బీజేపీ మదిలో గత కాలపు జ్ఞాపకాలు

Why Shiv Sena Rotational Chief Ministership Demand Stings BJP - Sakshi

ముంబై : మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై అదే సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. ముఖ్యమంత్రి పీఠంపై బీజేపీ, శివసేన మధ్య విభేదాలు కొనసాగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. శివసేనకు రెండున్నరేళ్లపాటు సీఎం పదవిని అప్పగిస్తామని తామెన్నడూ హామీ ఇవ్వలేదని కుండబద్దలు కొట్టిన విషయం తెలిసిందే. సీఎం పదవిని 50:50 ఫార్ములా ప్రకారం పంచుకుంటే గతంలో ఉత్తరప్రదేశ్‌, కర్ణాటకలలో ఎదురైన అనుభవాలు ఇక్కడ కూడా వెంటాడుతాయా అనే భయం బీజేపీని కలచివేస్తోంది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి పదవి విషయంలో శివసేనకు ఎలాంటి హామీ ఇవ్వలేదని సీఎం ఫడ్నవీస్‌ ప్రకటించిన కొన్ని గంటలకే శివసేన తీవ్రస్థాయిలో స్పందించింది. తదుపరి ప్రభుత్వ ఏర్పాటుపై రెండు పార్టీల మధ్య జరుగాల్సిన చర్చలను శివసేన అధినేత ఉద్ధవ్‌ ఠాక్రే పూర్తిగా రద్దు చేసుకున్నారు. ఫడ్నవీస్‌‌‌‌‌‌‌‌ చేసిన వ్యాఖ్యల వల్లే ఈ పరిస్థితి వచ్చినట్టు తెలుస్తోంది. 

అప్పటి మాటేంటి సీఎం గారూ..?
బీజేపీతో ఉన్న అవగాహన ఒప్పందాన్ని తాజాగా శివసేన నేత హర్షల్ ప్రధాన్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకొన్నాయి. తదుపరి ప్రభుత్వంలో ఐదేండ్లపాటు తానే ముఖ్యమంత్రిగా కొనసాగుతానని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ తేల్చి చెప్పిన సందర్భంగా.. లోక్‌సభ ఎన్నికలకు ముందు బీజేపీతో జరిగిన ఒప్పందాలను ఠాక్రే సన్నిహితుడు హర్షల్‌ ప్రధాన్‌ బయటపెట్టాడు.

50-50 ఫార్ములాపై ఫడ్నవీస్‌ మాట్లాడిన వీడియో క్లిప్పింగ్‌ను విడుదల చేసి ఆయనకు కౌంటర్‌ ఇచ్చింది. మళ్లీ మేం అధికారంలోకి వస్తే, పదవులు, బాధ్యతలు సమానంగా పంచుకోవాలని నిర్ణయించాం అని ఫిబ్రవరి 28న ఫడ్నవీస్‌ మీడియాతో మాట్లాడుతున్న ఓ వీడియోను ఠాక్రే సన్నిహితుడు హర్షల్‌ ప్రధాన్‌ విడుదల చేశారు. 'హామీని కాస్త గుర్తు తెచ్చుకోండి' అంటూ దానికి క్యాప్షన్‌ ఇచ్చారు. అయితే దీనికి బీజేపీ నేత, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్పందిస్తూ.. శివసేనకు మేము సీఎం పదవి విషయంలో ఎలాంటి హామీ ఇవ్వలేదని స్పష్టం చేశారు. ఈ మధ్య జరిగిన శివసేన పార్టీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా చేసిన కొన్ని వ్యాఖ్యలను శివసేన తాజాగా ప్రస్తావిస్తున్నది. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ హాజరైన ఆ కార్యక్రమంలో రానున్న రోజుల్లో శాసనసభను కాషాయ రంగుతో నింపేస్తామని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. 54వ వ్యవస్థాపక దినోత్సవం రోజున శివసేన పార్టీకి చెందిన ముఖ్యమంత్రి ఆ కార్యక్రమంలో పాలుపంచుకొంటారు అని అధికార పత్రిక సామ్నాలో పేర్కొన్న విషయాన్ని ఈ సందర్భంగా బయటపెడుతున్నారు. 

చదవండి : డౌటే లేదు.. నేనే సీఎం: ఫడ్నవిస్‌

బీజేపీని వెంటాడుతున్న గత అనుభవాలు :
అన్ని విషయాలను పక్కనపెట్టి శివసేనకు ముఖ్యమంత్రి పీఠం ఇస్తే గతంలో యూపీలో జరిగిన సంఘటనలను గుర్తుంచుకొని ఈ విషయంపై తర్జనభర్జన పడుతోంది. 1997లో ఉత్తరప్రదేశ్‌లో ఏ పార్టీకి సంపూర్ణ మెజారిటీ రాలేదు. ఆ సమయంలో బీజేపీ 175 స్థానాల్లో, బీఎస్పీ 67 స్థానాల్లో గెలిచి ఓ ఒప్పందం ప్రకారం మాయావతి సీఎం పీఠాన్ని అధిరోహించారు. ఒప్పందం ప్రకారం కొద్ది రోజులకు బీజేపీ అభ్యర్థి కల్యాణ్‌సింగ్‌కు సీఎం బాధ్యతలు అప్పగించినా బలనిరూపణ సమయంలో బీఎస్పీ మద్దతు ఉపసంహరించుకొని బీజేపీకి గట్టి షాకిచ్చింది.

2004 ఎన్నికలలో కూడా కర్ణాటకలో ఇదే విషయం పునరావృతమైంది. బీజేపీ అత్యధిక స్థానాలు గెలుచుకొని పెద్ద పార్టీగా ఆవిర్భవించినా జేడీఎస్‌తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. సీఎం ధరమ్‌సింగ్‌పై అవినీతి ఆరోపణలు రావడంతో ప్రభుత్వం పడిపోయింది. ఈ సమయంలో బీజేపీ నేత యడియూరప్ప జేడీఎస్‌తో ఒప్పందం కుదుర్చుకొని ప్రభుత్వాన్ని తిరిగి ఏర్పాటు చేశారు. అయితే ముఖ్యమంత్రిగా బాధ్యతలు కుమారస్వామికి అందించారు. ఒప్పందం ప్రకారం జేడీఎస్‌ కాలపరిమితి ముగిసాక బీజేపీకి మద్దతివ్వడానికి నిరాకరించింది. కాగా నేడు శివసేన విషయంలో కూడా ఇలాంటి పరిస్థితులే ఎదురవుతాయేమోనన్న భయం బీజేపీని వెంటాడుతోంది. అందుకోసమే సీఎం పీఠం విషయంపై బీజేపీ ఇంత రాద్ధాంతం చేస్తోందనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది.

చదవండి : ( ఎవరి పంతం వారిది! )

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top