‘స్థానికం’ పునరావృతం

TRS Planned To Win Municipal Elections In Telangana - Sakshi

మున్సిపల్‌ ఎన్నికలే లక్ష్యంగా టీఆర్‌ఎస్‌ వ్యూహం

ఇప్పటికే మున్సిపాలిటీల వారీగా వివరాల సేకరణ

ఒకట్రెండు రోజుల్లో పార్టీ ఇన్‌చార్జులతో కేటీఆర్‌ సమావేశం

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని 120 మున్సిపాలిటీలు, 10 మున్సిపల్‌ కార్పొరేషన్ల పాలక మండళ్లకు జనవరి 22న ఎన్నిక నిర్వహించేలా రాష్ట్ర ఎన్నికల సంఘం సోమవారం షెడ్యూల్‌ ప్రకటించింది. మున్సిపల్‌ ఎన్నికలకు మార్గం సుగమం కావడంతో మెజారిటీ మున్సిపాలిటీల్లో విజయం సాధించడం లక్ష్యంగా ప్రణాళికను టీఆర్‌ఎస్‌ ఇప్పటికే ప్రాథమికంగా రూపకల్పన చేసింది. సుమారు 6 నెలలుగా పావులు కదుపుతున్న టీఆర్‌ఎస్‌.. ఇప్పటికే మున్సిపాలిటీల వారీగా ప్రజా సమస్యలు, పార్టీ పరిస్థితిపై సమాచారాన్ని సేకరించింది.

ఈ ఏడాది జూన్‌లో సభ్యత్వ నమోదు కార్యక్రమం మొదలుకుని పలు దశలుగా మున్సిపాలిటీలు, వార్డుల వారీగా సమాచారాన్ని సేకరించింది. 17 లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలోని మున్సిపాలిటీల వారీగా సమాచారాన్ని సేకరించి క్రోఢీకరించే బాధ్యతను 64 మంది పార్టీ ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులకు ఇన్‌చార్జులకు అప్పగించారు. మున్సిపాలిటీల్లో ప్రజా సమస్యలు, వార్డుల వారీగా పార్టీ పరిస్థితి, గత మున్సిపల్‌ ఎన్నికల్లో వార్డుల వారీగా వివిధ పార్టీలు సాధించిన ఓట్లు, 2018 అసెంబ్లీ, 2019 లోక్‌సభ ఎన్నికల్లో మున్సిపాలిటీలు, బూత్‌ల వారీగా టీఆర్‌ఎస్‌ సాధించిన ఓట్లు తదితర వివరాలను పార్టీ ఇన్‌చార్జులు సేకరించి.. కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌కు నివేదికలు అందజేశారు.

మూడు పర్యాయాలు కేటీఆర్‌ భేటీ 
మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణపై ఓవైపు సందిగ్ధత కొనసాగుతున్నా పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ మూడు దశలుగా పార్టీ ఇన్‌చార్జులతో సమావేశం నిర్వహించారు. మున్సిపాలిటీల వారీగా పార్టీ పరిస్థితిని సమీక్షించారు. మున్సిపాలిటీల్లో నెలకొన్న సమస్యల పరిష్కారంపై పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలను అప్రమత్తం చేశారు. మరోవైపు తాము ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి జిల్లాల్లోని మున్సిపాలిటీల్లో మంత్రులు ఇప్పటికే సన్నాహక సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్నారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో 32 జిల్లా పరిషత్‌ పీఠాలను కైవసం చేసుకున్న టీఆర్‌ఎస్, మున్సిపల్‌ ఎన్నికల్లో అదే రకమైన ఫలితాన్ని పునరావృతం చేయాలని భావిస్తోంది. వార్డులు, డివిజన్లు, మున్సిపాలిటీల వారీగా రిజర్వేషన్లు ప్రకటించిన వెం టనే స్థానిక పరిస్థితులకు అనుగుణంగా గెలుపు గుర్రాలను పార్టీ అభ్యర్థులుగా ప్రకటించాలని భావిస్తోంది. ఇప్పటికే వార్డు స్థాయిలో ఇతర పార్టీలకు చెందిన బలాబలాలను కూడా అంచనా వేయడంతో పాటు, అవసరమైన చోట ఇతర పార్టీల నుంచి వలసలు ప్రోత్సహించాలని నిర్ణయించింది.

దిశా నిర్దేశం చేసేందుకు....
పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా, మున్సిపల్‌ వ్యవహారాల శాఖ మంత్రిగానూ కేటీఆర్‌ బాధ్యతలు నిర్వర్తిస్తుండటంతో పురపోరును టీఆర్‌ఎస్‌ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. మున్సిపల్‌ ఎన్నికలపై పార్టీ యంత్రాంగానికి దిశా నిర్దేశం చేసేందుకు ఒకట్రెండు రోజుల్లో పార్టీ ఇన్‌చార్జులు, ఇతర ముఖ్య నేతలతో కేటీఆర్‌ సమావేశం నిర్వహించే అవకాశం ఉంది. పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్‌ నుంచే ఆదేశాల ప్రకారం అభ్యర్థుల ఎంపిక, ప్రచారం, సమన్వయం తదితర అంశాలపై పార్టీ నేతలకు కేటీఆర్‌ దిశా నిర్దేశం చేయనున్నారు. పట్టణ ప్రాంతాల్లో బీజేపీ, ఏఐఎంఐఎం కొన్ని చోట్ల ప్రభావం చూపే అవకాశం ఉండటంతో, ఆ రెండు పార్టీల విషయంలో అనుసరించా ల్సిన వ్యూహంపైనా స్పషతిచ్చే అవకాశం ఉందని పార్టీ ముఖ్య నేత ఒకరు తెలిపారు. కాగా, వార్డు స్థాయిలో సోషల్‌ మీడి యా కమిటీల ప్రచారానికి ప్రత్యేక వ్యూహాన్ని సిద్ధం చేస్తోంది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top