చంద్రబాబుకు సీఎం జగన్‌ సవాల్‌

YS Jagan Open Challenge to Chandrababu Over English medium in govt schools - Sakshi

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుకు సవాల్‌ విసిరారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైఎస్సార్‌ సీపీ ఇంగ్లీష్‌ మీడియం అమలును వ్యతిరేకించిందని చంద్రబాబు వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇంగ్లీష్‌ మీడియం వద్దని తాను ఎప్పుడైనా చెప్పానా అంటూ ముఖ్యమంత్రి సూటిగా ప్రశ్నించారు. దమ్ముంటే ఆధారాలు చూపాలని అన్నారు. పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ-2019 బిల్లుపై గురువారం సభలో చర్చ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ...‘ఆంగ్ల మాధ్యమం వద్దని నేను ఎప్పుడైనా చెప్పానా? మీరు నిరూపించగలరా? అయిదేళ్ల అధికారంలో మీరేం చేశారు? అవ​కాశం ఉండి కూడా మీరు ఇంగ్లీష్‌ మీడియం అమలు చేయలేకపోయారు. 66 శాతం ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మీడియం కొనసాగుతున్నా.. ఏ చర్యలు తీసుకోనందుకు సిగ్గుతో తలదించుకోవాలి. మీడియా అనేది ఓ వ్యవస్థ. దాన్ని మాకు ఆపాదిస్తే ఎలా. ఈనాడులో రాసిన వార్తలపై చర్చ జరిగితే చంద్రబాబు సభలో ఉండలేరు’ అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

‘చంద్రబాబుగారు అసత్యాలు చెప్పకూడదు. ఆయన పెద్దమనిషి, 40 ఏళ్ల ఇండస్ట్రీ అంటారు. జగన్‌మోహన్‌రెడ్డి అనే వ్యక్తి ఇంగ్లీష్‌ మీడియంను వ్యతిరేకించారని చంద్రబాబు రుజువు చేయగలరా? దానికి ఆయన సిద్ధమేనా? సిద్ధమంటే చెప్పాలి ...ఊరికే ఎందుకు అబద్ధాలు చెప్పాలి. అయిదేళ్లు ముఖ్యమంత్రిగా చంద్రబాబు అన్ని ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్‌ మీడియం ప్రవేశపెట్టే అవకాశం ఉంది. మొత్తం 45వేల స్కూళ్లలో అప్పుడు ఎందుకు ప్రవేశపెట్టలేదు. స్కూళ్లలో పరిస్థితులు మార్చి, ఇంగ్లీష్‌ మీడియం ప్రవేశపెట్టే సువర్ణ అవకాశాన్ని ఎందుకు వాడుకోలేదుణ? కానీ చంద్రబాబు చేయలేకపోయారు. నారాయణ, చైతన్య లాంటి ప్రైవేట్‌ స్కూళ్లలో భాగాలు పెట్టుకుని, వాటికి మేలు చేయడానికి మొత్తం ప్రభుత్వ పాఠశాలలను భ్రష్టు పట్టించారు. అలాంటి చంద్రబాబు ఇవాళ ఏవేవో మాట్లాడుతున్నారు. అందులోనూ అబద్ధాలు మాట్లాడుతున్నారు. నిజానికి 40 ఏళ్ల అనుభవం అని చెప్పుకోవడానికి సిగ్గుపడాలి.

ఈనాడులో రాసిన వార్తలపై సభలో నేను మాట్లాడితే ఎలా ఉంటుంది? ఈనాడులో బ్యానర్‌ స్టోరీలుగా రాసిన వాటిమీద ఈ అసెంబ్లీలో చర్చ చేస్తే ఎలా ఉంటుంది? చంద్రబాబుగారికి పాంప్లేట్‌ పేపర్‌ అయినా సరే, ఈనాడులో రాసిన వార్తల మీద నేను మాట్లాడటం మొదలుపెడితే చర్చ అనేది ఎక్కడా ఉండదు. పేపర్లు అనేవి మీడియ వ్యవస్థలు. ఎవరికి అనుకూలమైన పేపర్లు, టీవీలు వారికి ఉంటాయి. ఆ వ్యవస్థలను పట్టుకుని, అందులో రాసిన వార్తలను మనకు ఇష్టం వచ్చినట్లుగా తిప్పుకుని మాట్లాడితే ..అది మేమే చేశాం అన్నట్లుగా మాట్లాడితే బాగుంటుందా? జగన్‌మోహన్‌రెడ్డి అనే వ్యక్తి మాట్లాడి ఉంటే...చంద్రబాబుకు దమ్ము, ధైర్యం, నిజాయితీ ఏదైనా ఉంటే దాన్ని నిరూపించాలి’ అని  ముఖ్యమంత్రి సభలో సవాల్‌ చేశారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top