‘కాళేశ్వరం’పై తీరు మార్చుకోరా?

TRS Leaders Meets Central Minister Gadkari In Delhi On Kaleshwaram Issue - Sakshi

ప్రతిపక్షాలపై మంత్రి హరీశ్‌ ఫైర్‌

ప్రాజెక్టును అడ్డుకునేందుకు 86 కేసులేశారు

కాళేశ్వరంపై సుప్రీంకోర్టు మరో కేసు కొట్టేయడంపై హర్షం

ప్రాజెక్టులకు నిధులపై ఢిల్లీలో కేంద్ర మంత్రి గడ్కరీతో భేటీ 

సాక్షి, న్యూఢిల్లీ: కాళేశ్వరం ప్రాజెక్టును ఏదో ఒక రకంగా అడ్డుకోవాలని ప్రతిపక్ష కాంగ్రెస్, టీడీపీ, కోదండరాం పార్టీ నేతలు కుట్రలు పన్నుతున్నారని మంత్రి హరీశ్‌రావు దుయ్యబట్టారు. సాగునీటి ప్రాజెక్టులకు నిధులు, జాతీయ రహదారుల పనులు ప్రారంభం తదితర అంశాలపై చర్చించేందుకు హరీశ్‌  సోమవారం ఢిల్లీలో కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీతో భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రాజెక్టును అడ్డుకోవాలన్న ఏకైక లక్ష్యంతో హైకోర్టులో 80 కేసులు, జాతీయ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ (ఎన్జీటీ)లో 3 కేసులు, సుప్రీంకోర్టులో 3 కేసులు మొత్తంగా 86 కేసులు వేశారన్నారు.

ప్రాజెక్టుకు అను మతులు లేవంటూ ఒకసారి, ఇచ్చిన అనుమతులు చెల్లవంటూ మరోసారి, పర్యావరణ, అటవీ సంపద దెబ్బతింటుందని, వన్యప్రాణులకు రక్షణ లేకుండా పోతుందని చనిపోయిన వారి పేర్ల మీద కూడా కోర్టుల్లో కేసులేస్తున్నారని విమర్శించారు. ప్రాజెక్టుకు 90 శాతం మంది ప్రజలు స్వచ్ఛందంగా భూములిచ్చి పూర్తి సహకారం అందిస్తుండటంతో ప్రతిపక్షాలకు ఏం చేయాలో పాలుపోక జంతు సంపదకు నష్టం వాటిల్లుతుందంటూ కేసులు వేస్తున్నారన్నారు. ఏ కోర్టూ ఈ ప్రాజెక్టు పనులు నిలిపేయాలని ఆదేశాలివ్వలేదన్నారు. మొదట్లో ఎన్జీటీ ఆదేశాల్చినా వాటిని హైకోర్టు తోసిపుచ్చిందని గుర్తుచేశారు.

కోర్టులు కూడా పిటిషనర్లపై తీవ్ర స్థాయిలో మండిపడ్డాయన్నారు. ప్రాజెక్టుపై గతంలో దాఖలైన ఒక కేసు విచారణ సందర్భంగా ఇది ఫోరం హంటింగ్‌లా ఉందం టూ సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్య చేసిందని గుర్తుచేశారు. ప్రాజెక్టుపై పక్క రాష్ట్రాలకు లేని అభ్యంతరాలు మీకెందుకంటూ సోమవారం మరో కేసు విచారణ సందర్భంగా పిటిషనర్‌ను సుప్రీంకోర్టు ప్రశ్నించిందని హరీశ్‌ పేర్కొన్నారు. తాజా పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. కోర్టులు ఎన్నిసార్లు మొట్టికాయలు వేసినా బుద్ధి రావట్లేదా? అని ప్రతిపక్షాలను ప్రశ్నించారు. ప్రతిపక్ష పార్టీలు ఇకనైనా తమ కుట్రలను మానుకోవాలన్నారు.
 
కాంగ్రెస్, బాబు మూకుమ్మడి ప్రయత్నాలు
కాళేశ్వరం ప్రాజెక్టును అడ్డుకునేందుకు విపక్షాలు చెయ్యని ప్రయత్నమంటూ లేదని, ఒకవైపు తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు మరోవైపు ఏపీ సీఎం చంద్రబాబు ప్రాజెక్టును అడ్డుకోవాలని చూస్తున్నారని హరీశ్‌రావు మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టును ఆపాల్సిందిగా చంద్రబాబు ఢిల్లీకి పదేపదే లేఖలు రాస్తున్నారన్నారు. తెలంగాణ ప్రజల నోటికాడ ముద్ద లాగేసేం దుకు మూకుమ్మడిగా ప్రయత్నిస్తూ ప్రాజెక్టును పద్మవ్యూహంలో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.  

