సుమారు పాతికేళ్లపాటు కొనసాగిన థాక్రే ఆధిపత్యానికి ముగింపు పలుకుతూ.. ముంబై మున్సిపల్ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించింది బీజేపీ. ఈ విజయంలో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌కే సింహ భాగం కట్టబెడుతున్నారంతా. వాస్తవానికి గత ఎన్నికల్లోనే ముంబై మేయర్ పదవిని బీజేపీ తృటిలో చేజార్చుకుంది. ఆ టైంలో.. 82 స్థానాలు నెగ్గినప్పటికీ మిత్రపక్షంగా ఉన్న శివసేన కంటే కేవలం రెండే సీట్లు వెనకబడిపోయింది. అయితే..
ఈసారి మహాయుతికి స్పష్టమైన బలం ఉండడంతో ముంబై మేయర్ పీఠం బీజేపీదే అనుకుంటున్న టైంలో.. హైడ్రామా మొదలైంది. నిన్న బృహణ్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఎన్నికల ఫలితాల్లో జోరు కొనసాగుతున్న టైంలోనే.. పదవిపై బీజేపీ, ఏకనాథ్ శిండే శివసేన మధ్య అంతర్గత చర్చలు ప్రారంభమయ్యాయి. మొత్తం 227 స్థానాలున్న బీఎంసీలో మ్యాజిక్ ఫిగర్ 114. బీజేపీ 89 వార్డుల్లో గెలిచి అతిపెద్ద పార్టీగా నిలిచింది. శిండే శివసేన కేవలం 29 స్థానాలు సాధించింది. అజిత్ పవార్ ఎన్సీపీ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ఈ లెక్క ప్రకారం బీజేపీకి మేయర్ పదవి దక్కాలంటే శిండే వర్గం మద్దతు తప్పనిసరి.
దీంతో.. షిండే వర్గానికి కింగ్‌మేకర్ స్థానం దక్కినట్లయ్యింది. శిండే వర్గంలోని కీలక నేతలు ఇప్పటికే “ముంబై మేయర్ శివసేన వర్గానిదే కావాలి. ఇది బాలాసాహెబ్ థాక్రే వారసత్వం” అని ప్రకటనలు చేసుకుంటూ వస్తోంది. అయితే షిండే మాత్రం “మహాయుతి కూటమిగా పోరాడాం. ముంబై అభివృద్ధి కోసం కలిసి నిర్ణయం తీసుకుంటాం” అని ప్రకటించి ట్విస్ట్ ఇచ్చారు. దీంతో ఏం జరగబోతోందా? అనే ఉత్కంఠ నెలకొంది.
ఏం జరగొచ్చు!
మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల్లో 131 స్థానాలున్న థానేలో సీన్ రివర్స్‌గా ఉంది. అక్కడ షిండే శివసేన ఏకంగా 75 సీట్లు సాధించింది. బీజేపీ 28 స్థానాలు దక్కించుకుంది. దీంతో మిత్రపక్షం మద్దతు అవసరం లేకుండానే షిండే సేన మేయర్ పదవి దక్కించుకోబోతోంది. అయితే ముంబై విషయంలో అలా కాదు. అయితే మేయర్ పదవిని రెండు భాగాలుగా పంచుకునే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
అంటే, 2.5 సంవత్సరాలకుగానూ(పవర్‌షేరింగ్ ఫార్ములా) షిండే వర్గం, మిగతా కాలం బీజేపీకి దక్కేలా ఒప్పందం కుదిరే అవకాశముందని ప్రచారం నడుస్తోంది. అలాగే మేయర్ పదవిపై తుది నిర్ణయం తీసుకునే ముందు ఉపమేయర్, స్టాండింగ్ కమిటీ చైర్మన్ పదవులు, కీలక వార్డులపై గట్టి చర్చలు జరగడం ఖాయమనే చెప్పొచ్చు. అయితే అంత మెజారిటీ సాధించిన బీజేపీ.. మేయర్ సీటును త్యాగం చేస్తుందా? అనేదానిపై అనుమానాలు నెలకొన్నాయి. లేదంటే.. ఈ వంకతో బీఎంసీ ముఖ్య కమిటీలపై షిండే శివసేన ఆధిపత్యం సాధించే ప్రయత్నం చేయవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.


