‘ఫరూక్‌కు సొంత రాష్ట్రంలోనే విలువ లేదు’ | YSRCP Leader C Ramachandraiah Slams Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

‘ఫరూక్‌కు సొంత రాష్ట్రంలోనే విలువ లేదు’

Apr 1 2019 2:29 PM | Updated on Apr 1 2019 3:09 PM

YSRCP Leader C Ramachandraiah Slams Chandrababu Naidu - Sakshi

సాక్షి, వైఎస్సార్‌: ఏపీలో చంద్రబాబు నాయుడుకు మద్దతుగా వివిధ రాష్ట్రాల నేతలు ప్రచారం చేయడంపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి సి రామచంద్రయ్య వ్యంగ్యాస్త్రాలు సంధించారు. బాబు లాంటి అవినీతి పరుడికి పలువురు నేతలు మద్దతు పలకడంపై మండిపడ్డారు. సోమవారం వైఎస్సార్‌ జిల్లాలో రామచంద్రయ్య మీడియాతో మాట్లాడుతూ.. నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్‌ అబ్దుల్లాకు సొంత రాష్ట్రంలో, సొంత పార్టీలోనే విలువ లేదని అన్నారు. అవినీతిపై పోరాడి ఢిల్లీ ఎన్నికల్లో గెలిచిన అరవింద​ కేజ్రీవాల్‌.. ఏపీలో అవినీతిపరుడికి ప్రచారం చేయడం దారుణమని వ్యాఖ్యానించారు. దీనివల్ల కేజ్రీవాల్‌ లాంటి వాళ్లకున్న విలువలు తగ్గిపోతాయని పేర్కొన్నారు.

చంద్రబాబు తన స్వార్థం కోసం ఎంత నీచమైనా రాజకీయాలైన చేస్తారని విమర్శించారు. చంద్రబాబు బండరాన్ని కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ బట్టబయలు చేశారని గుర్తుచేశారు. గోయల్‌ చర్చకు రమ్మని సవాల్‌ చేసినా చంద్రబాబు స్పందించలేదన్నారు. కమిషన్‌ కోసమే చంద్రబాబు ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకుని ప్రజల్ని మోసం చేశారని మండిపడ్డారు. చంద్రబాబు పోరాటం ప్రత్యేక హోదాపై కాదని.. సీబీఐ, ఐటీలను రాష్ట్రంలోకి రాకుండా చూసేందుకేనని ఆరోపించారు. టీడీపీ ఎన్నికల ప్రచారంలో పూర్తి అవాస్తవాలను చెబుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ తన ప్రచారంలో చూపిస్తున్న ఇళ్లు.. రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో ఉన్నాయో చూపించాలని డిమాండ్‌ చేశారు. అనంతపురంలోని కియా పరిశ్రమ గురించి చంద్రబాబు ప్రభుత్వం వాస్తవాలు బయట పెట్టలేదని తెలిపారు. రాజధాని అమరావతి గ్రాఫిక్స్‌ మాదిరే టీడీపీ ప్రచార చిత్రాలు ఉన్నాయని ఎద్దేవా చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement