‘దమ్ముంటే విచారణ ఎదుర్కోండి’

Vasireddy Padma Fires On Chandrababu Over TTD Issue - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తనది అవినీతి పాలన కాదంటూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు. శుక్రవారం ఆమె పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ...ఓవైపు అత్యంత అవినీతి మయమైన రాష్ట్రాల్లో ఏపీ రెండో స్థానంలో ఉందని నివేదికలు చెబుతుంటే చంద్రబాబు ఈవిధంగా మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. తిరుమల తిరుపతిలో స్వామి వారి ఆభరణాలను దోచుకునే పద్ధతికి తెరలేపారని రమణ దీక్షితులు ఆరోపిస్తున్నారని.. ఈ విషయంపై సీబీఐ విచారణ జరిపించాల్సిన అవసరం ఉందని వాసిరెడ్డి పద్మ డిమాండ్‌ చేశారు. కోట్లాది మంది భక్తులున్న స్వామివారి విషయంలో నోరు విప్పకుండా.. చంద్రబాబు నాటకాలడుతున్నారని.. దేవుడిపై కూడా పెత్తనం చేయాలని చూస్తున్నారని విమర్శించారు. తెలుగుదేశం పార్టీని గెలిపించినందుకు ఈరోజు అన్ని వర్గాల ప్రజలు బాధ పడుతున్నారంటూ పద్మ వ్యాఖ్యానించారు.

దమ్ముంటే విచారణ ఎదుర్కోండి..
అనేక కేసుల్లో ముద్దాయిగా ఉన్న చంద్రబాబు స్టేలు తెచ్చుకుంటూ బతుకుతున్న విషయం అందరికీ తెలిసిందేనని పద్మ వ్యాఖ్యానించారు. ప్రతిపక్షంపై ఆరోపణలు చేస్తూ తప్పించుకోవడం కాదని.. దమ్ముంటే చంద్రబాబు విచారణ ఎదుర్కోవాలని ఆమె డిమాండ్‌ చేశారు. లక్ష్మీ పార్వతి, హరికృష్ణ ఇలా సొంత కుటుంబ సభ్యులే విమర్శిస్తున్నా బాబు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారని అన్నారు. నీరు- చెట్టు కార్యక్రమ నిధులన్నీ తెలుగుదేశం కార్యకర్తలకు దోచిపెట్టారని ఆరోపించారు. అవినీతిని ఏరులుగా పారిస్తున్న చంద్రబాబు ఇప్పటికైనా ప్రజలకు సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్‌ చేశారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top