కాంగ్రెస్‌ రూ.కోట్లు దోచింది... 
కాంగ్రెస్‌ పార్టీ 2007లో ప్రాణహిత–చేవెళ్లను ప్రారంభించి 8 ఏళ్లపాటు ప్రాజెక్టు కోసం ఏ అనుమతి సాధించకపోగా మొబిలైజేషన్, సర్వే పేరుతో రూ.2,400 కోట్లు దోచేసిందని హరీశ్‌రావు ఆరోపించారు. తమ్మిడిహెట్టి వద్ద నీటి లభ్యత లేదని సీడబ్ల్యూసీ 2008లో లేఖ రాసినా కాంగ్రెస్‌ పట్టించుకోలేదన్నారు. అప్పుడు కేంద్రంలో, రాష్ట్రంలో, మహారాష్ట్రలో అధికారంలో ఉన్నా ఎవరూ దీనిపై స్పందించలేదన్నారు. తాము అధికారంలోకి వచ్చాక మార్చిన డిజైన్‌ను సీడబ్ల్యూసీ ప్రశంసించిందన్నారు. ప్రాజెక్టు పనులు జరుగుతున్న తీరును పరిశీలించాలని సీడబ్ల్యూసీ ఇంజనీర్లను కూడా పంపిందన్నారు. తెలంగాణ ఏర్పడ్డాక తాము అతితక్కువ కాలంలో ప్రాజెక్టు  అనుమతులన్నీ సాధించగలిగామన్నారు.  

ప్రాజెక్టులకు వాటా నిధులు విడుదల చేయండి 
- కేంద్ర మంత్రి గడ్కరీని కోరిన మంత్రి హరీశ్‌రావు 

తెలంగాణలో నిర్మాణ దశలో ఉన్న వివిధ ఏఐబీపీ ప్రాజెక్టులకు సీఏడబ్ల్యూఎం ఇన్సెంటివైజేషన్‌ పథకం కింద కేంద్ర వాటాగా విడుదల కావాల్సిన నిధులను వెంటనే విడుదల చేయాలని కేంద్ర జలవనరుల, రవాణాశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీని మంత్రి హరీశ్‌రావు కోరారు. సోమవారం ఢిల్లీలో కేంద్ర మంత్రిని ఆయన కార్యాలయంలో కలసిన హరీశ్‌... ఈ త్రైమాసికంలో వివిధ ప్రాజెక్టులకు విడుదల కావాల్సిన కేంద్ర నిధుల వివరాలు అందజేశారు. మహబూబ్‌నగర్‌లోని భీమా ప్రాజెక్టుతోపాటు అదిలాబాద్‌ జిల్లాలోని నీల్వాయి, ర్యాలివాగు, మత్తడివాగు, కొమురం భీం, గొల్లవాగు ప్రాజెక్టులకు క్వార్టర్‌లో రూ. 60 కోట్లు విడుదల కావాల్సి ఉందని కేంద్ర మంత్రికి వివరించారు.

దీంతో సంబంధిత అధికారులను పిలిపించిన కేంద్ర మంత్రి... నిధుల విడుదల ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించినట్లు హరీశ్‌రావు మీడియాకు తెలిపారు. అలాగే తెలంగాణలోని ఏడు జాతీయ రహదారులకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నిధులు విడుదల చేయాలని కోరారు. వీటిలో సిద్దిపేట–ఎల్కతుర్తి, జనగామ–దుద్దెడ, మెదక్‌–ఎల్లారెడ్డి, ఫకీరాబాద్‌–బైంసా, వలిగొండ–తొర్రూరు, నిర్మల్‌–ఖానాపూర్‌ జాతీయ రహదారుల పనులు ప్రారంభించేందుకు నిధులు విడుదల చేయాలని కోరారు. దీనిపైనా కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించినట్లు హరీశ్‌ మీడియాకు వివరించారు. గడ్కరీని కలసిన వారిలో ఎంపీలు వినోద్‌ కుమార్, కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌ ఉన్నారు.   

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top