ఈ సారథ్యం నాకొద్దు! 

Faf Du Plessis Resigns As Captain Of South Africa Test And T20 Teams - Sakshi

దక్షిణాఫ్రికా టెస్టు, టి20 జట్ల కెప్టెన్సీకి డు ప్లెసిస్‌ రాజీనామా

జట్టులో సభ్యునిగా కొనసాగుతానని ప్రకటన

జొహన్నెస్‌బర్గ్‌: దక్షిణాఫ్రికా సీనియర్‌ బ్యాట్స్‌మన్‌ ఫాఫ్‌ డు ప్లెసిస్‌ సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. తమ జట్టుకు ఇప్పుడు కొత్త తరం నాయకత్వం అత్యవసరమని వ్యాఖ్యానిస్తూ టెస్టు, టి20 జట్ల సారథ్యానికి బైబై చెప్పాడు. ఇంతకుముందు ఇంగ్లండ్‌తో సిరీస్‌ సమయంలో వన్డే జట్టు నాయకత్వం నుంచి డు ప్లెసిస్‌ తప్పుకోవడంతో వికెట్‌ కీపర్‌ డికాక్‌ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఇప్పుడు మిగిలిన రెండు ఫార్మాట్లకు కూడా అతను పగ్గాలు వదిలేశాడు. ‘ఇది కఠినమైన నిర్ణయం. కానీ... కొత్త తరానికి స్వాగతం పలుకుతున్నా. ఎప్పటిలాగే జట్టుకు పూర్తి నిబద్ధతతో సేవలందిస్తాను.

కెప్టెన్‌ డికాక్, కోచ్‌ మార్క్‌ బౌచర్‌లకు పూర్తిగా సహకరిస్తాను. సఫారీ జట్టు పునర్నిర్మాణానికి, జట్టు పటిష్టంగా ఎదిగేందుకు ఆటగాడిగా నా వంతు కృషి చేస్తాను’ అని 35 ఏళ్ల డుప్లెసిస్‌ తెలిపాడు. ‘మిస్టర్‌ 360’ డిగ్రీ బ్యాట్స్‌మన్‌ డివిలియర్స్‌ వారసుడిగా 2017 ఆగస్టులో దక్షిణాఫ్రికా పగ్గాలు చేపట్టిన డు ప్లెసిస్‌కు 2019 వన్డే ప్రపంచకప్‌ పెద్ద గాయమే చేసింది. ఆ మెగా టోర్నీలో సఫారీ జట్టు పేలవ ప్రదర్శనతో గ్రూప్‌ దశలోనే వెనుదిరిగింది. త్వరలోనే దక్షిణాఫ్రికా జట్టు ఆసీస్‌తో మూడు టి20లు, మరో మూడు వన్డేల సిరీస్‌ల్లో తలపడనుంది. శుక్రవారం ఇరు జట్ల మధ్య తొలి టి20 జరుగనుంది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top