
రాష్ట్రం ప్రశాంతంగా ఉంటే ఆత్మకూరు వెళ్లి..
సాక్షి, అమరావతి : ప్రతిపక్ష నేత, టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు రాష్ట్రం ప్రశాంతంగా ఉంటే ఆత్మకూరు వెళ్లి.. అలజడి సృష్టించడానికి చూస్తున్నారని వైఎస్సార్ సీపీ నేతలు అంబటి రాంబాబు, కాసు మహేశ్ రెడ్డి, లావు క్రిష్ణదేవరాయలు, ముస్తఫా, విడదల రజినిలు ఆరోపించారు. టీడీపీ నేతల అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారని, పెయిడ్ ఆర్టిస్ట్‌లను తీసుకొచ్చి కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. బుధవారం వారు మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ చంద్రబాబు చిల్లర రాజకీయాలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అందిస్తున్న మంచి పరిపాలన చెడగొట్టాలనేదే చంద్రబాబు ఉద్దేశం. మాజీ ఎమ్మెల్యేలను కాపాడుకోవాలనేది చంద్రబాబు ఎత్తుగడ. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ బాధ్యతలు చేపట్టాక ప్రజలు సంతోషంగా ఉన్నారు. పల్నాడు ప్రాంతం చాలా ప్రశాంతంగా ఉంది. ఎక్కడ గొడవలు జరిగాయో చంద్రబాబు చెప్పాలి. ఆయన ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావటం లేదు.
పార్టీకి సంబంధం లేకుండా సంక్షేమ పనులను చేస్తున్నాం. ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టొద్దని చంద్రబాబును కోరుతున్నాం. ఆయన ఐదేళ్ల పాలనంతా అవినీతే. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూకటి వేళ్లతో సహా కూలిపోతోంది. ఐదేళ్ల పాలనలో చంద్రబాబు ఏనాడైనా పల్నాడు వెళ్లారా?. తన పార్టీ కనుమరుగు అవతుందనే అభద్రతా భావం చంద్రబాబులో ఉంది. ఉనికిని కాపాడుకునేందుకు చంద్రబాబు పాట్లు పడుతున్నారు. ఛలో ఆత్మకూరు వెళ్లేందుకు చంద్రబాబుకు ఏం అర్హత ఉంది. పోలీసులను దుర్భాషలాడిన అచ్చెన్నాయుడ్ని క్షమించకూడదు. ఏదో ఒకటి సృష్టించి మీడియాలో ఉండాలనేది బాబు తత్వం’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.