నమోదైంది. (ఇక్కడ చదవండి: ఈ సారథ్యం నాకొద్దు! )

ఆగర్‌ హ్యాట్రిక్‌
ముందుగా బ్యాటింగ్‌ చేసిన ఆసీస్‌ నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్ల కోల్పోయి 196 పరుగులు చేసింది. డేవిడ్‌ వార్నర్‌(4) విఫలమైనా అరోన్‌ ఫించ్‌(42;27 బంతుల్లో 6 ఫ్లోఉ, 1 సిక్స్‌), స్టీవ్‌ స్మిత్‌(45; 32 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌)లు రాణించారు. చివర్లో అలెక్స్‌ క్యారీ(27), ఆస్టన్‌ ఆగర్‌(20 నాటౌట్‌)లు ధాటిగా బ్యాటింగ్‌ చేయడంతో ఆసీస్ భారీ స్కోరు చేయడంలో సహకరించారు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన సఫారీలు ఏ దశలోనూ ఆకట్టుకోలేకపోవడంతో ఘోర పరాజయం ఎదురైంది. ఆసీస్‌ స్పిన్నర్‌ ఆస్టన్‌ ఆగర్‌ ఐదు వికెట్లతో దక్షిణాఫ్రికా పతనాన్ని శాసించాడు. ఫలితంగా ఆసీస్‌ తరఫున టీ20ల్లో అత్యధిక బౌలింగ్‌ గణాంకాలు నమోదు చేశాడు. గతంలో జేమ్స్‌ ఫాల్కనర్‌ ఐదు వికెట్లు సాధించగా, ఇప్పుడు అతని సరసన ఆగర్‌ చేరాడు. 2016లో పాకిస్తాన్‌తో జరిగిన టీ20లో ఫాల్కనర్‌ ఐదు వికెట్లు సాధించాడు. ఇప్పటివరకూ ఆసీస్‌ తరఫున టీ20ల్లో ఇదే అత్యుత్తమ బౌలింగ్‌ కాగా, నాలుగేళ్ల తర్వాత ఆగర్‌ ఆ మార్కును అందుకున్నాడు.  ఆగర్‌ హ్యాట్రిక్‌ ఫీట్‌ను నమోదు చేయడం మరో విశేషం. ఇన్నింగ్స్‌ ఎనిమిదో ఓవర్‌ నాల్గో బంతికి డుప్లెసిస్‌ను ఔట్‌ చేసిన ఆగర్‌.. ఆ తర్వాత వరుస బంతుల్లో ఫెహ్లుక్వోయో, స్టెయిన్‌లను ఔట్‌ చేశాడు. 

Advertisement
Advertisement