అదరగొట్టిన అన్వర్ అలీ | Afridi, Anwar Ali stun SL with one-wicket win | Cricket | Sakshi
Sakshi News home page

అదరగొట్టిన అన్వర్ అలీ

Aug 2 2015 12:16 AM | Updated on Mar 28 2019 5:32 PM

అదరగొట్టిన అన్వర్ అలీ - Sakshi

అదరగొట్టిన అన్వర్ అలీ

పాక్ లక్ష్యం 20 ఓవర్లలో 173 పరుగులు... ఓ దశలో జట్టు స్కోరు 107/7... గెలవాలంటే 6 ఓవర్లలో 66 పరుగులు చేయాలి. ఇక ఓటమి ఖాయమనుకున్న

కొలంబో: పాక్ లక్ష్యం 20 ఓవర్లలో 173 పరుగులు... ఓ దశలో జట్టు స్కోరు 107/7... గెలవాలంటే 6 ఓవర్లలో 66 పరుగులు చేయాలి. ఇక ఓటమి ఖాయమనుకున్న దశలో బౌలర్లు అన్వర్ అలీ (17 బంతుల్లో 46; 3 ఫోర్లు, 4 సిక్సర్లు), ఇమద్ వసీమ్ (14 బంతుల్లో 24 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) చిచ్చరపిడుగుల్లా చెలరేగారు. అయితే ఇక 12 బంతుల్లో 20 పరుగులు చేయాల్సిన దశలో మలింగ వీరికి ధీటుగా స్పందించాడు. అన్వర్ అలీని అవుట్ చేయడంతో పాటు సోహైల్ తన్వీర్ (1)నూ రనౌట్ చేసి ఉత్కంఠను పెంచాడు.

ఇక పాక్ గెలుపునకు 6 బంతుల్లో 6 పరుగులు అవసరమైతే.. లంక విజయానికి ఒక్క వికెట్ చాలు. ఈ దశలో ఫెర్నాండో వేసిన రెండో బంతిని వసీమ్ అమాంతం గాల్లోకి లేపి సిక్సర్‌గా మలిచాడు. అంతే ఓటమి తప్పదనుకున్న మ్యాచ్‌లో ఆఫ్రిది సేన వికెట్ తేడాతో శ్రీలంకపై అద్భుత విజయాన్ని సాధించింది. ఫలితంగా రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0తో క్లీన్‌స్వీప్ చేసింది. ఆర్. ప్రేమదాస స్టేడియంలో శనివారం జరిగిన ఈ మ్యాచ్‌లో... టాస్ గెలిచిన లంక 20 ఓవర్లలో 7 వికెట్లకు 172 పరుగులు చేసింది.

కపుగెడెరా (25 బంతుల్లో 48 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్సర్లు), జయసూరియా (32 బంతుల్లో 40; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. సిరివందన (23), కుశాల్ పెరీరా (19) మోస్తరుగా ఆడారు. షోయబ్ మాలిక్ 2 వికెట్లు తీశాడు. తర్వాత పాక్ 19.2 ఓవర్లలో 9 వికెట్లకు 174 పరుగులు చేసింది. ఆఫ్రిది (22 బంతుల్లో 45; 1 ఫోర్, 4 సిక్సర్లు) టాప్ స్కోరర్. లంక బౌలర్ల ధాటికి ఓ దశలో పాక్ 40 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. అయితే ఆఫ్రిది, రిజ్వాన్ (17)లు ఆరో వికెట్‌కు 61 పరుగులు జోడించి ఆదుకున్నారు. చివర్లో అన్వర్ అలీ, వసీమ్‌లు ఎనిమిదో వికెట్‌కు 27 బంతుల్లోనే 58 పరుగులు సమకూర్చారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement